గుండెకు మరింత భద్రత

Wed,December 4, 2019 02:43 AM

-కొత్త ఈసీజీ పరికరం రూపొందించిన ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు
-గుండె సంబంధిత మరణాల సంఖ్య తగ్గే అవకాశం

కంది: గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు ఒక శుభవార్త. గుండె పనితీరు ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితిలో గుండె కొట్టుకుంటుందనే వివరాలన్నీ ఇప్పుడు ఒక అలర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. గుండెకు మరింత భద్రతనిచ్చేలా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు రియల్ టైం ఈసీజీని రూపొందించారు. ఇది తక్కువ శక్తిని వినియోగించి హృదయ సంబంధ వ్యాధుల (సీవీడీ) ప్రమాదం గురించి వైద్యులు, రోగులను అప్రమత్తం చేస్తుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల వల్ల జరిగే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం పేర్కొంటున్నది.

గుండె వ్యాధులపై అప్రమత్తత

గుండె సంబంధిత వ్యాధులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా కొత్తగా ఈసీజీ పరికరాన్ని ఐఐటీ హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ ఆచార్య అభివృద్ధి చేశారు. ఈ పరికరం వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సర్వేప్రకారం ఇతర వ్యాధులతో పోలిస్తే గుండె సంబంధిత వ్యాధి ప్రజారోగ్య సమస్యల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నదని, మానవ మరణాలకు ప్రధాన కారణం ఇదే అయిందని చెప్పారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పొగాకు వాడకం, పండ్లు, కూరగాయలు తక్కువ తీసుకోవడం, శారీరక శ్రమ సరిగా లేకపోవడం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన తెలిపారు.

ఈసీజీ సంకేతాలను విశ్లేషించడం, రోగి పరిస్థితిని తెలుసుకొనేందుకు ఈ కొత్త ఈసీజీ పరికరం ఉపయోగపడుతుందని, ఈ పద్ధతి సీవీడీలకు అనుగుణంగా ఆరోగ్యస్థితి నుంచి అనారోగ్యకర స్థితికి కలిగే కారణాలను అంచనా వేస్తుందని ఐఐటీహెచ్ రిసెర్చ్‌స్కాలర్ వేమిశెట్టి నరేశ్ చెప్పారు. ఈ పరికరం ద్వారా తక్కువ శక్తిని ఉపయోగించి గుండె పనితీరు వివరాలను రోగికి లేదా వైద్యునికి చేరవేసే అవకాశం ఉంటుందని తెలిపారు. దీని ద్వారా గుండెకు సంబంధించిన పనితీరు ముందుగానే తెలుసుకుని వాటి నివారణకు తగిన వైద్య చికిత్సలు చేసుకుని గుండె సంబంధిత మరణాలను తగ్గించవచ్చని వివరించారు. ఈ పరిశోధనకు ముందు ఇక్కడి రోగులపై అన్ని రకాల అధ్యయనాలు చేసి, రోగి గుండె పనితీరును పరిశీలించి అందుకు అవసరమైన కొత్తరకం రియల్ టైం ఈసీజీని రూపొందించినట్టు నరేశ్ తెలిపారు.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles