ఊపందుకోనున్న వానలు


Sun,August 13, 2017 06:32 AM

Heavy rainfall in store for Telangana Andhra Pradesh

-కొనసాగుతున్న ద్రోణి ప్రభావం.. చురుకుగా నైరుతి రుతుపవనాలు
-చెన్నారావుపేట, ఖానాపూర్‌లో గరిష్ఠంగా 7 సెం.మీ.వర్షపాతం
-రాజధానిలో భారీ వర్షం.. లోతట్టుప్రాంతాలు, రోడ్లు జలమయం

rainహైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి వర్షాలు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 16న రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నదని, దీనికి తోడు కోస్తాంధ్ర తీరం వెంట సముద్రతీరానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. శనివారం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు చెన్నారావుపేట, ఖానాపూర్‌లో అత్యధికంగా 7 సెం.మీ.వర్షపాతం నమోదైంది. నాగిరెడ్డిపేట, లక్సెట్టిపేటలో 5 సెం.మీ., ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలలో 4 సెం.మీ, ఇల్లెందు, సారంగపూర్, అశ్వాపురం, మహబూబాబాద్, దోమకొండలో 3 సెం.మీ చొప్పున వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

rain1

మరో 24 గంటలు వర్షసూచన


అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, బంజారాహిల్స్, బేగంపేట, ప్యాట్నీ, నాంపల్లి, అబిడ్స్, పాతబస్తీ, అంబర్‌పేట, కోఠి, ఉప్పల్, హబ్సిగూడ, మేడ్చల్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. దీంతో లోతట్టుప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌జాం కారణంగా వాహనదారులు ఇబ్బందిపడ్డారు. వచ్చే 24 గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం గ్రేటర్ పరిధిలో గరిష్ఠంగా 1.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

1978

More News

VIRAL NEWS

Featured Articles