అవినీతే ముంచింది!


Fri,May 24, 2019 03:30 AM

Jagan Reddy pummels Chandrababu Naidu in ap

-ఉచిత ఇసుక విధానంతో రెచ్చిపోయిన పచ్చనేతలు
-అడ్డుకున్న అధికారులపై ఎమ్మెల్యేల దాడులు
-పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒకవైపు ఇసుక దందా.. మరోవైపు పోలవరం పేరిట వేల కోట్లు పక్కదారి.. అడ్డువచ్చిన అధికారులపై దాడులకు తెగబడిన ప్రజాప్రతినిధులకు అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు.. ఇవే ఏపీలో చంద్రబాబు పాలనను అంతం చేశాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏపీలో ఇసుకమాఫియా దోపిడీ రూ.12,500 కోట్లు ఉంటుందని ఒక అంచనా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించిందంటే ఈ దందా ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. సీఎం చంద్రబాబు అండతో ఏపీలో దాదాపు 500కుపైగా ఇసుకరీచ్‌లను టీడీపీ నాయకులు తమ దోపిడీకేంద్రాలుగా మార్చుకొన్నారు.

దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే అధికారపార్టీ నేతలు దాడులకు దిగారు. చంద్రబాబు సొంతజిల్లా చిత్తూరులో ఇసుక మాఫియాకు అడ్డుపడినవారిని పోలీస్‌స్టేషన్ ఎదుటే ఇసుక ట్రాక్టర్లతో తొక్కించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇసుక అక్రమ తవ్వకాన్ని ప్రశ్నించినందుకు మహిళా తాసిల్దార్ వనజాక్షిపై దాడిచేసిన ప్రభుత్వవిప్ చింతమనేని ప్రభాకర్‌కు చంద్రబాబే అండగా నిలబడ్డారు. పర్మిట్లులేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకున్న అధికారులపై అనంతపురం జిల్లాలో దాడులు జరిగాయి. తుంగభద్ర నది మధ్యలో ఓ మంత్రి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా నాలుగు కిలోమీటర్లు రహదారిని ఏర్పాటుచేసి ఇసుకను తరలింపునకు పాల్పడ్డారు. ఇక్కడి నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు.

పాలసీనే మార్చేశారు

వాస్తవానికి ఇసుక తరలింపును మహిళా సంఘాలకు కేటాయించి వారికి ఆదాయవనరుగా మార్చాలని నిర్ణయించారు. అయితే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చక్రం తిప్పి.. మహిళా సంఘాల పేరుతో బంధువర్గాన్ని రంగంలోకి దింపడంతో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. దీంతో చంద్రబాబు ఇసుక విధానాన్ని ఉచితం చేశారు. ఇదే టీడీపీ నేతలకు వరంగా మారింది. అవసరాల కోసమంటూ నదీ పరివాహక ప్రాంతాల్లో మధ్యనుంచి ఇసుకను తీసుకురావడం, అక్కడ నుంచి ప్రత్యేకప్రాంతాలను ఏర్పాటు చేసుకుని అమ్ముకోవడం పరిపాటిగా మారింది. ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేందుకు ప్రభు త్వం పచ్చనేతలకు అవకాశం కల్పించడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్, అనుమోలు గాంధీ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్జీటీ.. ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది. ఎన్నికలవేళ చంద్రబాబు సర్కారుకు ఇది అత్యంత శరాఘాతంగా మారింది.

రివర్స్ కొట్టిన పోలవరం..

పోలవరం ప్రాజెక్టు పనుల్లో మాయచేసి ఎన్నికల ప్రవాహాన్ని సులువుగా దాటేందుకు చంద్రబాబు వేసిన ప్లాన్ రివర్సయింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేం ద్రం 90 శాతం నిధులు ఇవ్వడమే కాకుండా ఆ పనులను కూడా పర్యవేక్షిస్తుంది. కానీ ఎన్డీయేలో భాగస్వామి అయిన చంద్రబాబు పట్టుబట్టి పనులను రాష్ట్రప్రభుత్వమే పర్యవేక్షిస్తుందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి తన కనుసన్నల్లోనే పనులను చేపడుతూ.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇష్టానుసారంగా పట్టిసీమ, ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. ఆయా ప్రాజెక్టులతోపాటు, పోలవరం ప్రాజెక్టు పనుల్లోనూ పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని గుర్తించిన కేంద్రం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. 2018లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తానని చెప్పినా.. ఇంకా పూర్తికాకపోగా భారీఎత్తున అవినీతి జరుగడాన్ని ప్రజలు గమనించారు.

ఒంటరి బాబుకు రెండో సారీ

-తొలిసారి పొత్తుల్లేకుండా ఎన్నికల గోదాలోకి టీడీపీ
-చావుదెబ్బకొట్టిన ఏపీ ప్రజలు

రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకొనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల్లో ఏదైనా పార్టీతో పొత్తు పొడిస్తేకానీ బరిలో దిగేది. ఆయన ఏనాడూ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలూ లేవు. ఎన్నికలు అనగానే పొత్తులకోసం పక్కచూపు లు చూడడంఆయనకు పరిపాటి. వెన్నుపోటు రాజకీయాల నేపథ్యంలో ఎన్టీఆర్ నుంచి సీఎం కుర్చీని లాగేసుకున్న చం ద్రబాబు నేతృత్వంలోని టీడీపీ 1999 లో ఎన్నికలకు వెళ్లింది. అప్పుడు బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు వాజపేయి ప్రభతో గట్టెక్కారు. అలిపిరి ఘటనతో ఎన్డీయేతోపాటు ముందస్తుకు వెళ్లి 2004లో బొక్కా బోర్లాపడ్డారు. 2009 ఎన్నికల్లో మహాకూటమితో కలిసి బరిలోకి దిగినా అధికారం దక్కలేదు. విభ జితరాష్ట్రంలో 2014లో జరిగిన ఎ న్నికల్లో బీజేపీ, పవన్‌కల్యాణ్‌తో దోస్తీ కట్టి విజయం సాధించారు. 2019లో ఏ పార్టీ ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాకపోవడంతో తొలిసారిగా ఒంటరిగా బరిలో దిగారు. ప్రజలు ఘో రంగా ఓడించారు.

12067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles