రూట్లకు రైట్ రైట్

Sat,November 23, 2019 02:56 AM

-ప్రైవేట్ పర్మిట్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
-మంత్రిమండలి నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనం..తొలిగిపోయిన మధ్యంతర స్టే ఉత్తర్వులు
-సమ్మె జరుగుతుండగా నిర్ణయం తీసుకోరాదని ఎక్కడా లేదు
-ఎంవీ యాక్ట్ ప్రకారం రవాణాపై అన్ని అధికారాలు రాష్ర్టానివే
-ప్రైవేట్ సంస్థల వాటా 50శాతానికి మించరాదని స్పష్టీకరణ
-రాష్ట్ర ప్రభుత్వమే పర్మిట్ల ప్రక్రియను చేపట్టాలన్న హైకోర్టు
-రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రక్రియ చేపడతారని ఏజీ హామీ
-ఏజీ హామీతో సంతృప్తి చెందిన ధర్మాసనం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థలకు 5,100 రూట్లలో బస్ పర్మిట్లు ఇవ్వాలని మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రైవేట్ పర్మిట్లకు సంబంధించి క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్‌రావు దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. మోటర్ వాహనచట్టం (ఎంవీ యాక్ట్) ప్రకారం రవాణావ్యవస్థపై అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నందున చట్టం అనుమతించినమేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నదని స్పష్టంచేసింది. రవాణావ్యవస్థపై పూర్తి నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయంపై ఇప్పటివరకు ఉన్న మధ్యంతర స్టే తొలిగిపోయింది.

ప్రైవేట్ పర్మిట్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ కొనసాగించిన ధర్మాసనం.. క్యాబినెట్ నిర్ణయం చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని.. సమ్మె జరుగుతుండగా నిర్ణయం తీసుకోవడం దురుద్దేశంతో కూడినదంటూ పిటిషనర్ చేసిన వాదనను తోసిపుచ్చింది. ప్రజల కష్టాలను పరిగణనలోకి తీసుకొని.. సంస్థపై ఓవర్‌లోడ్‌ను తగ్గించడానికి, ఆర్థికంగా అనుకూలం కావడానికి.. రవాణా అభివృద్ధి కోసమే క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నదన్న అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలను సమర్థించింది. మోటర్ వాహనచట్టంలోని సెక్షన్ 67 ప్రకారం ఇప్పుడు అమల్లో ఉన్న విధానాన్ని మార్చడానికి ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉన్నదని తెలిపింది. ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వడానికి సెక్షన్ 67 ప్రకారం సంక్రమించిన అధికారాలనే రాష్ట్ర క్యాబినెట్ వినియోగించుకున్నదని పేర్కొన్నది.

ఏజీ హామీతో సంతృప్తి

మోటర్ వాహనచట్టం సెక్షన్ 102లో పేర్కొన్న మేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి మాత్రమే ప్రక్రియ చేపట్టాలని.. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలుచేయాలని ధర్మాసనం ఏజీకి సూచించింది. చట్టంలో పేర్కొన్న అంశాలను, ప్రక్రియను కచ్చితంగా పాటిస్తామని, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శే సెక్షన్ 102లో పేర్కొన్న ప్రక్రియను చేపడతారని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఏజీ హామీతో సంతృప్తి చెందిన ధర్మాసనం సీఎస్ అఫిడవిట్ దాఖలు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నది. కేవలం సీఎస్ స్టేట్‌మెంట్ రికార్డుచేస్తే చాలని పేర్కొన్నది.

సమ్మెతో సంబంధం లేదు..

ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో 5,100 ప్రైవేటు బస్సు పర్మిట్లు ఇవ్వాలని ఈ నెల 2వ తేదీన క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని, ఈ నిర్ణయం దురుద్దేశంతో కూ డుకున్నదని.. దీనివల్ల కార్మికుల కుటుంబాలు ప్రభావితమవుతాయని పిటిషనర్ తరఫు న్యా యవాది చిక్కుడు ప్రభాకర్ చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్ర మంత్రివర్గం ప్రైవేట్ బస్సు పర్మిట్లకు సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుందని, ఎంవీ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారం ఏ సమయంలోనైనా (ఎనీ టైం) నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టంగా ఉన్నట్లు తెలిపింది. దురుద్దేశంతో.. ఆర్టీసీకి నష్టంచేసే ఉద్దేశంతో క్యాబినెట్ నిర్ణ యం ఉన్నదని చెప్పడానికి అవకాశం లేదని పేర్కొన్నది.

పోటీతత్వం కోసమే ప్రైవేట్ వారికి అవకాశం

ప్రజలకు ఉత్తమ, మెరుగైన రవాణా సౌకర్యాలు, బస్సుల్లో అధిక రద్దీని తగ్గించడం, అనుకూలమైన, అందుబాటు టికెట్ ధరలు, ఎక్కువ సంఖ్యలో బస్సులు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి కేంద్రచట్టమే అనుమతిస్తున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ప్రైవేట్ సం స్థల ప్రవేశాన్ని అడ్డుకోలేమని స్పష్టంచేసింది. ప్రైవేట్ సంస్థలు ఉన్నప్పుడే ప్రజారవాణా మెరుగుపడుతుందని, మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చేసిన వాదనను ధర్మాసనం సమర్థించింది.

జుడిషియల్ రివ్యూ పరిధిలోకి రాదన్న వాదనను వదిలేయండి

పిటిషన్ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ధర్మాసనానికి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకున్నది. క్యాబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేసే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 166ను ధర్మాసనం ముందు ఏజీ ప్రస్తావించారు. క్యాబినెట్ నిర్ణయం గవర్నర్ ఆమోదంతో జీవో రూపంలో వ్యక్తమయ్యేవరకు.. సదరు నిర్ణయం జుడిషియల్ రివ్యూ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. ఈ మేరకు పలు సుప్రీంకోర్టు తీర్పులను సమర్పించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఆర్టికల్ 166 అనేది గవర్నర్ పేరిట నిర్ణయాలు అమలుచేసేందుకు ఉద్దేశించినదని.. దానికి జుడిషియల్ రివ్యూకు సంబంధం లేదని పేర్కొన్నది. జుడిషియల్ రివ్యూ పరిధిలోకి రాదనే వాదనకు బదులు.. ఎంవీ యాక్ట్ ద్వారా లభించిన అధికారాల ప్రకారం, చట్టం అనుమతిస్తున్న అంశాలను అమలుచేయడానికే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదనే వాదనే ఉత్తమమని ధర్మాసనం ఏజీకి సూచించింది. దీనిపై స్పందించిన ఏజీ.. తమ లిఖితపూర్వక వాదనల్లో అదే ఉన్నదని తెలిపారు.
High-Court1

ఆదేశాల సస్పెన్షన్ కుదరదు

క్యాబినెట్ నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు తీర్పు ఇవ్వడంతో.. అప్పీల్ చేసుకోవడానికి సమయమివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు పదిరోజులపాటు ఆదేశాలను సస్పెండ్‌చేయాలని, మధ్యంతర స్టేను కొనసాగించాలని కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం.. ఒకసారి పిటిషన్‌ను తిరస్కరిస్తూ తుదితీర్పు ఇచ్చిన తర్వాత స్టే ఉత్తర్వులు తొలిగిపోతాయని తెలిపింది. పిటిషనర్ ఒక్కరోజులో కూడా అప్పీల్ చేసుకోవచ్చని, అప్పీల్ చేసుకునే విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని స్పష్టంచేసింది. తుదితీర్పు ఇచ్చిన తర్వాత సస్పెన్షన్ అనేది ఉండదని స్పష్టంచేసింది. ధర్మాసనం ఆదేశాలతో ప్రైవేట్ బస్సు పర్మిట్లపై క్యాబినెట్ నిర్ణయాన్ని అమలుచేయడానికి ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.

మనసు దోచుకున్న ఏజీ బీఎస్ ప్రసాద్

తన వాదనల సందర్భంగా దొర్లిన చిన్న చిన్న పొరపాట్లకు తనను మన్నించాలని ఏజీ బీఎస్ ప్రసాద్ ధర్మాసనాన్ని కోరారు. వాదనల సందర్భంగా హై పిచ్‌లో తాను మాట్లాడినట్లు దానికి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. కేసు వాదించేటప్పుడు ఎన్నో అంశాలు వస్తాయని, అవన్నీ తామేమీ పట్టించుకోబోమని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ తెలిపారు. అలాంటివన్నీ సర్వసాధారణమేనని, ఇవి వ్యక్తిగత అంశాలు కాదని ధర్మాసనం ఏజీని అనునయించింది.

పర్మిట్ల ప్రక్రియ ప్రభుత్వమే చేపట్టాలి

పర్మిట్ల ప్రక్రియను అమలు చేయడానికి సెక్షన్ 102 లో పేర్కొన ప్రొసీజర్‌ను అమలుచేయాలని, పర్మిట్ల అమలు అంశంపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని, స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యే ఆర్టీసీతోపాటు ఇతరుల వాదనలు వినాలని, అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల సమయం ఇవ్వాలని తెలిపింది. 5,100 పర్మిట్లు ఇచ్చే అధికారాన్ని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా, రవాణాశాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తదితరులు సభ్యులుగా ఉండే స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి ఇవ్వాలన్న క్యాబినెట్ నిర్ణయంలోని అంశంతో హైకోర్టు విభేదించింది. ఎంవీ యాక్ట్ ప్రకారం ప్రైవేటు పర్మిట్లు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి.. సెక్షన్ 102లోని ప్రొసీజర్‌ను అనుసరించి ప్రైవేట్ పర్మిట్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఉన్నప్పటికీ.. ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నిర్ణయం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం కాబోదని పేర్కొన్నది. పర్మిట్లు ఇచ్చే అధికారం అథారిటీకి అప్పగించాలని చట్టంలో లేదని ధర్మాసనం తెలిపింది. ఎంవీ యాక్ట్ చాప్టర్ 6లో స్టేట్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ సంస్థలకు కొన్ని రక్షణలు ఉండటంతోపాటు ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొంటున్నందున, ప్రైవేటు సంస్థల వాటా 50 శాతానికి మించకూడదని ధర్మాసనం స్పష్టంచేసింది.

3033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles