పల్లెకు ఓటెత్తిన జనం!


Fri,December 7, 2018 02:40 AM

Huge Number of Public Going to Own Villages for Cast Vote

-ఓటేసేందుకు సొంతూర్లకు పయనమైన ప్రజలు
-వరుస సెలవులతో ఉద్యోగుల్లో హుషారు
-కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
-వాహనాలు పెట్టి మరీ తరలించిన అభ్యర్థులు
-ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సుల కోసం ఇక్కట్లు
-బోసిపోయిన హైదరాబాద్ వీధులు

హైదరాబాద్/హైదరాబాద్ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రాజధాని నగరంలోని ఓటరన్నలు ఊరు బాటపట్టారు. ఓటేసేందుకు అందరూ సొంతూర్లకు పయనమయ్యారు. ఐదేండ్లకోమారు వచ్చే ఎన్నికల పండుగలో పాల్గొనేందుకు ఉత్సాహంగా తరలివెళ్లారు. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పల్లెవాసులు.. ఓట్ల పండుగకు పోతుండటంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు వరుస సెలవులు రావడంతో సొంతూరులో మూడురోజులు హాయిగా గడిపేందుకు పిల్లాపాపలతో ఎందరో పల్లెముఖం పట్టారు. హైదరాబాద్ నగరం నుంచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నవారితో జూబ్లీ బస్టాండ్, మహాత్మాగాంధీ బస్టాండ్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో తీవ్ర రద్దీ నెలకొన్నది. జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సుల టాప్‌పై కూర్చుండి ప్రయాణించడం కనిపించింది. అంతకంతకు రద్దీ పెరుగడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసి ఓటర్లు ఊర్లకు వెళ్లేందుకు చొరవతీసుకొన్నారు. ఎక్కువ సంఖ్యలో కుటుంబసభ్యులు ఉన్నవారు సొంత వాహనాల్లో బయల్దేరగా.. కొన్నిచోట్ల వాహనాలను ప్రధాన పార్టీ అభ్యర్థులు ఏర్పాటుచేశారు.
voterPeople2
మునుపెన్నడూ లేనంతగా అసెంబ్లీ ఎన్నికలను ఈ సారి అన్ని పార్టీల అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహించారు. గట్టిపోటీ నెలకొన్న స్థానాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఒక్క ఓటు కూడా జారిపోకుండా చర్యలు తీసుకొన్నారు. ఇదివరకు అసెంబ్లీ ఎన్నికలను నగర ఓటర్లు పట్టించుకొన్న దాఖలాలేదు. హైదరాబాద్‌లోని ఉన్నత తరగతి ప్రజానీకం సమయానుకూలంగా ఓటేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతీ ఓటు కీలకం కావడంతో అన్ని పార్టీల నేతలు అందరినీ కలుసుకొంటూ ఓట్లు వేయాలని అభ్యర్థించడమే కాకుండా వారిని పోలింగ్‌బూత్ వైపునకు తరలివెళ్లేలా విజ్ఞానవంతులను చేస్తున్నారు. హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం అవగాహన సదస్సులు నిర్వహించి ఓటు విలువ తెలియజెప్పింది. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఓటర్లను జాగురూకుల్ని చేసే కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా నగరంలో నివసిస్తున్న పల్లెవాసులు ఇంటిబాట పట్టడంతో హైదరాబాద్ నగరం బోసిపోయినట్టయింది. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసేంత సంఖ్యలో ఓటర్లు ఇక్కడ నివసిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 5 నుంచి 12 వేల ఓటర్లు నగరంలోనే ఉంటున్నారు. ఈ ఓటర్లను ఎలాగైనా తమవైపే తిప్పుకొనేందుకు నేతలంతా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఓటర్ల అడ్రస్‌లు, ఫోన్ నంబర్ల ఆధారంగా పలు పార్టీల ద్వితీయశ్రేణి నేతలు బస్తీల్లో తిరిగి ఓట్లు వేయాలంటూ అభ్యర్థించారు. దీంతో ఎక్కువ సంఖ్యలో నగరవాసులు ఈ సారి ఓటు వేసేందుకు ఊర్లకు బయలుదేరారు.

పలు ప్రాంతాల్లో పండుగ సందడి

ఉప్పల్ బస్టాండ్ వద్ద దసరా పండుగనాటి సందడి కనిపించింది. ఉమ్మడి వరంగల్, భువనగిరి యాదాద్రి జిల్లాలకు చెందిన ఓటర్లు బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వచ్చింది. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ బస్టాపుల్లో సంక్రాంతి రద్దీ ఇప్పడే మొదలైనట్టుగా వాతావరణం కనిపించింది. ఉమ్మడి నల్ల గొండ, ఖమ్మం జిల్లాలకు చెందినవారు సొం తూర్లకు పయనమవవడంతో ఈ ప్రాంతాలు జనంతో నిండిపోయాయి. ఇక భోజగుట్ట, చంపాపేట, కర్మన్‌ఘాట్, ఫిలింనగర్ బస్తీల్లో నివసించే నాగర్‌కర్నూల్, కొల్హాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందినవారు పిల్లాపాపలతో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు బయలుదేరి వెళ్లారు. అల్వాల్, సికింద్రాబాద్‌లో నివసించే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఓటర్లు సొంతూర్లకు పోయేందుకు వచ్చినవారితో జూబ్లీ బస్టాండ్ పరిసరాలు కిటకిటలాడాయి.
voterPeople1

1752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles