ఆరంభం.. సంరంభం

Mon,December 11, 2017 11:17 AM

-నగరం నలుచెరగులా నూరు స్వాగతతోరణాలు
-తెలుగు వేదికపై 20-25 నిమిషాల లేజర్ షో
-పటాకుల మోతతో మహాసభల
-ఆరంభ, ముగింపు వేడుకల సంరంభం
-వినూత్నమైన రీతిలో ఏర్పాట్లుచేస్తున్న హెచ్‌ఎండీఏ
telugu-aksharalu
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణకు వన్నె తెచ్చిన వైతాళికులను గుర్తుచేస్తూ, తేజోమూర్తులు ప్రపంచించిన మంచిమాటలను వ్యక్తీకరిస్తూ ప్రపంచ తెలుగు మహాసభల సంరంభాన్ని నిర్వహించేందుకు రాజధాని నగరం సంసిద్ధమైంది. తెలంగాణ శిల్పకళా వైభవాన్ని నభూతో నభవిష్యతి అన్నట్టు చాటేలా అపూర్వమైన స్వాగత తోరణాలను నగరం నలుచెరగులా ఏర్పాటు చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వినూత్నమైనరీతిలో ఆకట్టుకొని.. ఆహా అనిపించేలా సన్నాహాలు చేస్తున్నది. హైదరాబాద్ నగరానికి అన్ని దిక్కుల్లో ఎంపిక చేసిన 100 ప్రాంతాల్లో స్వాగత తోరణాలను నెలకొల్పుతున్నారు. ఒక్కో తోరణంపై ఒక్కో సాహితీవేత్త, కవి పేరు, ఫొటోతోపాటు వారి రచనావైశిష్ట్యాన్ని అభివ్యక్తంచేస్తూ ఈ తోరణాలు సంసిద్ధమయ్యాయి. గడిచిన నాలుగురోజులుగా ఇంజినీర్ల విభాగం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ స్వాగతతోరణాల ఏర్పాటుపై ముమ్మర చర్యలు చేపట్టింది. ఆదివారం నాటికి 20 ప్రాంతాల్లో స్వాగతతోరణాలను అమర్చారు. ఈ నెల 13 నాటికి మిగతా తోరణాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకొంటున్నామని కమిషనర్ చిరంజీవులు తెలిపారు.

ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆహార్యం తలపించేలా హెచ్‌ఎండీఏ విశేషంగా లేజర్‌షోను నిర్వహిస్తున్నది. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు లేజర్ షోను సభల చివరిరోజున దాదాపు 20-25 నిమిషాలపాటు ప్రదర్శిస్తారు. సుద్దాల ఆశోక్‌తేజ రాసిన అదిగో పోతన అన్న పాటతో ప్రారంభమయ్యే లేజర్‌షోలో నృత్యం కూడా కలగలిసి ఉంటుంది. పదిమంది సిబ్బంది పర్యవేక్షణలో లేజర్ షో కాంతులు కనువిందు చేయనున్నాయి. మహాసభల ఆరంభ, ముగింపు వేడుకల సందర్భంగా ఫైర్‌వర్క్స్ ముచ్చటగొలిపే విధంగా ఉండనున్నాయి. ఐదు నిమిషాలపాటు ఆకాశం నుంచి పూలవర్షం కురిసే తరహాలో ఫైర్ షాట్స్ ఉండనున్నాయి. తెలుగు మాగాణంలో అడగుపెట్టిన దేశ, విదేశీ ప్రతినిధులతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే సందర్శకుల ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.

నగరమంతటా విద్యుత్ కాంతులు

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రధాన జంక్షన్లు, చారిత్రక కట్టడాలు, వేదికలకు వెళ్లే మార్గాలను విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వినూత్న రీతిలో విద్యుత్ దీపాలంకరణ చేయడం ద్వారా ప్రపంచ మహాసభలను మరింత శోభాయమానం చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు. సంప్రదాయక సిరీస్ లైట్లను అమర్చకుండా సరికొత్తగా లైటింగ్ ఏర్పాటు చేసేందుకు రూ.2కోట్లను ఖర్చు చేస్తున్నారు.

తెలుగు అక్షరాలను సూచించేలా..

తెలుగు అక్షరమాలలో అ నుంచి ఱ (రౌతి) వరకు 56 అక్షరాలను విద్యుత్ దీపాలతో రూపొందించి ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్‌లపై అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు అనే బోర్డులను తయారు చేసి ఎల్బీస్టేడియంతోపాటు తెలుగుతల్లి వంతెనల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం నగరంలో పండుగ వాతావరణం కనిపించేలా పవర్ క్యాన్ దీపాలను అన్ని పార్కులు, కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి తెలియజేశారు. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్, లుంబినీ, ఇందిరాగాంధీ విగ్రహాల కూడళ్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక దీపాలంకరణలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

1523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles