-ఆరోగ్య కార్యక్రమాలు ప్రజలకు చేరేలా సర్కారు చర్యలు
-జిల్లాలకు పథకాలవారీగా మార్కుల కేటాయింపు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సర్కారువైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరువచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వైద్య, ఆరోగ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలుజరిగేలా జిల్లాలవారీగా ఆయా వైద్య విభాగాల పనితీరుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఆరోగ్య కార్యక్రమాల అమలుపై నెలవారీగా మార్కు లు నిర్ణయించి ఆయా జిల్లాలు సమర్థవంతం గా పనిచేసేలా వైద్యశాఖ దృష్టిసారించింది. టాప్ ర్యాంకుల్లో నిలిచిన జిల్లాలకు అవార్డు లు ఇస్తూ.. వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువచేసేలా చర్యలు చేపడుతున్నది.
అక్టోబర్లో ఆయా జిల్లాల పనితీరు, పురోగతిపై వైద్యశాఖ అధికారులు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. హెల్త్ ప్రొఫైల్, కేసీఆర్ కిట్, జీవనశైలి వ్యాధులు, అంటువ్యాధులు, నిధుల ఖర్చులను ఆధారం గా చేసుకొని మార్కులను కేటాయించారు. 100 మార్కులకుగాను కరీంనగర్ జిల్లా 83.01 మార్కులతో మొదటిస్థానంలో నిలిచింది. 79.75 మార్కులతో జగిత్యాల రెండోస్థానం, 78.29 మార్కులతో హైదరాబాద్ మూడోస్థానంలో నిలువగా, 56.37 మార్కులతో భూపాలపల్లి జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉన్నది.