దక్షిణాదిలో సుప్రీం బెంచ్!


Tue,August 13, 2019 03:31 AM

hyderabad is the perfect city for the Supreme court Bench

-డిమాండ్‌కు పెరుగుతున్న మద్దతు
-పెద్ద నగరాల్లో రీజినల్ బెంచ్‌లు ఏర్పాటుచేయాలన్న ఉపరాష్ట్రపతి
-కేంద్ర న్యాయశాఖ మంత్రికి టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ లేఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సువిశాలమైన భారతదేశంలో కేవలం ఒక్కచోటే సుప్రీంకోర్టు ఉండకూడదని, వివిధ నగరాల్లో సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్నది. దూరాభారం కారణంగా దక్షిణాది రాష్ర్టాల నుంచి సుప్రీంకోర్టులో అప్పీళ్లు తక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది ప్రాంతాలవారికి అనుకూలంగా ఉండేలా ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటుచేయాలనే డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటున్నది. ఈ డిమాండ్‌కు తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మద్దతు తెలుపడంతోపాటు న్యాయవ్యవస్థపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్ పుస్తకాన్ని ఇటీవల చెన్నైలో ఆవిష్కరిస్తూ.. సుప్రీంకోర్టుకు రీజనల్ బెంచ్‌లు ఉండాలని పేర్కొన్నారు.

కనీసం నాలుగు పెద్దనగరాల్లో సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటుచేసేందుకు ఇదే సరైన సమయమని, వీటిలో ఒక బెంచ్‌ను దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాలని అన్నారు. భారీగా పేరుకుపోయిన పెండింగ్ కేసులను తగ్గించేందుకు ఇదే పరిష్కార మార్గమని తెలిపారు. వివిధ రీజియన్లలో ప్రత్యేకంగా సుప్రీంకోర్టు బెంచ్‌లు ఉండాలన్న లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సిఫార్సులకు వెంకయ్యనాయుడు మద్దతు తెలిపారు. ఎన్నికల పిటిషన్లు, క్రిమినల్ కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. చట్టసభ సభ్యుల కాలపరిమితి ముగిసేవరకు ఎన్నికల కేసులు తేలడంలేదని, దీనివల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం అసలు ఉద్దేశాలు నెరవేరడం లేదని అన్నారు. సుప్రీంకోర్టులో దాదాపు 60వేల కేసులు, హైకోర్టుల్లో 44 లక్షల కేసులు పెడింగ్‌లో ఉన్నాయని, వీటిని తగ్గించాల్సిన అవసరం ఉన్నదని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు.

అప్పీళ్లకు, రాజ్యాంగ కేసులకు వేర్వేరు డివిజన్లు

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మరో కీలక ప్రతిపాదన కూడా చేశారు. సుప్రీంకోర్టులో రెండు డివిజన్లు ఉండాలని, రాజ్యాంగపరమైన కేసుల పరిష్కారానికి, అప్పీళ్ల పరిష్కారానికి వేర్వేరు డివిజన్లు అవసరమని తెలిపారు.

సుప్రీం బెంచ్‌కు హైదరాబాద్ సరైన నగరం

దక్షిణాది రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖరాశారు. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకు హైదరాబాద్ సరైన నగరమని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో దాఖలవుతున్న అప్పీళ్లతో పోలిస్తే దక్షిణాది రాష్ర్టాల నుంచి దాఖలయ్యే అప్పీళ్లు చాలా తక్కువ శాతం ఉంటున్నాయని గణాంకాలతోసహా వివరించారు. దూరం, భారీ వ్యయం కారణంగా దక్షిణాది కక్షిదారులు ఢిల్లీకి రాలేకపోతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్

అమెరికా న్యాయవ్యవస్థలో అప్పీల్ కోర్టులు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. రాజ్యాంగపరమైన అంశాల్లో తప్ప అప్పీళ్ల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు జోక్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇదే తరహాలో దేశంలోని హైకోర్టుల తీర్పులపై దాఖలయ్యే అప్పీళ్లను పరిష్కరించేందుకు నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌ను ఏర్పాటుచేయాలనే డిమాండ్ ఉన్నది. చెన్నైకి చెందిన వీ వసంత్‌కుమార్ అనే న్యాయవాది నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌ను దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని గతంలో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కేవలం రాజ్యాంగపరమైన వివాదాలను మాత్రమే విచారణకు చేపట్టాలని కోరారు. 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసింది. ఈ వాదనను అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యతిరేకించగా.. అప్పుడు అమికస్ క్యూరీగా నియమితులైన ప్రస్తుత అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఏర్పాటును సమర్ధించారు.

2900
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles