పెరిగిన మూలధన వ్యయం

Tue,September 10, 2019 03:56 AM

-దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
-సమైక్య రాష్ట్రంలో వివక్ష వల్ల తక్కువ వాటా
-రాష్ట్ర ఏర్పాటు తర్వాత పెరుగుతూ వచ్చింది
-ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది
-పటుత్వమైన ఆర్థిక క్రమశిక్షణతో స్థిమితపడ్డాం
-బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ర్టాభివృద్ధి, ఆస్తుల కల్పన కోసం వెచ్చించే మూలధన వ్యయంలో ఎక్కడో అట్టడుగున ఉండే తెలంగాణ.. నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెడుతూ, సమైక్యరాష్ట్రంలో మూలధన వ్యయం మొత్తం వ్యయంలో కేవలం 11.2% మాత్రమే ఉండేదని, నిధుల వినియోగంలో వివక్ష కారణంగా సమైక్యరాష్ట్రంలో పెట్టిన పెట్టుబడివ్యయంలో తెలంగాణకు దక్కినవాటా మరింత తక్కువ ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ అవతరించిన తర్వాత ప్రభుత్వం అనుసరించిన ఆర్థికవిధానాలవల్ల మూలధన వ్యయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 16.9% మూలధన వ్యయంతో రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలిచింది. ఇదే ఆర్థికసంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయం కేవలం 12.89 శాతమైతే.. దేశంలోని అన్ని జనరల్ క్యాటగిరీ రాష్ర్టాల సగటు మూలధన వ్యయం 14.2% మాత్రమే.

సమైక్యపాలన చివరి పదేండ్లలో మూలధన వ్యయం కింద తెలంగాణ ప్రాంతంలో రూ.54,052 కోట్లు ఖర్చు పెడితే, తెలంగాణ ఏర్పడిన ఐదేండ్లలోనే రూ.1,03,551 కోట్లను ప్రజాసంక్షేమానికి వెచ్చించాం. బడ్జెట్ నిధులే కాకుండా, వివిధ ఆర్థికసంస్థల నుంచి సమీకరించిన నిధుల్లో రూ.65,616 కోట్లను మూలధన వ్యయంగా వినియోగించాం. అంటే గడిచిన ఐదేండ్లలో రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం రూ.1,65,167 కోట్లు. సమైక్యరాష్ట్రంలో అభివృద్ధి పనులకు సగటున ఏటా రూ.5,400 కోట్లు ఖర్చుచేస్తే, తెలంగాణ రాష్ట్రంలో రూ.33,833 కోట్లకుపైగా ఖర్చుచేస్తున్నాం. తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి నిధులు ఖర్చుపెట్టే విషయం లో రాష్ట్ర ప్రభుత్వం ఎం త నిబద్ధతతో ఉన్నదో ఆరురెట్లు పెరిగిన పెట్టుబడి వ్యయమే నిరూపిస్తున్నది. అన్నిరంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి ఫలితంగా గడిచిన ఐదేండ్లలో తెలంగాణ 21.49% సగటు ఆదాయ వృద్ధిరేటు సాధించి, దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

స్థిమితపడిన తెలంగాణ

ప్రభుత్వం అవలంబిస్తున్న సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, పటుత్వమైన ఆర్థికక్రమశిక్షణతో తెలంగాణ స్థిమితపడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్‌రంగంలో చేపట్టిన చర్యలు, అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్, టీఎస్‌ఐపాస్ వంటి ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానం, పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేసే అవకాశం కలుగటం, కునారిల్లిపోయిన వ్యవసాయరంగం 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో పునరుత్తేజం పొందటం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగాల్లో గణనీయమైన వృద్ధిసాధించటం, అన్ని ప్రధానరంగాల్లో మూలధన వ్యయం పెరుగటంతో తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమయింది అని సీఎం వివరించారు.

వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో పురోగతి

రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రగతికాముక విధానాలవల్ల అన్ని ప్రధానరంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు నమోదైందని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధశాఖలతో కూడిన ప్రాథమికరంగంలో 2013-14 ఆర్థికసంవత్సరంలో 1.8% వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైంది. గడిచిన ఐదేండ్లలో 6.3% అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థికసంవత్సరం పూర్తయ్యేనాటికి రాష్ట్రం వ్యవసాయరంగంలో 8.1% వృద్ధిరేటును నమోదుచేయగలిగింది. 2013-14 ఆర్థికసంవత్సరంలో 0.4% వృద్ధిరేటుతో ఉన్న పారిశ్రామికరంగంలో కూడా అదనంగా 5.4% అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థికసంవత్సరం ముగిసేనాటికి 5.8% వృద్ధిని తెలంగాణ నమోదుచేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగంలో 2013-14 ఆర్థికసంవత్సరంలో తెలంగాణలో కేవలం 8.7% వృద్ధిరేటు నమోదైతే, 2018-19 ఆర్థికసంవత్సరం ముగిసేనాటికి మరో 2.8% అదనపువృద్ధితో మొత్తంగా 11.5% వృద్ధిరేటును సాధించింది. 2014-15 ఆర్థికసంవత్సరంలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52 వేల కోట్లు ఉంటే.. 2018-19 ఆర్థికసంవత్సరం నాటికి వందశాతానికి పైగా పెరిగి, రూ.1.10 లక్షల కోట్లకు చేరుకోవడం రాష్ట్రం సాధించిన అద్భుత విజయానికి సంకేతం. అవినీతిరహిత పాలన, సత్వర నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే పైన చెప్పిన ఆర్థికప్రగతి సాధ్యమైంది అని సీఎం చెప్పారు.

పంచాయతీరాజ్ బలోపేతం

-కొత్త విభాగాలను ఏర్పాటుచేశాం
-అన్ని ఖాళీలను వేగంగా భర్తీచేస్తున్నాం
-ఆర్థికసంఘం నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధుల జమ
-బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్

పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కొత్త విభాగాలను ఏర్పాటు చేసినట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెడుతూ, గతంలో రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయాలుండేవి. వాటి సంఖ్యను 32కు పెంచాం. ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు ఒక డీఎల్పీవో ఉండాలనే లక్ష్యంతో 28 డీఎల్పీలవోల సంఖ్యను 68కి పెంచాం. గతంలో 438 మంది ఈవోపీఆర్డీలుంటే.. ఇప్పుడు మండల పంచాయతీ అధికారిగా మార్చిన ఆ పోస్టులను 539 పెంచాం. పంచాయతీరాజ్‌శాఖ బలోపేతానికి ప్రభుత్వం అన్నిఖాళీలను వేగంగా భర్తీచేస్తున్నది. చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతూనే గ్రామాల్లో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న 36 వేలమంది సఫాయీ కర్మచారుల వేతనాలను రూ.8,500కు పెంచాం. స్థానికసంస్థలకు నిధుల కొరత రానీయకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన విధానం తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థికసంఘం ఎన్ని నిధులిస్తే అంతేమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జమచేసి, స్థానికసంస్థలకు అందివ్వాలని నిర్ణయించింది. ఈ రెండింటిని కలిపి గ్రామపంచాయితీలకు ప్రతినెల రూ.339 కోట్లు అందించాలని నిర్ణయించింది. పంచాయితీలకు రూ.2,714 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించాం. అని సీఎం వివరించారు.

పటిష్టంగా శాంతిభద్రతల పర్యవేక్షణ

శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టంగా అమలయ్యేందుకు పోలీసువ్యవస్థను కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిందని సీఎం చెప్పారు. కొత్తగా ఏడు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటుచేసి, వాటిసంఖ్యను తొమ్మిదికి పెంచుకున్నాం. పోలీస్ సబ్‌డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు పెంచాం. సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు పెంచాం. కొత్తగా 102 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటుచేసి, రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్ల సంఖ్యను 814కు పెంచాం అని సీఎం వివరించారు.

స్థానికులకే ఉద్యోగాలు

స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు దక్కాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్తజోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసిందని సీఎం తెలిపారు. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95% స్థానికులకే దక్కేలా చట్టంచేసి, కేంద్రప్రభుత్వ ఆమోదం కూడా పొందిందన్నారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

1128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles