50%పైగా ఓట్లు టీఆర్‌ఎస్‌కే

Sun,October 13, 2019 02:28 AM

-ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని ఉధృతం చేయండి
-ప్రజల నుంచి అనుకూల స్పందన వస్తున్నది
-హుజూర్‌నగర్ ఉపఎన్నికపై టెలికాన్ఫరెన్స్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా సాగుతున్నదని, ప్రజల నుంచి స్పందన పార్టీకి అనుకూలంగా ఉన్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కాంగ్రెస్ కన్నా టీఆర్‌ఎస్ చాలా ముందున్నదని తెలిపారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల ప్రచారంపై పార్టీ ఉపఎన్నికల ఇంచార్జీలతోపాటు పలువురు సీనియర్ నేతలతో కేటీఆర్ శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 50శాతం ఓట్లు టీఆర్‌ఎస్ పార్టీకే వస్తాయని తమ అంతర్గత సర్వే తెలిపిందన్నారు.

ప్రస్తుతం ప్రచారం సంతృప్తిగా ఉన్నదని, రానున్న వారం రోజుల్లో మరింత ప్రణాళికాబద్ధంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. గత ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్ల టీఆర్‌ఎస్ ఓడిపోయిందని, ఈసారి కూడా అలాంటి కొన్ని వాహనాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని, కారు గుర్తును ప్రజల్లోకి తీసుకుపోయేందుకు డమ్మీ ఈవీఎంలను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు వివిధ సామాజికవర్గాల నుంచి మద్దతు అద్భుతంగా వస్తున్నదని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో కాంగ్రెస్‌కు తెలియడంలేదని, టీఆర్‌ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభమని, కారు గుర్తుకు ఓటు వేస్తే నియోజకవర్గం అభివృద్ధి బాట పడుతుందంటూ తాము చేస్తున్న ప్రచారానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నా రు.

అందుకే తాజాగా కేంద్ర ప్రభుత్వ నిధులతో హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేస్తామం టూ ఉత్తమ్ మాట్లాడుతున్నారని, కానీ కేంద్ర, రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదన్న విషయాన్ని ఆయన మర్చిపోయారని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే హుజూర్‌నగర్ అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఈ ఉప ఎన్నికలతో బీజేపీ బలం ఎంతో తేలిపోతుందని, ఇన్నాళ్లూ వారు చెప్తున్న మాటలు, వట్టి మూటలని తేలిపోతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కితే అదే వారికి గొప్ప ఉపశమనమని చెప్పారు. తమకు ఎలాగూ ప్రజల్లో బలం లేదని తెలుసుకున్న బీజేపీ.. కాంగ్రెస్‌తో కలిసి పరోక్షంగా పనిచేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీల దొంగచాటు బంధాన్ని ఎండగట్టాలని పార్టీ ఇంచార్జీలకు సూచించారు.

824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles