మహిళల భద్రతకు భరోసా

Thu,December 5, 2019 02:55 AM

-సీఎం కేసీఆర్ ఆదేశాలతో హోంమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
-హాజరైన మంత్రులు ఎర్రబెల్లి, సబిత, సత్యవతి రాథోడ్
-ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు సహా పలు కీలక నిర్ణయాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన పటిష్ఠ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దిశ ఉదంతం నేపథ్యంలో మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేసి చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం లక్డీకపూల్‌లోని హోంమంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు. మహిళల భద్రతకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మొత్తం 16 రకాల చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు జగదీశ్వర్, రవిగుప్తా, జనార్దన్‌రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్‌భగవత్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, వీవీ శ్రీనివాసరావు, ఎస్పీలు సుమతి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కమిటీ తీసుకున్న ప్రధాన నిర్ణయాలు

-జస్టిస్ ఫర్ దిశ కేసు ఇన్వెస్టిగేషన్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి. మహిళలపై నేరాలు, అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే పరిధితో సంబంధం లేకుండా కేసు నమోదుచేసిదర్యాప్తు చేపట్టాలి. జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అనుసరించాలి.
-మహిళలు, బాలికల రక్షణకు అన్ని ప్రభుత్వశాఖల సమన్వయంతో స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి.
-షీటీమ్స్‌ను మరింత పటిష్ఠపర్చి, హాక్‌ఐ సేవలు అందుబాటులోకి తేవాలి.
-అత్యవసర సమయాల్లో పోలీస్ సహాయం కోసం ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు (100, 181, 1098, 112), మొబైల్ యాప్స్‌పైన విస్తృత అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిచాలి.
-ప్రాథమిక పాఠశాలల నుంచి కళాశాలల వరకు, రవాణా వాహనాల్లో, ఆటోల్లో, క్యాబ్‌లలో అత్యవసర సేవల నంబర్లను విధిగా ప్రదర్శించేలా నోటీస్ బోర్డుల ఏర్పాటు. హెల్ప్‌లైన్ నంబర్లను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, బస్, రైల్వే, మెట్రో స్టేషన్లు ప్రదర్శించాలి.
-మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన పెంచేలా ఈ-లెర్నింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకురావాలి.
-లింగ వివక్ష అంశాలపై బాలురు, పురుషులకు, మహిళా సాధికారతపై ఈ-లెర్నింగ్ కోర్సులు నిర్వహించాలి.
-మహిళల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లను తెలియజేసేలా రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లు, చిన్న నాటకాలు, ైస్లెడ్స్‌ను సినిమా థియేటర్లలో, టీవీల్లో ప్రదర్శించాలి.
-విద్యార్థులకు మానవతా విలువలు, మహిళలు, బాలికలను గౌరవించే అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. హాజరయ్యే విద్యార్థులను ప్రోత్సహించేలా సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఇందుకు విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ, క్రీడలు, సాంస్కృతికశాఖ చర్యలు తీసుకోవాలి.
-గ్రామాల్లో విపరీత ప్రవర్తన ఉన్న యువకులను గ్రామపంచాయతీ కార్యదర్శుల ద్వారా గుర్తించి పోలీసులకు తెలియజేయాలి. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మార్గంలో నడిపించాలి.
-గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు సెర్ప్, స్వయంసహాయ బృందాలు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, మెప్మా, కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మహిళా, శిశు, పంచాయతీరాజ్‌శాఖ సిబ్బంది, వృద్ధులతో కలిపి కమిటీలు ఏర్పాటుచేసి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకోవాలి.
-ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి.
-స్వయం సహాయక సంఘాల సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్లను సందర్శించి స్థానిక మహిళల, బాలికల భద్రత అంశాలపై వారితో చర్చించేలా చర్యలు.

851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles