నేడు విస్తారంగా వానలు


Thu,July 12, 2018 02:51 AM

Heavy rains to continue in Telangana

-24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం!
-పలు జిల్లాల్లో భారీ వర్షాలు
-పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
-జలాశయాల్లోకి భారీగా వర్షం నీరు
-రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు చెప్పారు. దీనికితోడు ఉత్తర మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు, ఉత్తర కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం చాలాప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలతోపాటు చాలాప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం సైతం చాలాప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.

rain2

కొల్లాపూర్‌లో అత్యధికంగా 5 సెం.మీ.వర్షపాతం

రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వనపర్తిలో 4 సెం.మీ, నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపెల్లి, డిచ్‌పల్లిల్లో 3 సెం.మీ, జోగుళాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు, ఆలంపూర్, నిజామాబాద్‌ల్లో 2 సెం.మీ.చొప్పున, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, నిజామాబాద్ జిల్లా నవీపేట, రంజల్, మక్లోర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, తిమ్మాజిపేట, కల్వకుర్తి, వికారాబాద్ జిల్లా తాండూరుతోపాటు సూర్యాపేటలో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో బుధవారం హైదరాబాద్‌లోని పలుచోట్ల మోస్తరు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లుల వర్షం కురిసింది. గురు, శుక్రవారాల్లో గ్రేటర్‌లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్టు బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

7014

More News

VIRAL NEWS

Featured Articles