అక్రమాల చరిత్రే


Wed,September 12, 2018 02:35 AM

Jagga Reddy arrested sent in judicial remand

-సెటిల్‌మెంట్లు.. రౌడీయిజం.. జగ్గారెడ్డి రాజకీయానికి పునాదులివే
-మనుషుల అక్రమ రవాణా కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
-పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేసిన మార్కెట్ పోలీస్
-నేరం రుజువైతే జీవితఖైదుకు అవకాశం

హైదరాబాద్/సిటీ బ్యూరో నమస్తే తెలంగాణ:తూర్పు జయప్రకాశ్‌రెడ్డి.. అలియాస్ జగ్గారెడ్డి.. సంగారెడ్డికి చెందిన ఈ కాంగ్రెస్ నాయకుడిది ఆదినుంచీ అక్రమాల చరిత్రే. భూదందాలు.. సెటిల్మెంట్లు.. రౌడీయిజం పునాదులపైనే నాయకుడిగా ఎదిగారని, ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. కాసులకు కక్కుర్తిపడి ఏకంగా కుటుంబసభ్యులనే ఏమార్చారు. 2004లో కుటుంబసభ్యుల పేరుతో మనుషులను అక్రమంగా రవాణే చేశారన్న కేసు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. నకిలీ పత్రాలు.. నకిలీ డాక్యుమెంట్లతో ఇతరులను అమెరికాకు తీసుకెళ్లిన కేసులో సోమవారం రాత్రి అరెస్టయిన జగ్గారెడ్డిని మంగళవారం గాంధీ దవాఖానలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

అధికార దుర్వినియోగం

2004లో సంగారెడ్డి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన జగ్గారెడ్డి.. ఎమ్మెల్యే హోదాలో రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి లేఖరాస్తూ తనతోపాటు తన కుటుంబసభ్యులకు పాస్‌పోర్ట్‌లు ఇవ్వాలని కోరారు. తన భార్య నిర్మల, కూతురు జయలక్ష్మి, కొడుకు భరత్‌సాయిరెడ్డి అని పేర్లను పేర్కొన్నారు. పేర్లు కుటుంబసభ్యులవే అయినప్పటికీ.. దరఖాస్తు ఫారంలో ఫొటోలు మాత్రం వేరే వాళ్లవి అతికించారు. ఇందుకు అనుగుణంగా కూతురు.. కొడుకు పుట్టిన తేదీలను మార్చేశారు. పాస్‌పోర్టు తీసుకొనేనాటికి కూతురు వయస్సు ఏడేండ్లు కాగా (ఆధార్ కార్డు ప్రకారం 7-7-1997) సంగారెడ్డిలోని తేజ జూనియర్ కాలేజీ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్‌లో 3-9-1987గా రాయించి తెప్పించారు. కొడుకు భరత్ వయసు (వాస్తవంగా 25-3-2000) ను కూడా సంగారెడ్డిలోని కరుణ స్కూల్ నుంచి 5-3-1989 రాయించి బోనఫైడ్ సర్టిఫికెట్ తెప్పించి దరఖాస్తుకు జతచేశారు. ఎమ్మెల్యే అధికారిక లెటర్‌హెడ్‌పై లేఖ రావడంతో పాస్‌పోర్ట్‌లను వేగంగానే జారీచేశారు. ఈ పాస్‌పోర్ట్‌లు, ఇవే నకిలీ పత్రాలతో చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్ నుంచి జగ్గారెడ్డితోపాటు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అమెరికాకు వెళ్లారు. ఈ ముగ్గురితోపాటు ఇంగ్లీష్ తెలిసిన (జగ్గారెడ్డికి ఇంగ్లీష్ రాదు) కాంగ్రెస్ నేత జెట్టి కుసుమకుమార్‌తో కలిసి జగ్గారెడ్డి న్యూయార్క్‌కు వెళ్లి అక్కడ ముగ్గురిని వదిలేసి వెనక్కి వచ్చారు. అమెరికాలో దిగిపోయిన ముగ్గురు వ్యక్తులు ఎవరనే విషయం ఇప్పటికీ నిర్ధారణ కాలేదని డీసీపీ సుమతి తెలిపారు. వారు ఇప్పటికీ భారత్‌కు తిరిగిరాలేదని స్పష్టంచేశారు. ఇందుకోసం ముగ్గురు వ్యక్తులకు కలిపి రూ.15 లక్షలు జగ్గారెడ్డి తీసుకొన్నారు.

పక్కా అధారాలతోనే అరెస్టు

పక్కా ఆధారాలతోనే జగ్గారెడ్డిపై కేసు నమోదుచేసి అరెస్టుచేశామని డీసీపీ సుమతి చెప్పారు. ఐపీసీ 420, 467, 468, 471, 409, 370 ప్రకారం సెక్షన్ 12 పాస్‌పోర్టు యాక్టు 1967, సెక్షన్ 2 ఇమ్మిగ్రేషన్ యాక్టు 1983 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. సెక్షన్ 467 ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసానికి పాల్పడినందుకు జీవిత ఖైదు లేదంటే పదేండ్ల జైలు, జరిమానా పడే అవకాశాలు, సెక్షన్ 420 కింద ఏడేండ్ల వరకు, సెక్షన్ 370 కింద ఒకరి కంటే ఎక్కువ మానవ అక్రమ రవాణాకు పాల్పడినందుకు పదేండ్ల నుంచి జీవిత ఖైదు శిక్ష పడే అవకాలున్నాయని డీసీపీ వివరించారు.

తప్పించుకోలేనని తెలుసు: జగ్గారెడ్డి!

నేను 2004లో కమీషన్ కోసం ముగ్గురు వ్యక్తులను నా కుటుంబసభ్యులుగా చెప్పి అమెరికాకు తీసుకెళ్లిన విషయం వాస్తవమే. నా పీఏ ద్వారా మధు అనే బ్రోకర్ ఈ విషయాన్ని నా దగ్గరకు తెచ్చాడు. నేను చేసింది తప్పు అని నాకు తెలుసు. ఇది ఎప్పటికైనా చుట్టుకుంటుందని నేను అనుకుంటూనే ఉన్నాను. పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇంక నేను తప్పించుకోలేనని నాకు తెలుసు అని జగ్గారెడ్డి పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

స్వాతంత్య్ర సమరయోధుల పేరిట భూదందా

2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నేతల కన్ను మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లోని కోట్ల రూపాయల విలువైన సర్కార్ భూములపై పడింది. రియల్ బ్రోకర్లు, ఏజెంట్లు ప్రజాప్రతినిధులు చేతులు కలిపి 19 మంది స్వాతంత్య్రసమరయోధుల కుటుంబాలకు భూమి కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేయించారు. అప్పుడు పటాన్‌చెరు నియోజకవర్గ అసైన్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న జగ్గారెడ్డి ఈ వ్యవహారంలో చక్రం తిప్పి 14 మందిని ఎంపికచేశారు. వీరిలో ఏడుగురికి రూ.250 కోట్ల విలువైన 35 ఎకరాల భూమిని కేటాయించారు. జాబితాలో ఉన్నవారికి తమకు భూములిచ్చిన సంగతే తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా మొత్తం భూమిని హాంఫట్ చేసేశారు.

మాజీ సైనికుడి పేరుతో దర్జాగా కబ్జా

ప్రస్తుత సంగారెడ్డి జిల్లా కందికి చెందిన మాజీ సైనికుడు సయ్యద్ షంషుద్దీన్ పేరుమీద ఐదెకరాల భూమి ఉన్నట్టు రికార్డుల్లో సృష్టించి, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, బెంగళూరు హైవే సమీపంలోని రూ.15 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేశారన్న వార్తలువచ్చాయి. ముందుగా సదరు భూమిని అనుభవిస్తున్న తొమ్మిది మందిని.. ఆ భూమి స్వచ్ఛందంగా వదులుకొంటున్నట్లు బలవంతంగా పత్రాలు రాయించుకొని.. షంషుద్దీన్ పేరుమీదకు మార్చి మరీ కొట్టేశారు.

9199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles