భూపోరాటంలో ప్రాణంపోయింది!


Thu,May 23, 2019 01:53 AM

Issue of rights to the invaders from the Revenue Department

-భూమి కోసం అధికారుల చుట్టూ తిరిగి మృతిచెందిన మహిళా రైతు
-తల్లిదండ్రుల స్ఫూర్తితో దశాబ్దాలుగా పోరాటం కొనసాగిస్తున్న వారసుడు
- ఆక్రమణదారులకు రెవెన్యూశాఖ నుంచి హక్కు పత్రాలు జారీ
- యథేచ్ఛగా అసైన్‌మెంట్ చట్టం ఉల్లంఘన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన నిరుపేద దంపతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి భూమిపై హక్కుకల్పిస్తూ ప్రభుత్వం అసైన్‌మెంట్ పట్టా జారీచేసింది. భర్తతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్న భార్య.. చంటిపిల్లల బాగోగులు చూసుకుంటుంది. భర్త అకాల మృతితో ఆమె నిస్సహాయ స్థితిని ఆసరాచేసుకొన్న కొందరు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. ఆ ఒంటరి మహిళ చిన్నపిల్లలతో కలిసి న్యాయం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణచేసింది. ఆమె పోరాటం ఫలించకపోగా పక్షవాతానికి గురై అనతికాలంలోనే ప్రాణం పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమె కుమారుడు తల్లిదండ్రుల భూమి కోసం పోరాడుతున్నాడు. అయినప్పటికీ న్యాయం జరుగడం లేదు.

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: అశ్వారావుపేట పట్టణంలోని శీమకుర్తి శివయ్యబజార్‌కు చెందిన రొయ్యల చిన్నోడు-మాణిక్యం దంపతులు 1968 నుంచి సర్వేనంబర్ 911 సరిహద్దులోని 946, 947 (క్ర.సం.46,47 )లో పది ఎకరాల ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. నిరుపేదలకు భూమి పంపిణీ చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న పేద రైతులకు హక్కు పట్టాలను జారీచేసింది. 1970లో (పట్టా నంబర్.ఆర్సీ ఏ8/ 753/3/70, తేదీ 02.02.1970) రొయ్యల చిన్నోడు, ఆయన భార్య మాణిక్యానికి ఐదెకరాల చొప్పున పదెకరాల భూమిని పంపిణీ చేసింది. వీరికి సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బోరు కూడా వేసింది. వ్యవసాయానికి అవసరమైన అన్ని వసతులు కల్పించటంతో రైతు కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. సాగు ద్వారా లభిస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని శిస్తుగా ప్రభుత్వానికి చెల్లించారు. కొంతకాలానికి చిన్నోడు ఓ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనతో మాణిక్యం కుంగిపోయింది. కొన్నినెలలు భూమి వైపు వెళ్లలేదు. విషాదం నుంచి కుదుటపడిన తర్వాత భూమి సాగుకు సిద్ధమైంది.

రెవెన్యూకార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

కానీ, అప్పటికే కొందరు భూస్వాములు పేద రైతు దంపతుల భూమిని కబ్జాచేశారు. భర్త మరణం కంటే ఈ భూ ఆక్రమణ ఆమెను మరింత కుంగదీసింది. నిస్తేజంతో రెవెన్యూ కార్యాలయం వైపు పరుగులు తీసింది. అక్కడ అధికారుల నుంచి కనీస స్పందన లభించలేదు. భర్త జ్ఞాపకంగా వ్యవసాయ భూమిని ఎలాగైనా సాధించుకోవాలని పోరాటం మొదలుపెట్టింది. అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదుచేసింది. అక్కడినుంచి సమాధానం అందేలోపు 1998లో ప్రభుత్వం ప్రజా ఫిర్యాదులు పేర భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆమెకు అప్పటి తాసిల్దార్ సీహెచ్ కుమారస్వామి 13-07-1998లో విచారణకు హాజరుకావాలని నోటీసు జారీచేశారు. దాని ప్రకారం మాణిక్యం విచారణకు హాజరైంది. ప్రత్యర్థి వర్గీయులు గైర్హాజరయ్యారు. మరోసారి ఇరువర్గాలను విచారణకు పిలుస్తానని తాసిల్దార్ ఒప్పించి పంపించేశారు. తర్వాత ఎలాంటి కబురూ అందలేదు. ఆమె కలెక్టర్, పాల్వంచ ఆర్డీవో, తాసిల్దార్లకు ఫిర్యాదులు చేస్తూనే వచ్చారు. అయినా, ప్రయోజనం లేకపోయింది. 2000 సంవత్సరంలో మాణిక్యం పక్షవాతానికి గురైంది. నాలుగు నెలలపాటు చికిత్స పొంది ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసింది. అప్పటినుంచి తల్లిదండ్రుల భూమి కోసం వారసుడు రొయ్యల వెంకటరామారావు పోరాడుతున్నారు.

ఈ సమయంలోనే వెంకటరామారావు భార్య నాగమణి కూడా క్యాన్సర్ బారిన పడి మృతి చెందింది. అయినా తల్లిదండ్రులపై ప్రేమతో వారి ఆశయానికి అనుగుణంగా ఆక్రమిత భూమికోసం పోరాడుతూనే ఉన్నారు. ఇందుకు అవసరమైన రికార్డులను సేకరించారు. 2017లో పహాణీ తీసుకున్నారు. ఈ పహాణీలో సర్వేనంబర్లు 911/67/1లో 0.31 ఎకరాలు, 911/111/1లో ఐదు ఎకరాలు పట్టా కింద నమోదుచేసి ఉన్నది. గ్రామ పహాణీలో ఇవే సర్వేనంబర్లలో రొయ్యల మాణిక్యం పేరు పట్టాదారు కాలమ్‌లో ఉండగా అనుభవ కాలమ్‌లో మాత్రం ఏకయ్య, చంద్రయ్య పేర్లు ఉన్నాయి. వీరి ఇంటి పేర్లను చూపలేదు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ భూమిని స్వాధీనం చేయాలని రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నారు. ప్రస్తుతం తన భూమి ఎస్ పుల్లారావు, ఎస్ లీలమ్మ ఆక్రమణలో ఉన్నట్టు బాధితుడు వాపోతున్నారు. భూమి కేటాయింపు సమయంలో బై నంబర్లు కూడా పేర్కొనటం వల్ల ఆక్రమిత భూమిని సులువుగా గుర్తించే అవకాశం ఉన్నదంటున్నాడు. దీనిపై వివరణ కోసం నమస్తే తెలంగాణ తాసిల్దార్‌ను సంప్రదిస్తుండగా అందుబాటులోకి రాలేదు.


రొయ్యల వెంకట రామారావు, వారసత్వపు రైతు

తల్లిదండ్రుల జ్ఞాపకార్థమైనా భూమిని అప్పగించండి

తండ్రి మరణం తర్వాత ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ భూమిని కొందరు భూస్వాములు ఆక్రమించుకున్నారు. భూమి కోసం నా తల్లి మాణిక్యం శాయశక్తులా పోరాటంచేసి అనారోగ్యానికి గురై ప్రాణం పోగొట్టుకున్నది. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భూమిని సాధించుకోవటానికి ఎనిమిదేండ్లుగా పోరాటం చేస్తున్నా. పేదల భూములను భూ స్వాములు ఆక్రమించుకొంటుంటే కొందరు అవినీతి రెవెన్యూ అధికారులు ఎసైన్‌మెంట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వారికి కూడా హక్కు పట్టాలు జారీ చేస్తున్నారు.
- రొయ్యల వెంకట రామారావు, వారసత్వపు రైతు, అశ్వారావుపేట

577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles