ఉషోదయానికి మంచుదుప్పట్లు!


Sun,January 13, 2019 02:27 AM

Heavy smog from midnight to morning In Telangana

-దట్టంగా కమ్ముకోవడంతో ఇబ్బందిపడ్డ ప్రజలు
-ఉదయం 10 గంటలవరకు లైట్ల వెలుతురులో ప్రయాణం
-కొన్నిచోట్ల మధ్యాహ్నంవరకు అదే పరిస్థితి
-మంచులో కనువిందు చేసిన చారిత్రక కట్టడాలు, కొండలు, అడవులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: రాష్ట్రంలో చలి తీవ్రత కొంత తగ్గినా అర్ధరాత్రినుంచి ఉదయంవరకు దట్టంగా పొగమంచు కమ్ముకుంటున్నది. పల్లె, పట్నం తేడాలేకుండా మంచు దుప్పటి కప్పేస్తున్నది. మంచు కారణంగా దారి కనిపించక రాష్ట్రంలో చాలాచోట్ల వాహనదారులు శనివారం ఉదయం 10 గంటలవరకు కూడా లైట్లు వేసుకొని ప్రయాణించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నంవరకూ ఇదే పరిస్థితి కనిపించింది. చారిత్రక వరంగల్ మహానగరాన్ని మంచు కమ్మేసింది. మంచు తెరల మధ్య చారిత్రక అందాలు మసకమసకగా కనిపిస్తూ నగరవాసులకు కనువిందు చేశాయి. ఖిలావరంగల్‌లోని కాకతీయుల కట్టడాలు మంచు తెరల మధ్య అందంగా కనిపించాయి. భద్రకాళి చెరువును సైతం మంచు దుప్పటి కప్పేసింది. మహబూబాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటలవరకు కూడా మంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి.

పెద్దపల్లి జిల్లాలో వాహనాలు ఉదయం 10 గంటలవరకు లైట్లు వేసుకొని నడిచాయి. కొన్నిచోట్ల మధ్యాహ్నం 12 గంటలవరకు కూడా దట్టమైన పొగమంచు కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీలో ఉదయం 10:30 గంటలవరకు జాతీయ రహదారిపై వాహనాలు లైట్లు వేసుకొని వెళ్లాయి. పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సులో వేలాడేవంతెనలు, రెస్టారెంట్లను మంచు దుప్పటి కప్పేసి చూపరులకు కనువిందుచేశాయి. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 9 గంటలవరకు వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లారు. ఎత్తైన గుట్టలు, కొండలు, అటవీ ప్రాంతాలు మంచులో అందంగా కనిపించాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను సాయంత్రం 6 గంటలకే పొగమంచు కమ్ముకుంటున్నది. పొలాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు చీకటిపడకముందే ఇండ్లకు చేరుతుండగా, రోడ్లపై సందడి తగ్గిపోతున్నది. నల్లగొండను మంచు కప్పేస్తున్నది. విజయవాడ హైవేపై వాహనదారులు ఉదయం 9 గంటలవరకు కూడా లైట్లు వేసుకొని వెళ్తున్నారు.
Cold1

993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles