దివ్యాంగులకు అండ

Wed,December 4, 2019 02:49 AM

-చరిత్రలో తొలిసారి రూ. 3,016 పింఛన్
-దివ్యాంగుల సంక్షేమంలో రాష్ట్రం నంబర్‌వన్
-దివ్యాంగుల దినోత్సవంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్‌అలీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దివ్యాంగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్‌అలీ జ్యోతి ప్రజ్ఞలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ పదో తరగతి, ఆపై చదువు పూర్తిచేసుకున్న దివ్యాంగులకు నైపుణ్య శిక్షణ ఇస్తామని, శిక్షణాకేంద్రాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పదిలక్షల మంది దివ్యాంగులున్నారని, వారికోసం ప్రభుత్వం పలు సంక్షేమపథకాలను రూపొందించి అమలుచేస్తున్నదని చెప్పారు. 2018-19 ఏడాదిలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా రాష్ర్టానికి జాతీయస్థాయి అవార్డు దక్కిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 70 కోట్ల నిధులు వెచ్చించి దివ్యాంగుల సంక్షేమానికి కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. ఒకరిపై ఆధారపడకుండా ఉండటం కోసమే సీఎం కేసీఆర్ చరిత్రలో లేనివిధంగా దివ్యాంగులకు రూ. 3,016 చొప్పున పింఛన్ ఇస్తున్నారన్నారు.

అన్ని పథకాల్లో ఐదుశాతం రిజర్వేషన్

దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నామని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. అభివృద్ధిలో దేశవ్యాప్తంగా మన రాష్ట్రం ముందంజలో ఉన్నదని, దివ్యాంగులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి కలెక్టర్‌తోపాటు పలువురికి అవార్డులు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించామని, ఉద్యోగ నియామకాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు, అన్ని పథకాల్లో ఐదుశాతం, డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపుల్లో కూడా రిజర్వేషన్లు అమలుచేస్తున్నామని వివరించారు. ప్రతిఒక్కరూ దివ్యాంగులకు అండగా నిలువాలని హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బీ శైలజ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. వైకల్యాన్ని జయించి వివిధరంగాల్లో ప్రతిభచూపిన దివ్యాంగులకు మంత్రులు అవార్డులను ప్రదానంచేసి సన్మానించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, దివ్యాంగుల సంక్షేమశాఖ ఎండీ బీ శైలజ, దివ్యాంగులు పాల్గొన్నారు.
Ali1

665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles