గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం

Sun,October 13, 2019 02:48 AM

-మరో మూడు జిల్లాల్లోనూ..
-ఖమ్మం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు
-కామారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, మాదాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, ఉప్పల్, కాప్రా, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలువడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా మాదాపూర్‌లో 4.5 సెం.మీ., కుత్బుల్లాపూర్‌లో 3.0సెం.మీ., కూకట్‌పల్లిలో 2.9సెం.మీ., షేక్‌పేటలో 2.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

వచ్చే 36 గంటల్లో గ్రేటర్‌లో..

ఉపరితల ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ద్రోణి ప్రభాంతో రాగల 36 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఆయా జిల్లాల్లో..

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నర్సంపేట డివిజన్‌లోని పాకాల, రంగాయ, మాధన్నపేట, కోపాకుల చెరువులతోపాటు కుంటలు కూడా అలుగులు పోస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం భారీ వర్షం కురువగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 1.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలో పిడుగుపాటుకు మగ్గం బాలరాజ్ (55) మరణించాడు.

48 గంటల్లో ఓ మోస్తరు వానలు

లక్షద్వీప్ ప్రాం తం నుంచి ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనంగా మారింది. దీంతో ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచే గాలులు వీస్తున్నాయి. రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ నెలాఖరు వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనం మొదలైందన్నారు. కానీ తెలంగాణలో రుతుపవనాల తిరోగమనం ఈనెలాఖరు తర్వాతే ఉంటుందన్నారు. అప్పటివరకు తరుచూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు.

1696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles