మోదీ మెచ్చిన వస్త్రం మనదే!


Fri,October 30, 2015 02:45 AM

India Africa Forum Summit in PM Modi

-తెలంగాణ ఇక్కత్ దూప్యాన్ విశిష్టత
-ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్‌లో మెరుపు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నదని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీని సైతం ఇక్కడి కళాకారులు మెప్పించారు. తెలంగాణ ఉత్పత్తులు బాగున్నాయని ప్రశంసించిన మోదీ.. ఇండోఆఫ్రికన్ సమ్మిట్‌కు హాజరైన వివిధ దేశాధినేతలను సత్కరించేందుకు తెలంగాణ నుంచి తెప్పించిన వస్ర్తాలను ఉపయోగించడం విశేషం. కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులకు అందించేందుకు కేంద్రం ముందుగానే వస్ర్తాలను కుట్టించింది.

modi-sadassu


బుధవారం వాటిని ఆయా దేశాధినేతలు ధరించారు. దీనికోసం హ్యాండీక్రాఫ్ట్ హ్యాండ్లూం ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దేశ వ్యాప్తంగా నెల క్రితం శాంపిళ్లను సేకరించింది. వాటిల్లో నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ప్రముఖ మాస్టర్ వీవర్ గజం అంజయ్య పంపిన 66 శాంపిళ్లనే ప్రధాని ఆమోదంతో అధికారులు ఎంపికచేయడం విశేషం. ఇవన్నీ తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకంగా గుర్తింపునిచ్చిన ఇక్కత్, దూప్యాన్ సిల్క్ రకాలే కావడం గమనార్హం. వారం క్రితం కార్పొరేషన్ అధికారులు ఫోన్ చేసి ప్రధాని మోదీకోసం కూడా శాంపిళ్లు పంపాలని కోరారు. దాంతో అంజయ్య మరో ఆరు ప్రత్యేక డిజైన్ల శాంపిళ్లను ఢిల్లీలో స్వయంగా అందజేశారు. సమ్మిట్‌లో పాల్గొనే 60 మంది అతిథులకోసం 60 రకాలను, మోదీ కోసం ఆరింటిని ఎంపిక చేశారు. నేషనల్ హ్యాండ్లూం ప్రమోషన్ కోసం ప్రధాని ఇచ్చిన ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని కార్పొరేషన్ నిర్వహించింది.

ఇక్కత్ దూప్యాన్ సిల్క్‌కు డిమాండ్:

తెలంగాణలోని ఇక్కత్ దూప్యాన్ సిల్క్‌కు మంచి డిమాండ్ ఉన్నది. ప్రస్తుతం మాస్టర్ వీవర్ల దగ్గర మీటర్‌కు రూ.900 వరకు పలుకుతుంది. అదే ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర రూ.1200వరకు ఉందని అంచనా. ఇదే ప్యాబ్రిక్‌ను నేచురల్ కలర్స్‌తో ఉత్పత్తి చేస్తే మీటర్‌కు అదనంగా రూ.300వరకు ఖర్చు కానుంది. ఇండోఆఫ్రికన్ సమ్మిట్‌లో పాల్గొన్న 60మంది అతిథులకోసం ఎంపికచేసిన వస్ర్తాలకు రూ.1.89 లక్షలు పలికినట్లు మాస్టర్ వీవర్ గజం అంజయ్య గురువారం నమస్తే తెలంగాణకు చెప్పారు.

Gajam-Anjaiah


చేనేత విశిష్టమైనది: గజం అంజయ్య
చేనేత పరిశ్రమ అత్యంత ప్రాచీనమైనది, విశిష్టమైనది. కార్మికులు, కళాకారుల నైపుణ్యంతో కూడినది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నది. దాన్ని అందిపుచ్చుకుంటే ఈ రంగానికి ఎలాంటి ఢోకా ఉండదు. దేశవ్యాప్తంగా 4.4 మిలియన్ కుటుంబాలకు ఉపాధిని ఇస్తున్నది. మేం ఉత్పత్తి చేసిన అనేక రకాలకు ప్రశంసలు వస్తున్నాయి. అంతర్జాతీయ సమ్మిట్‌కు ప్రధాని మోదీ మా ఉత్పత్తులనే ఎంపిక చేయడం గర్వంగా ఉంది.

1842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS