మూడు జిల్లాల్లో భారీ వర్షం


Mon,August 19, 2019 02:34 AM

Heavy rain in telangana three districts

-ఏడు జిల్లాల్లో ఓ మోస్తరు..
-ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం
-అత్యధికంగా అనుములలో 7.29 సెం.మీ. నమోదు
-రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వర్ష సూచన

హైదరాబాద్ నమస్తే తెలంగాణ/సిటీబ్యూరో/నెట్‌వర్క్: పలు జిల్లాల్లో ఆదివారం వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, నల్లగొండ జిల్లాల్లో భారీగా, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. ఆసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు గాయపడగా, ఓ ఆవు మృత్యువాతపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా అనుముల మండలంలో 7.29 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా రాగల 48గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.
Rain-TS1
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, బెజ్జూర్ మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. సుమారు రెండుగంటలపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. పిడుగుపాటుకు కౌటాల మండ ల కేంద్రంలో ఓ ఆవు మృత్యువాతపడింది. గురుడుపేట్‌లో వెంకటేశ్ అనే రైతు పొలం పనులకు వెళ్లి వస్తుండగా, బెజ్జూర్ మండలం మర్థిడి గ్రామంలో గొల్లపల్లి రాజేశ్ పిడుగుపాటుకు అస్వస్థతకు గురయ్యారు. కౌటాల మం డలంలోని పలు గ్రామాల్లో పంటచేండ్లు నీట మునిగాయి. తలోడి గ్రామంలో ఇండ్లల్లోకి వరద చేరింది. రవీంద్రనగర్-చింతపల్లి గ్రా మాల మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యధికంగా కౌటాల మండలంలో 8.2 మి.మీటర్ల వర్షపా తం నమోదైంది. కాగా పెంచికల్‌పేట్, దహె గాం, కాగజ్‌నగర్, సిర్పూర్-టి మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

కరీంనగర్ జిల్లాలో..

కరీంనగర్ జిల్లా శంకరపట్నం, మానకొండూ ర్, హుజూరాబాద్, వీణవంక, సైదాపూర్, జమ్మికుంట మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెరువులు మత్తడిపోయగా, మరికొన్ని చెరువులు పూర్తిగా నిండాయి. శంకరపట్నం మండలంలో 40.6 మి.మీ.వర్షపాతం నమోదైంది.
Rain-TS2

పెద్దపల్లి జిల్లాలో..

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం భారీ వర్షం పడిం ది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కుండపోతగా కురిసింది. భారీ గా వరద నీరు చేరడంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెద్దపల్లితోపాటు గోదావరిఖని, సుల్తానాబాద్ పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరింది. పంట పొలాలు సైతం నీట మునిగాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం వర్షం కురిసింది. అనుముల, పీఏపల్లి, తిర్మలగిరి సాగర్ మండలాల్లో భారీగా మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా కురిసింది. అత్యధికంగా అనుముల మండలంలో 72.9 మి.మీ. వర్షపాతం నమోదైంది.

జనగామ జిల్లాలో..

జనగామ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. జనగామ పట్టణంలో ఉదయం అరగంటపాటు భారీ వర్షం కురవగా, మధ్యాహ్నం 3గంటల వరకు ఎడతెరిపి లేకుండా ముసురు పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, గూడూరు, గంగారం మండలాల్లో వర్షం కురిసింది. తొర్రూరు మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో వర్షం దంచికొట్టింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పలు వాగులు, కాల్వల్లోకి నీరు చేరింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ మోస్తరు వాన పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురుపట్టింది. మధ్యాహ్నం జల్లులు కురిశాయి. ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, కమలాపూర్, హసన్‌పర్తి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, వరంగల్ నగరంలో చిరుజల్లులు పడ్డాయి. ములుగు జిల్లా కేంద్రంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంతోపాటు పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, మణుగూరు, దుమ్ముగూడెం, ఆళ్లపల్లి, గుండాల మండలా ల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
Rain-TS3

గ్రేటర్ హైదరాబాద్‌లో జల్లులు..

గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. యాచారం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. యాచారంలో 1.8 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని సింగరేణి మణుగూరు ఏరియాలో ఆదివారం కురిసిన వర్షానికి పీకేఓసీ-2, పీకేఓసీ-4, మణుగూరు ఓసీ గనుల్లోని క్వారీల్లోకి భారీగా వరద నీరు చేరింది. సెకండ్ షిప్టులో ఓవర్‌బర్డెన్(ఓబీ), కోల్ ఉత్పత్తికి పూర్తిగా ఆటంకం ఏర్పడింది. మణుగూరు ఏరియా నుంచి రోజూ సుమారు 30 వేల టన్నుల బొగ్గు తీయాల్సి ఉండగా ఆదివారం బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

48 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి వానలు

తెలంగాణలో రుతుపవనాలు మందగమనం లో సాగుతున్నాయి. రాగల 48 గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో మాత్రం రుతుపవనాలు బలం గా ఉన్నాయని, అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో మరో మూడు రోజుల తర్వాత రుతుపవనాలు పుం జుకోవచ్చన్నారు. 24గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురియవచ్చని తెలిపారు.
Rain-TS4

అక్టోబర్‌లో భారీ తుఫాన్!

-ఆ నెల రెండోవారం వరకూ రుతుపవనాలు
-మూడోవారంలో ఉపసంహరణ.. అదే సమయంలో తుఫాన్!
-పీఐకే శాస్త్రవేత్తల వెల్లడి
అక్టోబర్ రెండోవారం వరకూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందనీ, అక్టోబర్ 14 నుంచి 24వ తేదీల మధ్య రుతుపవనాల ఉపసంహరణ ఉంటుందని ఇండో-జర్మన్ వాతావరణ ప్రాజెక్ట్, పొట్స్ డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ైక్లెమెట్ ఇంపాక్ట్ రీసెర్చ్(పీఐకే) శాస్త్రవేత్తలు వెల్లడించారు. రుతుపవనాల ఉపసంహరణ సమయంలో గతేడాది తిత్లీ తుఫాన్ మాదిరిగా ఈసారీ భారీ తుఫాన్ ఏర్పడే అవకాశమున్నదని వారు తెలిపారు. టిప్పింగ్ ఎలిమెంట్ విధానం ద్వారా ఈ సంస్థ గత నాలుగేండ్లుగా వేస్తున్న వాతావరణ అంచనాలు దాదాపుగా నిజమవుతున్నాయి. 2018 అక్టోబర్ 18న రుతుపవనాలు మధ్య భారతం నుంచి ఉపసంహరణ ఉంటుందని ఆ సంస్థ అంతకుముందే 2018 జూలై 30న వెల్లడించగా, అంచనా ప్రకారమే ఉపసంహరణ జరిగింది. 2016, 2017లోనూ రుతుపవనాల ఆగమనం, ఉపసంహరణకు సంబంధించి ఆ సంస్థ వెల్లడించిన ముందస్తు అంచనాలు నిజమయ్యాయి. వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్‌బాబు నాయకత్వంలోని ఇండో-జర్మన్ పీఐకే సంస్థ విజయవంతంగా వాతావరణ పరిశోధనలను నిర్వహిస్తున్నది.

ఉపసంహరణ సమయంలో భారీ తుఫాన్

అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో రుతుపవనాల ఉపసంహరణ సమయంలో భారీ తుఫాన్ వచ్చే అవకాశమున్నది. గతేడాది ఇదే సమయంలో తిత్లీ తుఫాన్ ఏర్పడింది. భూతాపం పెరిగిపోతున్న క్రమంలో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. ముంబై, కర్ణాటక, కేరళతోపాటు ఉత్తర భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకేచోట కురవడం వంటి పరిణామాల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి.
- చెన్నమనేని రమేశ్‌బాబు, వేములవాడ ఎమ్మెల్యే, పీఐకే అనుసంధానకర్త.
Rain-TS5
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్యశాఖ పరిపాలన అధికారి వినోద్ తన సిబ్బందితో కలిసి పాల్వంచ మండలం ఉల్వనూరు పంచాయతీ పరిధిలోని రాళ్లచెలకతోగు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించేందుకు వెళ్తూ.. మార్గమధ్యంలోని వాగు దాటారు. అవతల మరో 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి 140 మంది గిరిజనులకు వైద్యసాయం అందించారు. తిరిగి అదే వాగు దాటి వెనక్కివచ్చారు. వాగుదాటి వచ్చిన వైద్యులు కిరణ్, నరేంద్ర, సీహెచ్‌వో రామకృష్ణ, ఏఎన్‌ఎంలను పలువురు అభినందించారు.
- పాల్వంచ

4033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles