హైదరాబాద్‌లో ప్రపంచ ఐటీ సదస్సు


Thu,August 4, 2016 11:47 AM

IT World Conference in Hyderabad

ktrao
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ర్టానికి మరో అరుదైన అవకాశం దక్కింది. రాజధాని నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు చూపిన చొరవ, చేసిన కృషితో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సుకు వేదికగా హైదరాబాద్ ఎంపికైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి 50దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఏటా జరిపే అంతర్జాతీయ సమావేశానికి వేదికను వరల్డ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసు అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ) ఎంపిక చేస్తుంటుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఒక దేశానికి ఒక ఐటీ సంబంధిత సంస్థను మాత్రమే సభ్యురాలిగా అనుమతిస్తారు. భారతదేశం నుంచి నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నది.

-50 దేశాలనుంచి 3వేల ప్రతినిధులు
-ఫలించిన మంత్రి కేటీఆర్ చొరవ
-నగర ప్రతిష్ఠ మరింత పెరుగుతుందన్న కేటీఆర్
-2018 మార్చిలో 4 రోజులపాటు నిర్వహణ

హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించడానికి బిడ్ దాఖలుచేసిన నాస్కామ్.. తన ప్రయత్నంలో విజయం సాధించింది. ఈ విషయాన్ని బుధవారం హైదరాబాద్‌లోని వెస్ట్‌ఇన్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీ రామారావు సమక్షంలో నాస్కామ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ అధికారికంగా వెల్లడించారు. ఈ సదస్సు గురించి తనకు గతేడాది ప్రారంభంలో నాస్కామ్ ప్రతినిధులు తెలుపగానే హైదరాబాద్‌లో నిర్వహించాలని సూచించానని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చానని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఇది అరుదైన అవకాశమన్న కేటీఆర్.. ఈ సదస్సుద్వారా ఐటీ రంగంలో హైదరాబాద్ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలో ఐటీ దిగ్గజాలు, ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. 50దేశాల నుంచి మూడువేల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సును విజయవంతం చేయడానికి నాస్కామ్, రాష్ట్ర ప్రభుత్వం, డబ్ల్యూఐటీఎస్‌ఏ సమన్వయంతో పనిచేస్తాయన్నారు. 2016 అక్టోబర్‌లో బ్రెజిల్‌లో జరిగే ప్రపంచ ఐటీ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ సదస్సుకు హాజరుకావడంద్వారా రాష్ట్రంలో జరిగే సదస్సును విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన ప్రణాళికపై అధ్యయనం చేస్తామన్నారు. ఈ సంవత్సరం నవంబర్‌లో అంతర్జాతీయస్థాయి ఐకాన్ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సు భారతదేశంలో జరుగడం ఇదే మొదటిసారని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ చెప్పారు.

డబ్ల్యూఐటీఎస్‌ఏ సెక్రటరీ జనరల్ జేమ్స్ పొసాంట్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఈ సదస్సులను వివిధ దేశాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తామని తెలిపారు. నాలుగు రోజుల పాటు సదస్సు జరుగుతుందన్నారు. 2017లో తైవాన్‌లో, 2018లో హైదరాబాద్‌లో ప్రపంచ ఐటీ సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ అభినందనీయమని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్టార్టప్‌లు, టీ హబ్, టాస్క్ వంటి వినూత్న కార్యక్రమాలతో నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోహన్‌రెడ్డి చెప్పారు.

4660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS