సన్నాహక సదస్సుల్లో గుబాళించిన తెలుగు


Mon,November 6, 2017 01:23 AM

Inaugurated World Telugu Conference

-సీఎం కేసీఆర్ సంకల్పానికి ప్రశంసలు
-ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నైలో కోర్‌కమిటీ సభ్యుల పర్యటన
-ప్రపంచ తెలుగు మహాసభలకు తరలివచ్చేందుకు ఆసక్తి

TElugu
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సులకు విశేష స్పందన లభిస్తున్నది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో జరిగిన సన్నాహక సదస్సుల్లో పాల్గొన్న అక్కడి తెలుగువారు.. కోర్ కమిటీ సభ్యులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృఢసంకల్పాన్ని ప్రశంసించారు. తెలుగుభాష గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు ఆయన చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ప్రత్యేక బస్సులు, రైళ్లలో డిసెంబర్ రెండోవారంలోనే హైదరాబాద్‌కు చేరుకుంటామని ఉత్సాహాన్ని కనబరిచారు. మహాసభల కోసం సేవాదృక్పథంతో వాలంటీర్లుగా పనిచేస్తామని ముందుకొచ్చారు. ఢిల్లీలో ఆదివారం సన్నాహక సదస్సును వైభవంగా నిర్వహించారు. దేశపతిశ్రీనివాస్ తెలంగాణ పాటతో సభను ప్రారంభించి, హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల విశేషాలను వివరించారు.

తెలుగుభాష సొగసు తెలంగాణ పల్లెల్లో గుబాళిస్తున్నదని, తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభల పండుగ మొదలయిందని చెప్పారు. మహాసభల కార్యాచరణను తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ వివరించారు. కేంద్ర ఆర్టీఐ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తెలంగాణ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి కూడా పాల్గొన్నారు. మహారాష్ట్ర గవర్నర్, ముంబై విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్న విద్యాసాగర్‌రావుతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ముంబైలో సమావేశమయ్యారు. ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగుభాషా పీఠం ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై విద్యాసాగర్‌రావు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలను పంపితే తగినవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం నుంచి వలసవచ్చినవారు ఎక్కువగా ఉన్నందున..

వారికోసం మహాసభల సందర్భంగా ప్రత్యేకంగా రైలును ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించాలని కోరారు. మహాసభల కార్యాచరణ ప్రణాళికలను నందిని సిధారెడ్డి వివరించారు. బెంగళూరులో జరిగిన సదస్సులో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ పాల్గొని మహాసభల వివరాలను తెలియజేశారు. ఈ సదస్సులో తెలుగు విజ్ఞానసమితి, తెలుగు సాహిత్యసమితి, కర్ణాటక రచయితల సంఘం, ఆంధ్ర సారస్వత సమితి, తమిళనాడు తెలుగు సంఘం, కర్ణాటక తెలుగు అకాడమీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. మద్రాస్ తెలుగు అకాడమీ, వివిధ తెలుగుసంఘాల ప్రతినిధులు హాజరై.. చెన్నై నుంచి సాంస్కృతిక బృందాలతో మహాసభలకు వస్తామని పేర్కొన్నారు.

368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS