వేగంగా పాలమూరు పనులుFri,February 23, 2018 02:33 AM

-పనులు ఆలస్యం చేసే ఏజెన్సీలపై చర్యలు
-జూలై తర్వాత గడువు పెంచే ప్రసక్తే లేదు
-కొత్త ఏజెన్సీలకు పనులు ఇవ్వాలి
-వానకాలం పంట ఆయకట్టుకు నీరివ్వాలి
-పాలమూరు ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

harishrao
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పనుల్లో ఆలస్యం చేసే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం జలసౌధలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాలుగు ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలోని ప్రతీ ప్యాకేజీ పనులను సుదీర్ఘంగా చర్చించారు. కొన్నిచోట్ల పనులు ఆలస్యం కావడంపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వానకాలం నాటికి నాలుగు ప్రాజెక్టుల కింద నిర్ణీత ఆయకట్టుకు నీరందించాలని స్పష్టంచేశారు. శుక్ర, శనివారాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తానని, ప్రతీ ప్యాకేజీలో జరుగుతున్న పనులను సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తానన్నారు. శుక్రవారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని మంత్రి చెప్పారు.

కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే భూసేకరణ అంశంలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనులను షెడ్యూల్ ప్రకారం చేయకుండా జాప్యంచేస్తున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నత్తనడకన పనులు చేస్తున్న ఏజెన్సీలను గుర్తించి, ఆయా ఏజెన్సీలను 60 సీ నిబంధనల కింద టర్మినేట్ చేసి, వేరే ఏజెన్సీలకు పనులు అప్పగించాలని సూచించారు. కల్వకుర్తి లిఫ్ట్-3లో నాలుగు పంపులు పనిచేస్తున్నాయని, 5వ పంపు బిగింపు పనులను త్వరగా పూర్తిచేయాలని, మార్చి నెలాఖరుకు ఈ పనులు పూర్తికావాలని ఆదేశించారు. లిఫ్ట్-2 నుంచి లిఫ్ట్-3 వరకు తవ్విన టన్నెల్‌లో 1, 2 కిలోమీటర్ల లైనింగ్ పనులను జూలై వరకు పూర్తిచేయాలని స్పష్టంచేశారు. జూలై తర్వాత ఏజెన్సీలకు గడువు పెంచే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు.

కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద ఇప్పటికే 5 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నామని వివరించారు. కల్వకుర్తి నుంచి 3.75 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాలకు నీటిని అందించామన్నారు. బీమా కింద 2.03 లక్షల ఎకరాలకుగానూ లక్ష ఎకరాలకు సాగునీటిని అందించామని, నెట్టెంపాడు పరిధిలో 2 లక్షల ఎకరాలకుగాను లక్ష ఎకరాలకు, కోయిల్‌సాగర్ కింద 50 వేల ఎకరాలకుగాను 20వేల ఎకరాలకు సాగునీటిని అందించామని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గంలో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన చంద్రసాగర్ ఎక్స్‌టెన్షన్ కెనాల్ నిర్మాణ పనుల ఆమోదానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్‌రావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల సీఈ ఖగేందర్, ఎస్‌ఈలు భద్రయ్య, రఘునాథరావు పాల్గొన్నారు.

1402

More News

VIRAL NEWS