పాసుబుక్‌కు లక్ష!


Thu,April 18, 2019 07:46 AM

Ibrahimpatnam Farmers have not got new patta passbooks

-డబ్బులు ఇవ్వకపోతే భూములను మరొకరి పేర రాస్తున్నాడు
-తాసిల్దార్ సమక్షంలోనే వీఆర్వో అవినీతిని బయటపెట్టిన రైతులు
-వారంలో సమస్యలు పరిష్కరిస్తామన్న తాసిల్దార్ హామీతో వెనుదిరిగిన రైతులు
-రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి గ్రామానికి చెందిన 50 మంది రైతులు బుధవారం ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయానికి వచ్చారు. తమ గ్రామంలో చాలా మంది రైతులకు కొత్త పాసుపుస్తకాలు రాలేదని.. పాతవి కూడా ఉన్నాయని.. ఆన్‌లైన్ పహాణీలో సైతం తమ పేర్లే వస్తున్నాయని.. అయినా వీఆర్వో పాసుపుస్తకాలు ఇవ్వకుండా అడ్డు తగులుతున్నారని తాసిల్దార్‌కు వివరించారు. రికార్డుల పరంగా తమకు అన్ని హక్కులున్నందున కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని వీఆర్వోను కోరితే.. మీరు భూములు అమ్ముకున్నారు. ఒక్కొక్కరు రూ.లక్ష ఇస్తేనే పాసుపుస్తకాలు మీకు ఇస్తా అని బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. తాము భూములు అమ్ముకోలేదని, ఇదే సర్వే నంబర్‌లో మరికొందరు రైతులు భూములు అమ్ముకున్నారని, ఈ విషయమై రియల్‌ఎస్టేట్ వ్యాపారితో కూడా వీరి భూములు కొనలేదని వీఆర్వోకు చెప్పించినప్పటికీ పాసుపుస్తకాలు ఇవ్వడంలేదని తాసిల్దార్‌కు చెప్పారు. భూములు అమ్ముకున్న రైతులకు డబ్బులు తీసుకొని వీఆర్వో పాసుపుస్తకాలు ఇప్పించారని, భూములు అమ్ముకోనివారికి మాత్రం ఇప్పించడం లేదని వాపోయారు. తమ దగ్గర అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి డబ్బులు లేవని కాళ్లా, వేళ్లా పడినా పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఎన్నిసార్లు దరఖాస్తుచేసుకున్నా ఫలితం సున్నా

రికార్డుల పరంగా తమకు అన్ని హక్కులున్నందున పాత పాసుపుస్తకాల స్థానంలో కొత్తవి ఇప్పించాలని రెండేండ్లుగా దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నామని రైతులు వాపోతు న్నారు. లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని, పైసలు ఇవ్వకపోతే తమ పట్టా భూములను కూడా ఇతర పేర్ల మీద రాస్తున్నాడన్నారు.ఈ వీఆర్వోను మా గ్రామం నుంచి తొలిగించి అర్హులైన రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు ఇప్పించి రైతుబంధు పథకం అందేలా చూడాలని తాసిల్దార్‌ను కోరారు. తమకు న్యాయం చేయకుంటే తాసిల్దార్ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు తెలిపారు.

చర్యలు తీసుకుంటాం

నెర్రపల్లి రైతుల ఫిర్యాదు మేరకు వీఆర్వోపై వారంలో విచారణ జరుపుతాం. వీఆర్వోపై అవినీతి ఆరోపణలు వాస్తవమైతే చర్య తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తా. అర్హులైన రైతులకు కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం.
- వెంకటేశ్వర్లు, తాసిల్దార్ ఇబ్రహీంపట్నం

లంచగొండితనం పోవాలి

లంచగొండితనం పూర్తిగా అరికట్టడానికి నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో అవినీతిపై ధర్మయుద్ధం ప్రకటించడం అభినందనీయం. నాకు నెర్రపల్లిలో సర్వే నంబర్ 113/అలో 1.08 గుంటలు, సర్వే నంబర్ 28/అలో 38 గుంటల భూమి ఉన్నది. దీనికి సంబంధించి పాత పాసుపుస్తకాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో మా పేర్లే వస్తున్నాయి. భూమి మేమే సాగుచేసుకుంటున్నాం. కొత్త పాసుపుస్తకాల కోసం అడిగితే, మీరు భూములు అమ్ముకున్నారని వీఆర్వో చెప్తున్నారు. అమ్మలేదని చూపించినప్పటికీ లక్ష ఇస్తేనే పాసుపుస్తకాలు ఇస్తానని వీఆర్వో చెప్తున్నాడు. నేను పేదరైతును లక్ష ఎలా ఇవ్వగలను.
- నిమ్మల నరేశ్, రైతు

6932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles