క్యాంపుల పేరిట దందా

Tue,October 8, 2019 03:31 AM

-2013 నుంచి మెడికల్ కిట్లు పక్కదారి
-రోజుకో మలుపు తిరుగుతున్న ఐఎంఎస్ స్కాం
-తాజాగా మరో ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఐఎంఎస్ మందుల కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మొన్నటివరకు ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి వర్గం అవినీతి డొంక కదలగా, ఇప్పుడు జేడీ పద్మ అవినీతి బాగోతం బయటపడింది. ఇండెంట్లు, పర్చేజ్ ఆర్డర్ల తప్పుడు పత్రాలను సృష్టించడాన్ని దాటి.. మెడికల్ క్యాంపుల పేరిట ఖరీదైన మెడికల్ కిట్లను పక్కదారి పట్టించి, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన విషయం వెలుగుచూసింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. వెంకటేశ్వర హెల్త్‌కేర్ ఎండీ డాక్టర్ చెరుకు అరవింద్‌రెడ్డితోపాటు కే రాంరెడ్డి, కే లిఖిత్‌రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 13కు చేరింది. 2013 నుంచి ఈ విధంగా పద్మ, అరవింద్‌రెడ్డి కలిసి ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఏసీబీ గుర్తించింది.

భూపాలపల్లి జిల్లా నందిగామకు చెందిన అరవింద్‌రెడ్డి ఓ ఔషధ తయారీ సంస్థలోని కార్మికులకు ఈఎస్‌ఐ ద్వారా వైద్య సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఐఎంఎస్ ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు సరఫరా చేసినట్టు రికార్డులు సృష్టించి, దోపిడీకి పథకం రచించారు. వీరికోసమని ఒక్కొక్కటి రూ.18వేల వరకు ఉండే వివిధ రకాల పరీక్షల కిట్లతోపాటు క్రేప్ బ్యాండేజీలు, మోకాలి ప్యాడ్లను తెప్పించారు. వాటిని దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఏ అధికారి పాత్ర ఎంత.. ఎంత మొత్తం దారి మళ్లించారనే విషయాలను తేల్చే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు.

క్యాంపుల పేరిట రూ.కోట్లు కాజేశారు

జాయింట్ డైరెక్టర్ పద్మ డిస్పెన్సరీలకు పంపిణీచేయాల్సిన మెడికల్ కిట్లను అరవింద్‌రెడ్డి సహకారంతో ప్రైవేట్ దవాఖానలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీన్ని సరిచేసేందుకు సేవ నెపంతో దూలపల్లి, బాలానగర్, చింతల్ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం, అక్కడ హెపటైటిస్, ఎయిడ్స్ తదితర విలువైన మెడికల్ కిట్లను రోగులకు పం పిణీ చేసినట్టు రికార్డులు సృష్టించారు. 2013 నుంచి జరుగుతున్న ఈ కుంభకోణంలో రూ.కోట్లు సంపాదించినట్టు తెలుస్తున్నది. ఇలా సంపాదించిన డబ్బులతో ఇద్దరూ కలిసి బంధువుల పేరిట ఉమ్మడి ఆస్తులను కొనుగోలు చేసినట్టు సమాచారం. వాటితో కూడా దందాలుచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

1377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles