ఆన్‌లైన్ రోజుల్లోనూ వాడని అక్షరం


Sun,December 16, 2018 02:06 AM

Hyderabad Book Fair to be inaugurated by Vice President today

-పల్లెల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
-సీఎం కేసీఆర్ రచయిత అయినందున గ్రంథాలయాల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నా..
-32వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్, డిజిటల్ వేదికలొచ్చినా అక్షరం విలువ వాడిపోనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచంలోనే పుస్తక పఠనం తగ్గుతున్నదని, భారత్‌లో మాత్రం పెరుగుతున్నదని ఇది హర్షించదగిన విషయమని వివరించారు. స్వతహాగా తెలుగు భాషాభిమాని, రచయిత అయిన కే చంద్రశేఖర్‌రావు సీఎం అయినందున తెలంగాణలో గ్రంథాలయాల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన 32వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యుద్ధాలతో ప్రపంచం సాధించిందేమీ లేదని, చరిత్రలో యుద్ధాల కన్నా విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను రగిలించి మార్పులకు నాంది పలికిందన్నారు.
BOOK-FAIR1
గ్రంథాలయాల ఏర్పాటు మరోసారి ఉద్యమ రూపం దాల్చాలని, ప్రతిపల్లెకూ ఒక గ్రంథాలయం, ప్రతి ఇంటికో శౌచాలయం ఏర్పాటు చేసువాలని ఆకాంక్షించారు. 1986లో ఆశోక్‌నగర్ సిటీ లైబ్రరీలో ప్రారంభమైన హైదరాబాద్ పుస్తకమహోత్సవం దేశంలో రెండో స్థానంలో ఉందని, మొదటి స్థానంలో ఉన్న బెంగాల్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఒక తెరిచిన పుస్తకమని, ఆ పుస్తకం ఒక పుస్తక ప్రదర్శనను ఆవిష్కరించడం ఒక అద్భుతమని అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్ అధ్యక్షత వహించగా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

2562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles