హైదరాబాద్ ఐటీ కథ..


Fri,February 5, 2016 10:52 AM

Hyderabad IT story

pvn
కంప్యూటర్లు ఎవరు కనిపెట్టారు? రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పితామహుడెవరు? సాఫ్ట్‌వేర్ విప్లవానికి సృష్టికర్త ఎవరు? మొబైల్స్ ఎవరు తీసుకొచ్చారు? హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టిందెవరు? అసలు ఐటీకి పర్యాయపదం ఎవరు?.. ఇంకెవరు నారా చంద్రబాబునాయుడే కదా! అని జవాబు చెప్పేయబోతున్నారా? ఆగండాగండి.. అదంతా ఓ పెద్ద అబద్ధం!! ఇన్నాళ్లూ ఆయన చెప్పుకొన్న గొప్పలు గోబెల్స్ ప్రచారాన్ని మించిపోయి అందరూ ఆ అబద్ధాల మాయలో పడిపోయారు. నిజానికి ఐటీ అభివృద్ధి ఆలోచనా ఆయనది కాదు, ఆ రంగం పురోభివృద్ధికి ఆయన ఆద్యుడూ కాదు! అసలు నగరంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగిన ఆ రోజుల్లో చంద్రబాబు కేవలం ఎన్టీఆర్ శిబిరంలో ఓ సాదాసీదా నాయకుడు మాత్రమే!! హైదరాబాద్ ఐటీ చరిత్ర ఈ హైటెక్ అబద్ధాలతోనే నిండిపోతున్నవేళ, ఆనాటి ఐటీ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కారకులు, బాధ్యుల ఆనవాళ్లే కనిపించకుండా పోతున్నవేళ.. నాటి పరిణామాలను, సందర్భాలను, ఆధారాలతో సహా అందిస్తున్న నమస్తే తెలంగాణ విశేష కథనం ఇది.

-1990కి ముందే నగరంలో ఐటీ అభివృద్ధికి బీజం
-ఆనవాళ్లను తుడిపేసిన చంద్రబాబు
-సైబర్‌టవర్స్‌కు శంకుస్థాపన చేసింది నేదురుమల్లి
-ఆయన హయాంలోనే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు
-ఐటీ పితామహుడినంటూ చంద్రబాబు బడాయి
-నాడే మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన
-ప్రధాని పీవీ మార్గదర్శనం.. నాటి సీఎం నేదురుమల్లి ఆచరణ
-కంప్యూటర్లు, మొబైల్స్ కూడా తన పుణ్యమేనట!
-ఐటీ విప్లవానికి పునాదులు పడ్డప్పుడు చంద్రబాబు ఓ సాదాసీదా నేత
-నాటి పరిణామాలపై నమస్తే తెలంగాణ విశేష కథనం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ప్రస్తుతం లక్షల మంది వృత్తినిపుణుల కొలువులకు ఆధారమైన ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల అభివృద్ధికి చంద్రబాబే పునాదులు వేశారనే అపోహలు చాలామందిలో బలంగా ఉన్నాయి. చంద్రబాబు అండ్ కో ఒక పద్ధతి ప్రకారం సాగించిన అబద్ధపు ప్రచారమే తప్ప.. రాష్ట్రంలో ఐటీ విప్లవానికి పునాదులు పడుతున్న రోజుల్లో చంద్రబాబు పాత్ర ఏమాత్రం కనిపించదు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టాననీ, దానికి హైటెక్ సిటీయే పెద్ద నిదర్శనమని ఆయన పదేపదే చెప్పుకుంటారు. హైదరాబాద్ అభివృద్ధి అనే ప్రస్తావన రాగానే హైటెక్ సిటీ బొమ్మ చూపిస్తూ, దాన్నే అభివృద్ధిగా చిత్రీకరించడం పరిపాటిగా మారింది. అసలు ఐటీకి తనే పితామహుడిననీ అంటారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనైతే కంప్యూటర్లు, మొబైల్స్ కూడా తన పుణ్యమేనంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం ఐటీ, సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు సంబంధించి హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానానికి చేరింది.

pvn1
ఒక్కసారి హైదరాబాద్ ఐటీ ప్రస్థానం పరిశీలిస్తే.. తాతలనాడే ఇక్కడ ఐటీకి పునాదులు పడ్డాయనేది అర్థమవుతుంది. 90వ దశకానికి ముందే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కలియతిరిగిన.. ఇప్పటికీ ఐటీ ఉద్యోగార్థులు నిత్యం కనిపించే మైత్రీవనం భవనమే ఇందుకు సాక్షి. మొట్టమొదటి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటయ్యింది ఇందులోనే. దాని విస్తరణే మాదాపూర్‌లోని ప్రస్తుత దృశ్యం. హైదరాబాద్‌లో కంప్యూటర్లు, ఐటీ అనగానే గుర్తొచ్చే కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ) సంస్థ 1982లోనే ఇక్కడ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అంతకు ఎంతో ముందుగానే ఈసీఐఎల్ ఇక్కడ ఏర్పడింది.

ఇంటర్‌గ్రాఫ్ అనే సంస్థ 1987 ఆగస్టులోనే హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు ఆరంభించింది. చంద్రబాబు పదే పదే ప్రస్తావించే సత్యం రామలింగరాజు సైతం 1987లోనే తన బంధువులతో కలిసి పీఅండ్‌టీ కాలనీలో సత్యం సంస్థ తెరిచారు. అది పెరిగి పెరిగి 1992లోనే పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. ఒక దశలో అది దేశంలోనే నాలుగో అతి పెద్ద ఐటీ ఎగుమతుల సంస్థ! అంతెందుకు, రక్షణ రంగానికి చెందిన కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ రీసెర్చ్ (డీఈఆర్‌ఎల్) ఇక్కడ 1961లోనే ఏర్పడింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు, కనీసం మంత్రి కూడా కాదు!!

pvn2

ఐటీ విజృంభణకు బీజం!


వాస్తవానికి ఇక్కడ ఐటీ రంగ విప్లవానికి బీజం వేసింది నాటి ప్రధాని పీవీ నర్సింహారావు. రాజీవ్‌గాంధీ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి సారథిగా పగ్గాలు చేపట్టిన పీవీ.. ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి కొత్త దశను కల్పించారు. అదే సమయంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ ప్రాధాన్యాన్ని కూడా గుర్తించారు. దేశంలో నాణ్యమైన మానవవనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నందున ఈ సేవారంగమే నిరుద్యోగ నిర్మూలనకు, దేశాభివృద్ధికి ఊతమిస్తుందని అనుకున్నారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు (ఎస్‌టీపీఐ) అనే కాన్సెప్ట్‌ను ఆయన బలంగా ప్రమోట్ చేశారు. మొదటి దశలో ఆరు ఎస్‌టీపీఐలు మంజూరు చేశారు.

కేంద్ర కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తొలుత అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఒక ఎస్‌టీపీఐ ఆరంభించింది. దేశంలోనే ఇది మొదటిది. తరువాత దాన్ని మరింత అభివృద్ధి పరిచి, ఎన్నెన్నో ప్రైవేటు కంపెనీలకు స్థానం కల్పించటానికి సొంత భవన నిర్మాణాన్ని సంకల్పించారు. ప్రధాని సూచన మేరకే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గం మాదాపూర్ ప్రాంతంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించటానికి నిర్ణయించింది. ఈ విషయాన్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల వ్యవస్థాపక డైరెక్టర్, ఐటీ అభివృద్ధికి ముఖ్యకారకుల్లో ఒకరైన జేఏ చౌదరి నిర్ధారించారు. 1991లో ఎస్‌టీపీఐ ఆరంభమయ్యాక వరుసగా ఎనిమిదేండ్ల్లపాటు 100 శాతం పెరుగుదల రేటు నమోదైంది. ఇది జాతీయ సగటుకన్నా ఎక్కువ. మొదట్లో కేవలం ఏడు కంపెనీలే ఈ కార్యకలాపాల్లో పాల్గొనగా, 1998-99 నాటికి ఈ సంఖ్య 158కి చేరింది.

pvn3

1992లోనే శంకుస్థాపన!


21 మే 1992లో నేదురుమల్లి స్వయంగా ఇప్పటి సైబర్ టవర్స్ భవననిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో దాని నిర్మాణ అంచనా వ్యయం రూ.4.5 కోట్లు. ఈ వ్యవహారాల్ని పర్యవేక్షించటానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఈఎల్) ఏర్పాటు చేశారు. దానికి ఆర్ పార్థసారథి ఎండీగా వ్యవహరించేవారు. అప్పుడే అనేక అమెరికా కంపెనీలు ఇక్కడ తమ వ్యాపారకార్యకలాపాల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఒక హార్డ్‌వేర్ పార్కు నిర్మాణానికి జపాన్ కూడా ముందుకొచ్చింది. రూ.400 కోట్ల సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 ప్రముఖ కంపెనీలకు లేఖలు రాసి, రాష్ట్రం కల్పించే ఐటీ సదుపాయాలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు.

హైదరాబాద్‌తోపాటు సాఫ్ట్‌వేర్ రంగాన్ని వైజాగ్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (వీఈపీజెడ్)కి విస్తరించాలని భావించారు. భవిష్యత్తులో హైదరాబాద్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్‌కు, చిప్ డిజైనింగ్‌కూ కేంద్రం అవుతుందనీ అప్పుడే జోస్యం చెప్పారాయన. ఇదీ అసలు కథ! కానీ పాపం, హైటెక్ సిటీ కథల్లో గానీ, చరిత్రలో గానీ ఎక్కడా అప్పటి ప్రధాని మార్గదర్శనం, ఆనాటి సీఎం కార్యాచరణ తాలూకు ఆనవాళ్లు కూడా లేకుండా చేసింది చంద్రబాబు ప్రభుత్వం!!

బాబుగారి రియల్ దందా!


ఇవన్నీ గమనించాక చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అస్మదీయులందరితోనూ మాదాపూర్ పరిసరాల్లో కారు చౌకగా భూములు ఎకరాలకొద్దీ కొనిపించారు. ఆ తరువాత హైటెక్ సిటీ నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఇప్పటి అనేక ఐటీ కంపెనీల ప్రాంగణాలతో పోలిస్తే హైటెక్ సిటీ చాలా నాసిరకం, ఇరుకైన స్పేస్ అని వృత్తినిపుణులందరూ ఏకీభవించేదే. ఆ భవనాన్ని చూపిస్తూ అప్పటి ప్రభుత్వ పెద్దలు, అనుయాయులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు. ఇదీ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాలకు ప్రాధాన్యం పెరిగింది. వేగంగా అభివృద్ధి చెందింది. ఇంగ్లిష్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు చౌకగా దొరికే ఇండియాపై చాలా అంతర్జాతీయ కంపెనీలు కన్నేశాయి.

తరువాత దేశీయ కంపెనీలు సైతం వాటితో పోటీపడ్డాయి. భౌగోళిక అనుకూలతలు, అనువైన వాతావరణ పరిస్థితులు, అందుబాటులోని మానవవనరుల కారణంగా హైదరాబాద్‌లో సహజంగానే ఐటీ అభివృద్ధి సాధ్యమైంది. అయినాసరే కర్ణాటక వంటి రాష్ర్టాలతో పోల్చితే ఆ అభివృద్ధి కూడా సాపేక్షంగా తక్కువే. చంద్రబాబు అండ్ కో చేసిన ప్రచారాన్ని బట్టి ఐటీ, సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తిరుగులేని నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది అని ఎవరైనా భావిస్తే తప్పులో కాలేసినట్టే! మనం ఎప్పుడూ కర్ణాటకను దాటలేదు. చెన్నై, బెంగళూరు కేంద్రంగా ఐటీ అభివృద్ధి జోరుగా సాగింది. కానీ ఆ రాష్ర్టాలు తమ పని తాము నిశ్శబ్దంగా చేసుకుంటూ పోయాయి. చంద్రబాబు శిబిరం మాత్రం ఉద్దేశపూర్వకంగానే అధిక ప్రచారానికి పూనుకుంది.

బాబుగారి హయాంలోనే డౌన్!


-నిజానికి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన 1995 సెప్టెంబర్ నాటికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎగుమతుల్లో దేశంలో మూడో స్థానంలో ఉండగా, చంద్రబాబు అధికారాంతమున అంటే 2004లో ఐదో స్థానానికి పడిపోయింది.
-ఎస్‌టీపీఐ ఆరంభమయ్యాక రూ.20 లక్షల ఎగుమతులతో మొదలై వరుసగా ఎనిమిదేండ్లపాటు 100 శాతం అభివృద్ధి రేటు నమోదు చేసింది. కాగా అది 2000లో 85 శాతానికి, 2001లో 81 శాతానికి, 2002లో 42 శాతానికి పడిపోయింది.

-సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు సంబంధించి బెంగళూరు, హైదరాబాద్ నగరాల నడుమ తేడా 1995-96లో కేవలం రూ.250 కోట్లు మాత్రమే కాగా, అది కాస్తా 2003-04కు వచ్చేసరికి రూ.2,500 కోట్లకు చేరింది. అదీ అప్పటి కర్ణాటక ప్రభుత్వ పనితీరుకూ, నాటి చంద్రబాబు ప్రభుత్వ పనితీరుకూ నడుమ తేడా!
-2003-04 సాఫ్ట్‌వేర్ ఎగుమతుల గణాంకాల మేరకు దేశంలో కర్ణాటక వాటా 38 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా అప్పట్లో కేవలం 9 శాతం మాత్రమే!
-తరువాత 2008-09 నాటికి ఆ వాటా 14 శాతానికి చేరింది.
-ప్రస్తుతం రాష్ర్టాలవారీగా చూస్తే తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా, హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉంది.
-కొద్దినెలలుగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ కారణంగా గూగుల్ వంటి ప్రఖ్యాత బహుళ జాతి ఐటీ కంపెనీలు సైతం హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ప్రారంభించటానికి ముందుకొస్తున్నాయి.

ఈ బాబు అప్పుడెక్కడ!?


ఇలా ఐటీ రంగానికి పునాదులు పడుతున్నవేళ చంద్రబాబు మంత్రీ కాదు, ముఖ్యమంత్రీ కాదు.. అప్పటికే అధికారం కోల్పోయిన ఎన్టీరామారావు శిబిరంలో ఓ నాయకుడు మాత్రమే! నేదురుమల్లి హయాంలోనే హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగినా.. ఆ తరువాత కొంతకాలానికే కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం పెరిగిపోయి, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పగ్గాలు చేపట్టినా అప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. తరువాత ఎన్టీరామారావు అధికారంలోకి రావడం, కొద్దికాలానికే 1995 సెప్టెంబర్‌లో చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న చరిత్ర అందరికీ తెలిసిందే.

1996 వచ్చేసరికి కేంద్రంలో ఎన్నికలు వచ్చాయి. లక్ష్మీపార్వతి గ్రూపును ఎక్కడికక్కడ నియంత్రించటానికి, పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికే ఆయన నానాతంటాలు పడ్డారు. ఈలోపు ప్రైవేటు ఐటీ కంపెనీలు ఇక్కడి మానవ వనరుల సాయంతో వృద్ధిలోకి రాసాగాయి. అప్పట్లోనే వై2కే సమస్య కారణంగా అమెరికా సైతం ఇండియా నుంచి నిపుణులను స్వాగతించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ముందుచూపుతో ఐటీ రంగానికి విశేష ప్రాధాన్యం ఇవ్వడంతో చాలా కంపెనీలు బెంగళూరును తమ ప్రధాన కేంద్రంగా చేసుకున్నాయి.

34481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles