మరో ఐదురోజులు వడగాడ్పులు


Sat,May 25, 2019 02:33 AM

highest temperature in Greater Hyderabad is 413 degrees

-నేటినుంచి రోహిణికార్తె ప్రారంభం
-మరింత పెరుగనున్న ఎండల తీవ్రత
-ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధికంగా 46.3 డిగ్రీలు నమోదు
-గ్రేటర్ హైదరాబాద్‌లో 41.3 డిగ్రీలు
-రాష్ట్రంలో నేడు అక్కడక్కడ వానలు
-హైదరాబాద్ వాతావరణ కేంద్రం

హైదరాబాద్ సిటీబ్యూరో/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వడగాడ్పులు భయపెడుతున్నాయి. ఉదయం 10గంటలు దాటితే ఇంటినుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఉత్తర తెలంగాణతోపాటు పలుచోట్ల వీస్తున్న వడగాడ్పులు మరో ఐదురోజుల వరకు కొనసాగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. జూన్ రెండోవారం లేదా మూడో వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనావేసిందని, అప్పటివరకు ఎండల తీవ్రత కొనసాగుతుందన్నారు. శనివారం నుంచి రోహిణికార్తె ప్రారంభంకానుంది. ఈ కార్తెలో ఎండల తీవ్రత మరింత పెరుగనున్నది. ఎండల బారిన పడకుండా ప్రజలు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయట తిరుగొద్దని అధికారులు సూచిస్తున్నారు.

శుక్రవారం ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, కరీంనగర్‌లో 45.1, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 45డిగ్రీలు, హైదరాబాద్‌లో 41.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, కుమ్రంభీం, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలం, రాజన్న సిరిసిల్లతోపాటు పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలో వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు.

నేడు అక్కడక్కడ వానలు

దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతా ల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 41.3 డిగ్రీలు

గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. ఉత్తరంవైపు నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాడ్పులకు జనం ఇబ్బందులకు గురవుతున్నా రు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు దవాఖానల పాలవుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 10.3 డిగ్రీలు పెరిగి 41.3 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.1 డిగ్రీలుగా నమోదైందని అధికారులు వెల్లడించారు. నగరంలో మరో మూడ్రోజులు ఎండల తీవ్రత ఇదే తరహాలో ఉంటుందని చెప్పారు.

1910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles