అక్రమ కుబేర కల్కి!

Wed,October 23, 2019 02:37 AM

-ఐటీ సోదాల్లో భారీగా ఆస్తులు జప్తు
-మూడోరోజు తనిఖీల్లో 93 కోట్ల సొత్తు స్వాధీనం
-అందులో రూ.5 కోట్ల విలువచేసే వజ్రాలు..
-88 కిలోల బంగారం..
-రూ.40.39 కోట్ల నగదు, రూ. 18 కోట్ల విదేశీ కరెన్సీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కల్కి ఆశ్రమాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. భక్తి ముసుగులో వందల కోట్లు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలపై తమిళనాడులోని కల్కి ఆశ్రమం, ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవలం గ్రామ సమీపంలోని కల్కి భగవాన్ ఆశ్రమంలో మంగళవారం తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కోట్ల రూపాయల నగదు, పెద్ద సంఖ్యలో బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.5 కోట్ల విలువ గల వజ్రాలు, రూ.26 కోట్ల విలువచేసే 88 కిలోల బంగారం, రూ.40.39 కోట్ల నగదు, రూ.18 కోట్ల విదేశీకరెన్సీ సహా మొత్తం రూ.93 కోట్ల విలువ చేసే సొత్తును సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు ప్రకటించారు. భూదందాలకు సంబంధించి 1182 డాక్యుమెంట్లు సీజ్‌చేశామని, రూ.409 కోట్లకు సంబంధించిన రసీదులపై విచారణ చేస్తున్నామని తెలిపారు.

మూడోరోజు సోదాలు..

కల్కి భగవాన్ ఆశ్రమంలో మూడోరోజు ఐటీ సోదాలు పూర్తయ్యాయి. వీటిలో ఇప్పటికే భారీగా అక్రమాస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. కల్కి ఆశ్రమం వ్యవస్థాపకులు కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌కుమార్, పద్మావతి.. సోదాలు మొదలైనప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. అధికారుల తనిఖీల్లో క్యాంపస్-3లో భారీగా విదేశీ నగదు, బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు కల్కి కుమారుడు కృష్ణనాయుడు, కోడలు ప్రీతినాయుడు, ట్రస్ట్ నిర్వాహకులు లోకేశ్ దాసీజీని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. స్వదేశీ, విదేశీ భక్తుల ద్వారీ భారీఎత్తున విరాళాలు సేకరించి కోట్ల రూపాయలు విలువచేసే వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్థారించారు. రూ.93 కోట్ల బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నప్పటికీ రూ.409 కోట్లకు సంబంధించి ఎలాంటి రశీదులు లేవు. భూదందాలకు సంబంధించి 1182 డాక్యుమెంట్లు సీజ్‌చేశారు. ఈ వ్యవహారంలో చాలా వరకు బినామీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు వెలుగులోకి రావాలంటే కల్కి వేలుముద్రలు పాస్‌వర్డ్‌గా ఉన్న హార్డ్‌డిస్క్‌లను తెరువాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సదరు హార్డ్‌డిస్క్‌లను సైతం స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోనూ దోపిడీ!

ప్రచారానికి ఓ చానల్ కావాలనుకున్న కల్కి దంపతులు.. హైదరాబాద్‌లోని మణికొండలో పంచవటి కాలనీలో ఉన్న స్టూడియో ఎన్ చానల్‌ను కొనుగోలుచేశారు. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు దగ్గర నుంచి 2014లో ఏకం కల్కి ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకుల పేరిట ఈ కోనుగోలు జరిగింది. దేశవ్యాప్తంగా ఏకం కల్కి ఆధ్యాత్రిక కేంద్రాలు, కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఐటీ సోదాల్లో భాగంగా స్టూడియో ఎన్‌లోనూ తనిఖీలు చేపట్టారు. చానల్‌ను కొనుగోలుచేసిన తర్వాత సీఈవో రూపంలో ఓ మహిళకు ఏకం కల్కి ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు బాధ్యతలు అప్పగించారు. అయితే జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వకుండా గెంటేశారు. కానీ.. ఆ పాత్రికేయులకు కోట్లలో వేతనాలు ఇచ్చినట్లు లెక్కల్లో మాత్రం పక్కాగా చూపారు. ఐటీ దాడుల సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ చానల్ మూతపడింది. అయితే ఇక్కడ దోచిన సొత్తు నుంచి సదరు మహిళా సీఈవో బాగానే వెనకేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు.

మేం మిమ్మల్ని వదిలిపోలేదు మీడియాకు కల్కి దంపతుల వీడియో

ఐటీ సోదాల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లి న కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్‌కుమార్‌నాయుడు, పద్మావతినాయుడు తమిళనాడులో ఉంటున్నట్టు వెల్లడైంది. తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వారు అందుబాటులో ఉన్నారంటూ కల్కీ ఆశ్ర మం.. మీడియాకు ఓ వీడియోను విడుదలచేసింది. తమ ఆరోగ్యం బాగుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వీడియోలో విజయ్‌కుమా ర్ దంపతులు చెప్పారు. మేం మిమ్మల్ని వదిలిపోలేదు. మేం దేశం వదిలిపోలేదు. మేం నేమమ్ ఆశ్రమంలో ఉన్నాం. తరగతులు నిర్వహిస్తూ.. మీకు సహాయం చేస్తు న్నాం అని పేర్కొన్నారు. కల్కి ఆశ్రమ ప్ర ధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే.. ఐటీ సోదాల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం విశేషం.

2853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles