మ్యూజియం దొంగలు దొరికారు


Wed,September 12, 2018 02:35 AM

Hyderabad Nizam Museum theft case police recover antique items arrest two

-ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
-నిందితులు హైదరాబాద్‌కు చెందిన పాతనేరస్థులు
-బంగారు టిఫిన్ బాక్స్, కప్పు, సాసర్, చెంచా స్వాధీనం
-45 రోజుల ముందే రెక్కీ.. ముంబైలో అమ్మేందుకు యత్నం

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పురానాహవేలీలోని నిజాం మ్యూజియంలో చోరీ కేసును సిటీ పోలీసులు ఎనిమిది రోజుల్లోనే ఛేదించారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేసి.. వజ్రవైఢూర్యాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, కప్పు, సాసర్, చెంచాను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.వంద కోట్లకు పైనే. హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన ఇద్దరు పాత నేరస్థులే ఈ దోపిడీకి పాల్పడినట్టు తేలింది. గతంలో దేశ, విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక మ్యూజియంల్లో పలు చోరీలు జరిగాయని, కేసును తక్కువ సమయంలో ఛేదించింది మాత్రం తామేనని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఏసీపీ (క్రైమ్స్) శిఖాగోయెల్, దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ అదనపు కమిషనర్ చైతన్యకుమార్‌తో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు.

ఇద్దరూ పాత నేరస్థులే..

రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ గౌస్ పాషా అలియాస్ ఖూనీ గౌస్ ఏడో తరగతి వరకు చదివాడు. సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తూ, ఇండ్లల్లో దొంగతనాలు చేస్తున్నాడు. అతడిపై 25 చోరీ కేసులు నమోదయ్యాయి. 2017లో రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ఏడాది జూలైలో జైలు నుంచి బయటకు వచ్చాడు. అతడి చిన్ననాటి స్నేహితుడు మహ్మద్ ముబీన్ రెండో తరగతి చదివి మానేశాడు. 2015లో జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ ఓ పాకిస్థానీయుడిపై దాడి చేయడంతో జైలు శిక్ష పడింది. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజేంద్రనగర్‌లో వెల్డింగ్ పని చేస్తున్నాడు. ముబీన్ రెండు నెలల కిందట నిజాం మ్యూజియంను సందర్శించాడు. విలువైన వస్తువులకు సరైన భద్రత లేకపోవడాన్ని గమనించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత మహ్మద్ గౌస్‌కు విషయాన్ని చెప్పి, దొంగతనం చేసేందుకు ప్లాన్ వేశారు. మ్యూజియంలోని సీసీ కెమెరాల్లో 30 రోజుల డాటా మాత్రమే నిల్వ ఉంటుందని తెలుసుకొని నిందితులిద్దరూ 45 రోజుల కిందటే రెక్కీ నిర్వహించారు.

హజా విని ఖురాన్‌ను ముట్టుకోలేదు

నిందితులిద్దరూ ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి తర్వాత నిజాం మ్యూజియం వద్దకు చేరుకున్నారు. ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసుకున్నారు. ముందే మార్కు చేసుకున్న వెంటిలేటర్‌ను కోసి, తాడు సాయంతో లోపలికి దిగారు. వజ్రవైఢూర్యాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, కప్, సాసర్, చెంచాను ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న బంగారు ఖురాన్‌ను కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సమీపంలోని మసీదు నుంచి హజా(నమాజ్) వినిపించడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

ముంబైలో అమ్మేందుకు యత్నం

చోరీ పూర్తయిన తర్వాత గౌస్, ముబీన్ కలిసి బైక్‌పై మీర్‌చౌక్, గుల్జార్ హౌస్ మీదుగా పరారయ్యారు. ఔటర్ మీదుగా ముంబై మార్గంలో పంతంగి వరకు వెళ్లి, అక్కడి నుంచి సర్వీస్‌రోడ్డు మీదుగా రాజేంద్రనగర్‌కు చేరుకున్నారు. హిమాయత్‌సాగర్ సమీపంలో నేల తవ్వి వస్తువులను భద్రపరిచారు. మరుసటి రోజు జహీరాబాద్‌కువెళ్లి అక్కడ బైక్‌ను పార్క్‌చేసి, చోరీ చేసిన స్పూన్‌ను తీసుకొని బస్సులో ముంబైకి వెళ్లారు. అక్కడ వాటిని అమ్మేందుకు యత్నించినా, అనుకున్న ధర రాకపోవడంతో రెండు రోజులు ఉండి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

దొంగల రాజభోగం

చోరీ చేసిన బంగారు టిఫిన్ బాక్స్‌తో గౌస్, ముబీన్ మహారాజ భోగం అనుభవించారు. రూ.కోట్లు విలువ చేసే ఈ టిఫిన్ బాక్స్‌లో వారు మూడు రోజులపాటు భోజనం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అప్పట్లో నిజాం రాజుకు తప్ప ఇలాంటి భోగం ఇప్పటివరకు ఎవరికీ కలుగలేదని అధికారులు చెప్తున్నారు. గౌస్‌పై ఇప్పటికే ఓ కేసులో నాన్‌బెయిలబుల్ వారంట్ ఉండటంతో.. అందులో జైలుకు వెళ్లి చోరీ కేసు నుంచి తప్పించుకుందామని పన్నాగం పట్టినట్టు విచారణలో తేలింది.

5538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles