మళ్లీ కేసీఆర్‌దే విజయం


Tue,September 11, 2018 01:48 AM

Industrial and agricultural development

-ఆత్మవిశ్వాసంతోనే ముందస్తు సాహసం
-పారిశ్రామిక, వ్యవసాయరంగాల్లో ప్రగతి
-రైతు రుణమాఫీ, పెట్టుబడిసాయం, భూ రికార్డుల ప్రక్షాళనతో రైతులకు మేలు
-మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ప్రాధాన్యం
-బిజినెస్ స్టాండర్డ్‌లో ఆసక్తికర కథనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రెండో ముఖ్యమంత్రి అని సుప్రసిద్ధ జాతీయ ఆంగ్ల పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ఇటీవల ఆసక్తిదాయకంగా ఒక కథనాన్ని ప్రచురించింది. పారిశ్రామిక, వ్యవసాయరంగాల్లో రాష్ట్రం చెప్పుకోదగిన వృద్ధి సాధించిన కారణంగానే పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఆయన సాహసించారని ఆ పత్రిక పేర్కొన్నది. కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగినప్పటికీ, ఆయనను పక్కనబెట్టాలనే దురుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి అవమానించడంతో కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి, దానిద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. ఒక్కడుగా ఉద్యమాన్ని తలకెత్తుకుని లక్షలమందిని భాగస్వాములను చేసి తనతో నడిపించారు. 2001లో జిల్లా పరిషత్ ఎన్నికలు ఇరవై చోట్ల జరిగితే వాటిలో పదింటిని కైవసం చేసుకుని తన సత్తా చాటుకున్నారు. ఆ ఫలితాలతో దిమ్మ తిరిగిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌తో ఎన్నికల పొత్తుకోసం సిద్ధపడింది.

ఆ ఎన్నికల్లో ఇరవై ఆరు అసెంబ్లీ, అయిదు లోక్‌సభ స్థానాలలో విజయకేతనాన్ని ఎగురవేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేశానికి చాటిచెప్పింది. ఆనాటి కేంద్రమంత్రివర్గంలో చేరినప్పటికీ, తన ప్రత్యేక రాష్ట్ర సాధన ఆశయాన్ని మాత్రం విస్మరించలేదు. వీలైనప్పుడల్లా మంత్రివర్గ సమావేశాల్లోనూ, పార్లమెంట్‌లోనూ తన వాణిని బలంగా వినిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసే ఉద్దేశంలో ఉన్నదని గ్రహించిన ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనేకసార్లు ఎంపీలతో, ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు. ఆ సమయంలో రాజీనామాలు చేయడం ఇంత సునాయాసమా అని దేశం మొత్తం సంభ్రమంలో మునిగిపోయేట్లు చేశారు. చివరకు ఉద్యమాన్ని విజయవంతం చేసి యజ్ఞఫలాన్ని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. ఇక ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటినుంచి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారు కేసీఆర్. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టినప్పటినుంచి పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేశారు. ముఖ్యంగా రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఎకరానికి ఎనిమిదివేల రూపాయలను రెండు విడుతల్లో ఎరువులు, విత్తనాలకు సాయంగా అందించారు. బహుశా, ఆ నమ్మకంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సాహసించి ఉంటారని ప్రస్తుతించింది! అంతేకాదు.. అనేక అవకతవకలతో అవినీతిమయంగా భ్రష్టుపట్టిన భూముల రికార్డులను సంస్కరించి రైతులకు ఎనలేని మేలుచేశారు కేసీఆర్.

ఈ రెండు హేతువులు చాలు.. రాబోయే ఎన్నికల్లో ఆయన ఘనవిజయాన్ని సాధించడానికి అని కొనియాడింది ఆ పత్రిక. స్వాతంత్య్రానికి పూర్వం కోస్తాంధ్ర మొత్తం బ్రిటిష్‌వారి ఏలుబడిలో ఉండగా తెలంగాణ మాత్రం నిజాం ప్రభువుల పాలనలో కునారిల్లింది. అనేక జలవనరులు, సాగునీటి ప్రాజెక్టులతో కోస్తాంధ్ర సస్యశ్యామలంగా అలరారుతుండగా, తెలంగాణ మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా బీడుగా మిగిలిపోయింది. ఈ వాస్తవాన్ని గ్రహించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులమీద దృష్టిసారించి సీతారామసాగర్, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను ఉక్కుసంకల్పంతో చేపట్టారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలతో నీటిని అందించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్లనే కేసీఆర్ ప్రతిఒక్కరి మన్ననలను పొందగలిగారని, రేపటి ఎన్నికల్లో ఆయన సునాయాసంగా విజయాన్ని సాధిస్తారని బిజినెస్ స్టాండర్డ్ కుండబద్దలు కొట్టింది! శాసనసభను రద్దు చేసిన తరువాత పత్రికా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ వంటి బఫూన్ అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్‌తో తమకు పొత్తు ప్రసక్తేలేదని, బీజేపీతో కూడా తమకు ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టంచేశారు. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దూకుతామని అదేదో సినిమాలో రజనీకాంత్ డైలాగును స్ఫురణకు తెచ్చారు. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయ పండితులు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మరో పదేండ్లపాటు ఎదురులేకుండా అధికారంలో కొనసాగుతుందని నమ్ముతున్నారు. ప్రజాతీర్పు కోసం వేచి చూడటమే ఇక మిగిలింది!
(అనువాదం: ఇలపావులూరి మురళీమోహన్‌రావు)

4175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles