ఏసీబీకి చిక్కిన జేఏసీ నేత



Sat,January 13, 2018 03:14 AM

లీగల్ కన్సల్టెంట్‌గా పనిచేసే కంపెనీ తరఫున టీ జేఏసీ కో
-కన్వీనర్ గోపాలశర్మ మధ్యవర్తిత్వం
ఏపీ వాణిజ్యపన్నుల అధికారికి రూ.23 లక్షలు లంచం ఇస్తుండగా పట్టివేత
ఏపీ చరిత్రలోనే భారీ ముడుపుల వ్యవహారం..
టీ జేఏసీ ఆర్థిక కార్యకలాపాలపైనా ఏపీ పోలీసుల ఆరా

sandeep-reddy
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి అవినీతి పను లు అన్న చందంగా ఉంది తెలంగాణ జేఏసీ పెద్దల తీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధకశాఖ చరిత్రలోనే అత్యధిక లంచంఇస్తూ తెలంగాణ జేఏసీ కో-కన్వీనరు, నిజామాబాద్ జేఏసీ నేత గోపాలశర్మ పట్టుబడ్డారు. ఏపీలో కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్‌కు భారీస్థాయిలో లంచం అందిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఐటీడీ సిమెంటేషన్ కంపెనీకి లీగల్ కన్సల్టెంట్ అయిన శర్మ ఆ కంపెనీకి పన్నురాయితీల విషయంలో మార్గం సుగ మం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఏపీ కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, అడిషనల్ కమిషనర్ (స్టేట్ ట్యాక్స్) ఏడుకొండలుకు రూ.23.20 లక్షలు లంచం ఇస్తూ గోపాల్‌శర్మ పట్టుబడినట్టు ఏపీ ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ ఘటన అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలోనూ చర్చనీయాంశం అయింది.

ఓ మల్టీ నేషనల్ కంపెనీకి సంబంధించిన పన్ను రాయితీ ఇప్పించేందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారి, సదరు కంపెనీ ప్రతినిధుల మధ్య భారీ మొత్తం చేతులు మారనున్నట్టు ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాదాపు రూ.25 లక్షల వరకు లంచం ఇవ్వబోతున్నట్టు పక్కా సమాచారం ఉండటంతో ఠాకూరే స్వయంగా ఈ కేసును పర్యవేక్షించారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లులోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై నిఘా పెట్టారు. ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన నాలుగేండ్ల పెట్టుబడి రాయితీ రూ.4.67 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అడిషనల్ కమిషనర్ (స్టేట్ ట్యాక్స్) ఏడుకొండలు రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా ఒప్పం దం చేసుకున్నాడు. దాని ప్రకారం సదరు కంపెనీకి లీగల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న శర్మ ఆ కంపెనీ డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణతో కలిసి ఏడుకొండలుకు ఆయన చాంబర్‌లోనే లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏడుకొండలుతోపాటు అతడికి సహకరించిన సూపరింటెండెంట్ అనంతరెడ్డిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని, విచారణ చేస్తున్నట్టు ఏపీ ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు.
Money

దాదాపు 55 గంటల కసరత్తు

భారీ అవినీతి చేపను వలలో వేసేందుకు అవినీతి నిరోధకశాఖ అధికారులు భారీ కసరత్తే చేశారు. మొత్తం 55 గంటలపాటు శ్రమించినట్టు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ముందస్తు సమాచారంతో.. గోపాలశర్మ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని రహస్యంగా వెం బడించారు. డబ్బు తీసుకువస్తున్న మార్గంలో అక్కడడక్కడా అధికారులతో నిఘా పెట్టారు. చివరికి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లులోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వద్ద మాటువేసిన అధికారులు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

జేఏసీ కార్యకలాపాలపై ఏపీ పోలీసుల ఆరా

జేఏసీలో కీలకవ్యక్తి, జేఏసీ చైర్మన్ కోదండరాంకు అత్యంత సన్నిహితుడైన గోపాలశర్మ భారీగా లంచం ఇస్తూ పట్టుబడటంతో జేఏసీ ఆర్థిక వ్యవహారాలతో సహా అతనికి సంబంధమున్న అన్ని లావాదేవీలపై ఏపీ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గతంలోనూ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడా? దీనివెనుక ఇంకెవరెవరు ఉన్నారన్న కోణంలో విచారించనున్నట్టు ఏపీ ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. అవినీతి కేసుల్లో గోపాలశర్మ బ్రోకరుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు తాజా సంఘటనతో బలం చేకూరింది.

ఇంత భారీ లంచం ఇదే ప్రథమం: ఏసీబీ డీజీ ఠాకూర్

అవినీతి నిరోధక శాఖ చరిత్రలో భారీమొత్తంలో లంచం సొమ్ము పట్టుబడిన మొట్టమొదటి కేసు ఇదేనని ఆ శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో రూ.25 లక్షలు చేతులు మారుతున్నట్టు ఫిర్యాదు వచ్చిందని, దీంతో గురువారం నుంచి నిఘా పెంచామని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరూ లేని సమయంలో కంపెనీ ప్రతినిధులను పిలిచారని, మరో రూ.2.5 లక్షలు కంపెనీ ప్రతినిధుల ద్వారా చేతులు మారాయని తెలిపారు.

2009

More News

VIRAL NEWS