అలుపెరగని పోరాటం.. అంతులేని ఆనందం!


Fri,May 24, 2019 03:53 AM

Jagan Mohan Reddy makes it after a 9 year wait

-వైఎస్ మరణంతో కష్టాల కడలిలోకి జగన్
-రాజకీయంగా అనేక ఆటుపోట్లు
-పదహారునెలలపాటు జైలు జీవితం
-అనంతరం నిత్యం ప్రజల మధ్యే గడిపిన వైసీపీ అధినేత
-ప్రజల ఆశీర్వాదంతో నేడు ఏపీ ముఖ్యమంత్రి పీఠం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తండ్రిచాటు బిడ్డగా, ముఖ్యమంత్రి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు.. ఎంపీగా గెలిచినా అప్పటివరకు ఉన్న వ్యాపారాలనే చూసుకుంటూ ఉన్నాడు.. తండ్రి మరణంతో రాజకీయంగా, ఆర్థికంగా కష్టాలు ముసురుకున్నాయి.. అధిష్ఠానం వద్దన్నా ఓదార్పుయాత్ర.. తల్లితో కలిసి ఉప ఎన్నికల్లో ఘన విజయం.. కొత్తపార్టీ స్థాపన.. ఒకదానివెంట మరొకటిగా కేసులు.. 16 నెలల జైలు జీవి తం త్వరత్వరగా గడిచిపోయాయి.. జైలునుంచి బయటకు వచ్చాక ప్రజలే తమ దేవుళ్లు అంటూ వారిమధ్యే ఉంటూ వచ్చా డు.. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినా నిరాశ చెందకుండా ప్రతిపక్షనాయకుడిగా ప్రజల పక్షాన పోరాడాడు.. ఎర్రటి ఎండలను, ముసురుకున్న వానలను లెక్కచేయకుండా 13 నెలల పాటు 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కొనసాగించాడు.. పదేండ్లపాటు ప్రజల పక్షానే పోరాడుతూ ముందుకుసాగిన ఆ యువనాయకుడు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 ఎన్నికలు ఓ కీలక మలుపు. తొమ్మిదేండ్ల చంద్రబాబు పాలన నుంచి విముక్తి కోరుకున్న ప్రజానీకం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో పట్టాభిషేకం చేశారు. 2009 ఎన్నికల్లోనూ మళ్లీ సీఎం పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సుమారు వందరోజులకే 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరనం పొందారు. ఆ సమయంలో ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపడుతారంటూ ప్రచారం జరిగింది. కానీ, అందుకు భిన్నంగా కాంగ్రెస్ అధిష్ఠానం సీనియర్ నేత రోశయ్యను సీఎం చేసింది. ఏడాది తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆ క్రమంలోనే తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు యాత్ర చేపడుతానంటూ జగన్మోహన్‌రెడ్డి సిద్ధం కాగా అందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతించలేదు. అయినప్పటికీ అధిష్ఠానాన్ని ధిక్కరించి పరామర్శయాత్ర చేయడంతో జగన్ కాంగ్రెస్‌కు దూరమయ్యారు.

ఉపఎన్నికతో సవాళ్లు

కాంగ్రెస్‌పై ధిక్కారస్వరం వినిపించిన జగన్ పార్టీ నుంచి బయటికొచ్చి వైసీపీని స్థాపించారు. తర్వాత జగన్ కడప ఎంపీ పదవికి, ఆయన తల్లి విజయమ్మ పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఈ రెండు స్థానాల్లో వారిని ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ భారీ మెజారిటీతో విజయం సాధించా రు. అనంతరం కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ జగన్ అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకున్నారు.

కేసులు.. జైలు జీవితం

వైసీపీ స్థాపనతో కాంగ్రెస్ అధిష్ఠానం జగన్‌తో ప్రత్యక్షపోరుకు సిద్ధమయింది. ఒక్కొక్కటిగా కేసులు పెట్టడం ప్రారంభించింది. సీబీఐతో విచారణ పేరిట వేధింపులకు దిగింది. చివరకు 16 నెలలపాటు చంచల్‌గూడలో జైలుజీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది.

కలిసిరాని 2014 ఎన్నికలు

ఒకవైపు సీబీఐ కేసులు.. మరోవైపు రాజకీయ వేధింపులు.. వీటిమధ్య ఎలాగైనా ఏపీ ప్రజల ఆదరణ పొందాలని అనుకున్న వైఎస్ జగన్‌కు 2014 ఎన్నికలు కలిసి రాలేదు. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారం అందకుండాపోయింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీ కూటమి 44.61 శాతం ఓట్లతో 106 సీట్లను దక్కించుకోగా... 44.58 శాతం ఓట్లను పొందిన వైసీపీ 67 సీట్లకు పరిమితమయింది. టీడీపీ-బీజేపీ కూటమి 17 ఎంపీ స్థానాలు గెలుచుకోగా, వైసీపీకి ఎనిమిది దక్కాయి. ఆ తర్వాత కొన్నిరోజుల్లోనే వైసీపీ నుంచి గెలిచిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలోకి లాక్కోవడం జగన్‌కు రాజకీయంగా సవాల్‌గా మారింది.

మొక్కవోని ధైర్యంతో ప్రజల్లోనే..

సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు పాలనావిధానాన్ని ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఎండగట్టడంలో సఫలమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో ఆయన చేపట్టిన సభలు, సమావేశాలు మంచి ఫలితాన్నిచ్చి.. అధికార తెలుగుదేశాన్ని ఇరుకునపెట్టాయి. జగన్ శాసనసభా సమావేశాల్ని బహిష్కరించడం.. తనపార్టీ ఎంపీలతో రాజీనామా చేయించడం వంటి రాజకీయ వ్యూహా లు కలిసొచ్చాయి.

తండ్రిబాటలోనే పాదయాత్ర

ఉమ్మడి ఏపీలో 2003 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన రావడం.. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రావడం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ కూడా తన తండ్రి బాటలోనే పయనించారు. ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఏకంగా 3,500 కిలోమీటర్ల మేర చేపట్టిన పాదయాత్రకు జనం నుంచి విశేష స్పందన వచ్చింది. పాదయాత్ర సందర్భంగా ఆయన నవరత్నాలు పేరిట ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మరోవైపు చంద్రబాబు పాలనా వైఫల్యాలు, అవినీతి, యూటర్న్ రాజకీయాలు కలిసివచ్చి తాజా ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి పెట్టాయి. దశాబ్దకాలంపాటు పోరాటం చేసి.. ప్రజల పక్షాన నిలిచి అధికారాన్ని అందుకోవడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

పాదయాత్ర.. విజయయాత్ర!

వైఎస్సార్, బాబు, జగన్‌ను వరించిన అధికారం
నడక ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు ఎప్పుడూ చెప్తున్న విషయమే. నడక ఆరోగ్యానికే కాదు అధికారానికి కూడా రాచబాటలు వేస్తుందని మరోమారు నిరూపితమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేల కిలోమీటర్లు పాదయాత్రచేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చారు. 2009లో సైతం మళ్లీ కాంగ్రెసే గెలిచింది. 2009లో పాదయాత్ర గురించి పట్టించుకోని చంద్రబాబునాయుడు ఇక తప్పదనుకొని 2013లో పాదయాత్రచేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విభజన కూడా జరిగిపోయింది. 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారా చంద్రబాబు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఐదేండ్లపాటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది. చంద్రబాబునాయుడు రాజకీయాలకు తట్టుకోలేక.. 2019 అసెం బ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా పెట్టుకున్న వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్రనే నమ్ముకున్నారు. తన తండ్రి కంటే ఎక్కువగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుత అసెంబ్లీ ఫలితాల్లో ఘన విజయం సాధించారు.

4691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles