కృష్ణాబేసిన్‌కు పెరిగిన వరద

Mon,November 11, 2019 02:25 AM

-జూరాలకు 62వేలు.. శ్రీశైలానికి 51 వేల క్యూసెక్కులు
-ఎస్సారెస్పీకి తొమ్మిది వేల క్యూసెక్కుల ప్రవాహం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉండగా.. వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదలాల్సిన పరిస్థితి. ఆదివారం ఉదయం కూడా ఎగువన ఆల్మట్టి మొదలు దిగువన పులిచింతల వరకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఆల్మటికి 22 వేల పైచిలుకు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. కరెంటు ఉత్పత్తి ద్వారా అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. నారాయణపుర జలాశయానికి 33 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో దాదాపు 34 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని నుంచి 3 నుంచి 4 వేల క్యూసెక్కుల వరద ప్రధాన కృష్ణాలోకి చేరుతున్నది. జూరాల జలాశయానికి ఆదివారం ఉద యం 80 వేలపైచిలుకు క్యూసెక్కుల వరద నమోదవ్వగా.. సాయంత్రానికి 62 వేలకు చేరుకున్నది. స్పిల్‌వే ద్వారా 40వేలు, కరెంటు ఉత్పత్తి ద్వారా 35 వేలకుపైగా క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు.

తుంగభద్ర నుంచి కూడా 15 వేల క్యూసెక్కుల వరకు వరద వస్తున్నది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి 51వేల పైచిలుకు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. తెలంగాణ పరిధిలోని విద్యుత్ కేంద్రం ద్వారా దాదాపు 28 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో నాగార్జునసాగర్‌కు 52,301 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 589.90 అడుగుల వద్ద 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాల్వలు, కరెంటు ఉత్పత్తి ద్వారా అంతే మొత్తంలో నీరు దిగువకు విడుదల అవుతున్నది. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 43 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బరాజ్ వద్ద ఇన్‌ఫ్లో 20 వేల పైచిలుకు క్యూసెక్కులుగా నమోదైంది. తాజా నీటి సంవత్సరంలో ఇప్పటివరకు 792 టీఎంసీల కృష్ణాజలాల్ని సముద్రంలోకి వదిలినట్లయింది.

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఆదివారం ఉద యం 9 వేల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వస్తుండగా.. కాల్వలకు, కరెంటు ఉత్పత్తి ద్వారా 13,500 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. సింగూరుకు స్వల్పంగా 342 క్యూసెక్కులు, శ్రీరాజరాజేశ్వర జలాశయానికి 7,344 క్యూసెక్కులు, లోయర్ మానేరు డ్యామ్‌కు 11,033 క్యూసెక్కులు, కడెంకు స్వల్పంగా 397 క్యూసెక్కులు, ఎల్లంపల్లి 9,603 క్యూసెక్కుల వరద వస్తున్నది. లక్ష్మీ బరాజ్‌కు 39వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా, ఐదు గేట్లు ఎత్తి 30వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇప్పటివరకు గోదావరి నుంచి 3,735 టీఎంసీల జలాలు సముద్రంలోకి వెళ్లాయి.

458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles