జోరువాన


Mon,July 22, 2019 02:39 AM

heavy rain in telangana

-ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా..
-భద్రాద్రి, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లో ఓ మోస్తరు
-రాగల మూడ్రోజులు వర్షసూచన: వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు ఖమ్మం జిల్లాలో ఓ మహిళ మృతి చెందింది. పలుచోట్ల చెరువుల్లోకి నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. రాగల మూడ్రోజుల వరకు రాష్ట్రంలో ని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మో స్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

rain3

ఖమ్మం జిల్లాలో..

ఖమ్మం నగరంతోపాటు పలు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. నగరంలో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి.కామేపల్లి మండలం పండితాపురం శివారులో పిడుగుపాటుకు గిరిజన మహిళ భూక్య లాలి మరణించింది. ఖమ్మం రూరల్, చింతకాని, బోనకల్, కూసుమంచి, కామేపల్లి, రఘునాథపాలెం, కొణిజర్ల, కారేపల్లి, వైరా తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, టేకులపల్లి, ఇల్లెందు, చండ్రుగొండ, కొత్తగూడెం తదితర మండలాల్లో ఆదివారం చిరుజల్లులు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి ఉట్నూర్ మండల కేంద్రం లో కురిసిన కుండపోతకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురికి కాల్వలు నిండిపోవడంతో ప్రధాన రహదారిలోని దుకాణ సముదాయాల్లోకి నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. సిరికొండ మండలంలో ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో మండలంలోని సిరికొండ, పాండు గూడ, కొండాపూర్, ఎల్లమ్మ, కొత్త చెరువు కుంటలు నిండాయి.

గుడిహత్నూర్ మండలం ఉమ్రి(బి)లో పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాతపడింది. బజార్ హత్నూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్ రూరల్, తలమడుగు, ఇంద్రవెల్లి, బోథ్, భీంపూర్, జైనథ్, నార్నూర్, ఆదిలాబాద్ అర్బన్, తాంసి, మావల మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రెండు గంటలపాటు కురిసిన వర్షానికి జేకే నగర్ కాలనీ చుట్టూ భారీగా వరద చేరింది. జగిత్యాల జిల్లాలో శనివారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సారంగాపూర్, జగిత్యాల, రాయికల్, ధర్మపురి, మల్యాల, గొల్లపల్లి, కొడిమ్యాల, వెల్గటూర్, కోరుట్ల, మేడిపల్లి, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మల్లాపూర్‌లో భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్, నాగారం, అర్వపల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హుజూర్‌నగర్ గంటపాటు వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. హుజూర్‌నగర్ చెరువులోకి భారీగా వరద నీరు చేరింది.

నమోదైన వర్షపాతం వివరాలిలా..

శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో 105 మి.మీ. వర్షపాతం నమోదైంది. మంచిర్యాల వెలగనూరులో 67, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో 81.8 మి.మీ., ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో 74.5 మీ.మీ., సిరికొండలో 74, జగిత్యాల జిల్లా అలీపూర్‌లో 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

rain2

రాగల మూడ్రోజులు పలుచోట్ల భారీ వర్షాలు

రాగల మూడ్రోజుల వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా కొన్నిచోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉన్నదన్నారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నదని, మరో వైపు ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, వీటి ప్రభావంతో రుతుపవనాలు మరింత బలపడ వచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వచ్చే 36 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు వర్షసూచన

రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాగల 36 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం ఉద యం నుంచి వాతావరణం చల్లబడినప్పటికీ మధ్యాహ్నం సమయానికి ఎండ తీ వ్రత పెరిగింది. ఉదయం నుంచి సాయం త్రం 5.30 వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 31.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 61శాతంగా నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

1792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles