వర్షపాతంలో స్వల్ప లోటు


Sun,August 25, 2019 02:32 AM

Huge deficit in South Telangana

-దక్షిణ తెలంగాణలో భారీలోటు
-నేడు గ్రేటర్‌తోపాటు ఉత్తర తెలంగాణకు భారీవర్ష సూచన

ప్రత్యేకప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వారంరోజులుగా రుతుపవనాలు మందగమనంలో కొసాగుతుండటంతో వర్షపాతం కొంతమేరకు తగ్గింది. జులై చివరి నుంచి ఆగస్టు మొదటివారం వరకు భారీలోటును అధిగమించి మూడుశాతం మిగులు వర్షపాతం నమోదనప్పటికీ, గత రెండువారాలుగా సాధారణ వర్షాలే కువరడంతో మళ్లీ లోటులోకి వచ్చింది. జూన్ 1 నుంచి ఆగస్టు 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 548.1మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 528.8 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది సగటు వర్షపాతం కంటే నాలుగుశాతం తక్కువ. హైదరాబాద్‌తోపాటు దక్షిణ తెలంగాణలోని పలుజిల్లాల్లో వర్షపాతంలో భారీలోటు నమోదైంది.

భారీలోటు వర్షపాతం నమోదైన జిల్లాలు

నల్లగొండ (-35), హైదరాబాద్ (-24), జోగుళాంబ గద్వాల ( -34), మేడ్చల్ మల్కాజిగిరి ( -15), మహబూబ్‌నగర్ ( -18), మెదక్ (-13), రంగారెడ్డి (-26), సంగారెడ్డి (-30), సూర్యాపేట (-20), వికారాబాద్ (-23), యాదాద్రి భువనగిరి (-13), ఖమ్మం (-24) జిల్లాల్లో భారీలోటు వర్షపాతం నమోదైంది.

మిగులు వర్షపాతం నమోదైన జిల్లాలు

ఉత్తర తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో (+30), వరంగల్ అర్బన్ (+26), జయశంకర్ భూపాలపల్లి (+10), కరీంనగర్ (+17) జిల్లాల్లో మిగులు వర్షపాతం కురిసింది.

అక్టోబర్ వరకు తుఫాన్లు ఉండవు

వచ్చేనెలలో మోస్తరునుంచి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. వర్షాకాలం ముగిసేవరకు సగటుతో పోల్చుకుంటే వర్షపాతం 10శాతం లోటు లేదా మిగులుగా ఉండవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనం తప్ప వానకాలం ముగిసేవరకు తుఫాన్లు వచ్చే అవకాశం లేదన్నారు. సెప్టెంబర్‌లో కొన్ని రోజులపాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.

28న మరో అల్పపీడనం

ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం ఉదయం ఒడిశాకోస్తా, దాని పరిసరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఆగస్టు 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల తేలికపాటినుంచి మోస్తరు వానలు.. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 24గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

1808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles