బీఎస్‌ఈలో జీహెచ్‌ఎంసీ లిస్టింగ్


Fri,February 23, 2018 02:44 AM

Hyderabad GHMC makes History by Listing Bonds on BSE

బాండ్లద్వారా నిధులు సమీకరించిన రెండో కార్పొరేషన్‌గా ఖ్యాతి
-అట్టహాసంగా ప్రారంభ కార్యక్రమం
- జీహెచ్‌ఎంసీకి డబుల్ ఏ రేటింగ్
-ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా రూ. 200 కోట్ల సేకరణ

GHMC
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బాంబే స్టాక్ ఎక్సేంజీలో జీహెచ్‌ఎంసీ బాండ్లు లిస్టింగ్ అయ్యాయి. గురువారం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ చేతులమీదుగా అత్యంత అట్టహాసంగా బీఎస్‌ఈ లిస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోనే మున్సిపల్ బాండ్లను జారీ చేయడం ద్వారా నిధులు సమకూర్చుకొన్న రెండో నగర కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ రికార్డు నెలకొల్పింది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) కోసం జీహెచ్‌ఎంసీ బాండ్లను జారీచేయడం ద్వారా రూ. 1000 కోట్లు సమీకరించడానికి నిశ్చయించి ఇటీవలే విజయవంతంగా రూ. 200 కోట్లు సేకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజన్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు మార్గదర్శకాలకు అనుగుణంగా బాండ్లను జారీచేసి నిధులు సమీకరించుకొంటున్నట్లు చెప్పారు.

ఇతర మున్సిపాలిటీలకు దక్కని ఏఏ (స్టేబుల్) రేటింగ్ ఖ్యాతి మన నగరానికి దక్కడం గర్వకారణమని, ఆర్థిక క్రమశిక్షణ, స్థిరమైన అభివృద్ధితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. నిధుల సమీకరణ తప్పుకాదని, తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నందునే పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారని చెప్పారు. ఇటీవల బీఎస్‌ఈలో జీహెచ్‌ఎంసీ అధికారులు తొలి ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ చేసిన మూడు నిమిషాల్లోనే దాదాపు రూ. 455 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని వివరించారు. అయినా తాము ప్రస్తుతానికి రూ. 200కోట్లు మాత్రమే సేకరించినట్లు వెల్లడించారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి, కేంద్రప్రభుత్వం కూడా స్థానిక సంస్థలు స్వయంసమృద్ధి సాధించాలని చెప్తున్నాయని గుర్తుచేశారు. నగరం శరవేగంగా విస్తరిస్తున్నదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎస్సార్‌డీపీ ప్రాజెక్టును చేపట్టామన్నారు. నిధుల రాకతో ఎస్సార్‌డీపీ పనులు మరింత వేగం పుంజుకుంటాయని మేయర్ ధీమా వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు శాంతిభద్రతల విషయంలో నగరం ప్రథమ స్థానంలో ఉందని, అందుకే యావత్ దేశం దృష్టి మన నగరంపైనే ఉన్నదని పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ఆదాయ మార్గాలు


GHMC1
నూతన సాంకేతిక పరిజ్ఞానంద్వారా లోపాలను అరికట్టి, పన్నుల వ్యవస్థను పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో మున్సిపాలిటీలు స్వయంసమృద్ధి సాధించాల్సిన అవరం ఉందని, దీనికోసం ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. బాండ్ల జారీ ద్వారా బల్దియాకు జాతీయస్థాయిలో గుర్తింపువచ్చినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. బీఎస్‌ఈలో లిస్టింగ్ కావడం పరపతితో కూడిన అంశమని ఆయన చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ మార్గాల పెంపు ద్వారా ఆర్థికాభివృద్ధిలో బల్దియాకు మెరుగైన రేటింగ్ వచ్చిందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాల మేయర్లు రవీందర్‌సింగ్, ఆకుల లలిత, రూపాలాల్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి, భారతీయ స్టేట్ బ్యాంక్ కార్ప్స్, స్పా క్యాపిటల్ లిమిటెడ్, బీఎస్‌ఈ ప్రతినిధులతోపాటు పలువురు కార్పొరేటర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-అరవింద్‌కుమార్, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి

అంతర్గత ఆదాయ మార్గాలను పెంచుకోవాల్సిందే

స్థానిక సంస్థలు తమ అంతర్గత ఆదాయ మార్గాలను పెంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధికి కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. దేశంలోని 4,041 మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 39 లక్షల కోట్లు ఖర్చవుతుందని అహ్లూవాలియా కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు గుర్తుచేస్తూ, ఇంత భారీస్థాయిలో నిధులను సమకూర్చడం ప్రభుత్వాలకు సాధ్యంకాదన్నారు. అందుకే ఆదాయ వనరులను పెంచుకోవడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వయంసమృద్ధి సాధించాలని సూచించారు.
- రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి

ట్రిపుల్ ఏ పాజిటివ్ స్థాయిని సాధించాలి

బల్దియా ఆర్థిక పరిస్థితి ప్రస్తుత ఏఏ (స్టేబుల్) నుంచి మరింత మెరుగైన ట్రిపుల్ ఏ (పాజిటివ్) స్థాయికి రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆకాంక్షించారు. స్వ యం సమృద్ధి సాధించడం ద్వారా జీహెచ్‌ఎంసీ ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, నగరాల్లో హైదరాబాద్ సైతం అంతే వేగంగా అభివృద్ధి బాటలో పయనుస్తున్నదని చెప్పారు. బీఎస్‌ఈలో జీహెచ్‌ఎంసీ లిస్టింగ్ కావడం చారిత్రక ఘట్టమని అభివర్ణించారు.
- ఎస్కే జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

1703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS