మీ పిల్లలు ఏం తింటున్నారు?

Sun,January 20, 2019 02:17 AM

-లంచ్‌బాక్సుల్లో ఉన్నది పౌష్ఠికాహారమేనా!
-కాస్తంత శ్రమిస్తే పిల్లలకు పరిపూర్ణ లంచ్‌బాక్స్
-బయటి స్నాక్స్ బదులు.. ఇంట్లోనే తయారుచేయాలి
-వైద్యులు, స్వచ్ఛంద సంస్థల సూచనలు
-హడావుడిలో అందని సమతుల్య ఆహారం..
-అన్నం, కూర కలుపుకొని తినటం నేర్పాలి

పొద్దున్నే పిల్లలను తయారుచేయాలి.. డ్రస్సు వేసుకుని రాగానే.. టిఫిన్ లేదా పాలు సిద్ధంచేయాలి! ఆ మధ్యలోనే వంట పూర్తిచేసి.. లంచ్ బాక్సు, స్నాక్స్‌కు మరో బాక్సు ప్రిపేరేషన్! అది జరుగుతుండగానే టైమైతంది.. జల్దిరావాలె.. అంటూ ఆటో లేదా స్కూలుబస్సు హారన్ మోత! భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైతే వారూ రెడీ అవ్వాలి! కాలంతో పోటీ! హడావుడి.. గందరగోళం.. అయోమయం! స్కూలుకు పిల్లలను పంపించేదాకా ప్రతి ఇంట.. ప్రతిరోజు యజ్ఞమే! ఇంత హడావుడిలో వారి బాక్సులో అప్పటికప్పుడు ఉడుకుతున్న రెండుమూడు గరిటెల అన్నం.. ఓ గరిటె కూర వేసి.. కలిపేసి.. ఓ స్పూన్ వేసి.. ఆ రోజుకు ముగించేస్తే.. చాలావరకు బాక్సులు పెట్టినవి పెట్టినట్టుగానే తిరిగొచ్చేస్తున్నాయి! వాటర్‌బాటిల్ అన్నా ఖాళీ అవుతుందా అంటే అదీ లేదు! ఎందుకు? నమస్తే తెలంగాణ ఓ పదిహేను రోజులపాటు స్కూలు పిల్లల లంచ్‌బాక్సుల్లో ఏముంటున్నాయో పరిశీలించింది! వారి ఆహార అలవాట్లు.. వారి ఆరోగ్య పరిస్థితులపై నిపుణులతో చర్చించింది! ప్రత్యేకంగా వండివార్చాల్సిన అవసరం లేకపోయినా.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల లంచ్‌బాక్స్ వారికి కావాల్సినంత పోషకాలను అందిస్తుందనేది నిపుణుల వాదన!

శిరందాస్ ప్రవీణ్‌కుమార్, నమస్తే తెలంగాణ: సాయంత్రం దాకా స్కూల్లో గడిపే పిల్లలకు పోషకాహారం అందుతున్నదా? బాక్సులు ఎందుకు ఖాళీ అవటంలేదు? అసలు ఆ బాక్సుల్లో ఏం ఉంటున్నాయి? కూరతో అన్నాన్ని కలిపి ఒక బాక్సు.. తింటే పెరుగుతో మరొకటి! మధ్యలో తినటానికంటూ మూడునాలుగు బిస్కెట్లు.. ఓ రెండు చాక్లెట్లు! మహా అయితే జామ్ పూసిన బ్రెడ్డు.. కొన్ని చిప్స్! ప్రైమరీ స్కూలు పిల్లలైనా.. హైస్కూలు పిల్లలైనా పెద్ద తేడా లేదు! సంపన్న కుటుంబాల పిల్లల బాక్సుల్లోనూ ఇదేతీరు! కాకపోతే.. వారి బాక్సుల్లో ఏ పిజ్జాలో బర్గర్లో! అదీ లేకుంటే స్కూలు ఆవరణలో కొని తినేందుకు కొంత డబ్బు! ఇవి నిజంగా విద్యార్థులకు సరిపోయే పోషకపదార్థాలేనా? ఏమైనా ప్రత్యేకంగా వండిపెట్టేందుకు అవకాశం లేదా? ఇదే ప్రశ్నను కొందరు తల్లిదండ్రులను నమస్తే తెలంగాణ అడిగితే.. మామూలు వంటకే టైమ్ సరిపోతున్నది.. ఇంకా ప్రత్యేకంగా ఏం వండు తాం? అంటూ బాధతో నిట్టూర్చారు! వాస్తవానికి ఈ ఆహార అలవాట్లే పిల్లలను అనారోగ్యాలకు గురిచేస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. మలబద్ధకం, పరీక్షల భయం, నిస్సత్తువకు లంచ్‌బాక్స్ తగినవిధంగా సిద్ధంకాకపోవటమే కారణమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు భారతీయం, బాధ్యత ఫౌండేషన్, సేవ్ ఆర్గనైజేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
schoolstudent1

ఎందుకిలా..?

20 ఏండ్లకిత్రం మీరు స్కూలుకు లంచ్ బాక్సులు తీసుకెళ్లిన విషయాలు గుర్తున్నాయా? మూడు బాక్సుల క్యారియర్! ఒకదాంట్లో అన్నం.. మరోదాంట్లో కూర.. మిగిలిందాంట్లో పెరుగన్నం! ఇంటర్వెల్‌లో పటపటలాడించటానికి జేబు లో ఉలవలు, బొబ్బర్లు, పల్లీలు, పల్లీపట్టీలు, బొంగుల ముద్దలు, పుట్నాల ముద్దలు, నువ్వుల లడ్డు, సున్నుండలు.. ఇలా ఏదో ఒక చిరుతిండి! స్కూలు బయట అమ్మే జామకాయ లో మామిడి ముక్కలో జీళ్లో కొనుక్కునేందుకు కొంత చిల్లర! లంచ్ బెల్లు మోగగానే బాక్సులన్నీ తెరిచి.. చక్కగా అన్నం కూర అప్పటికప్పుడు కలుపుకొని.. పెరుగన్నం తినిమరీ లేచిన సందర్భాలు! మరిప్పుడు బాక్సులు ఎలా ఉంటున్నాయి? బాక్సులో ఏంపెడితే తోటి పిల్లలు ఏమనుకుంటారోన్న సంశయం! గుడ్డుపెడితే తిన్న తర్వాత చేయి వాసన వస్తుంది.. అందుకే గుడ్డు మాయం! తిన్నంతే పెట్టాలనే సలహాతో లంచ్‌బాక్స్ సగానికి సగం తగ్గిపోతున్నది. పిల్లలకు కలుపుకోవడం రాదనుకుంటాం కాబట్టి బాక్సు కట్టేటప్పుడే అన్న, కూర కలిసిపోతున్నాయి. దాంతో రుచీపచీ లేకుండా తయారవుతున్నది. పండ్లు ముక్కలు కోసి పెడుతుండటంతో తినేసమయానికి మెత్తపడిపోతున్నాయి. అందుకే అవి అలానే తిరిగొస్తున్నాయి. మంచినీళ్లు తాగితే పదేపదే వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుందని పిల్లలు నీళ్లు తాగటం తగ్గించేశారు. తగిన తిండి, నీళ్లు శరీరానికి అందకపోవడంతో మలబద్ధకం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. దీనికి తోడు స్నాక్స్ పేరుతో చాక్లెట్లు, కేకులు వంటి మెత్తని పదార్థాలు పెడుతుండటంతో దంతాల సామర్థ్యం కూడా తగ్గిపోతున్నది. బఠానీలు, జామపండు లాంటివి తినాలన్నా కొరుకుడు పడని దుస్థితి! పైపెచ్చు చాలా స్కూళ్లు ఆటస్థలాలు లేనివికావటంతో శారీరక శ్రమకూడా ఉండటం లేదు. ఇవన్నీ కలగలిసి చిన్నారిపై దండయాత్ర చేస్తున్నాయి.. దవాఖానల చుట్టూ తిప్పుతున్నాయి.

ఇలా చేయాలి.. నేర్పాలి?

schoolstudent2
-అన్నం, కూర కలపొద్దు. వాళ్లనే కలుపుకొని తినమని చెప్పాలి. కలుపుకొని తినటం నేర్పాలి.
-జామకాయ, బత్తాయి, నారింజ, దానిమ్మ వంటి పండ్లు ముక్కలు చేయటం కాకుండా.. కాయ లేదా పండు రూపంలోనే ఇవ్వాలి.
-పండ్లు కట్ చేసి పెట్టడం కంటే.. గుజ్జుగా చేసి పెరుగు కలిపి ఇస్తే ఎంతో మేలు.
-బఠానీ, పల్లీలు, పుట్నాలు చిరుతిండ్లుగా ఉంచాలి. వాత వికృతమంటూ చేసేది దుష్ప్రచారమే. నిజానికి అవి చాలా మంచివి.
-పుట్నాలు, పల్లీలు వంటి వాటిని బెల్లంతో కలిపి తినుబండారాలు చేయొచ్చు.
-సజ్జలు, జొన్నలు, కొర్రలతో అనేకరకాల తినుబండారాలను పిల్లలకు ఇష్టమైన రీతిలో తయారుచేయొచ్చు.
-ఉదయం పూట ఎక్కువ తినే అలవాటు ఆరోగ్యానికి మంచిది.
-దోస, కీర, ముల్లంగి, క్యారెట్, కొబ్బరి.. తదితర పచ్చి కూరగాయలు తినడం అలవాటు చేయాలి.
-ఫ్రీజ్ వాటర్ ఆపేయాలి. వీలైతే గోరు వెచ్చని నీళ్లు ప్రతి రోజూ రెండు గ్లాసులు తాగించేందుకు యత్నించాలి.
-పెరుగును ఇష్టపడని పిల్లలకు గట్టి పెరుగులో కాస్తంత బెల్లం కలిపి ఇస్తే పుష్కలంగా ప్రోటీన్లు లభిస్తాయి.
-పిల్లలకు ప్రాణశక్తి అవసరం ఎంతో ఉంది. హిమోగ్లోబిన్ తగినంత స్థాయిలో ఉంటేనే చురుకుదనం కనిపిస్తుంది. ఎనర్జీ, గ్రాస్పింగ్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రోటీన్లు శరీరాన్ని నిర్మిస్తాయి. ఐరన్ అధికంగా ఉండే పుంటి కూర/పచ్చడి వంటివి తినిపించాలి.
-రాగి పల్లీ లడ్డు, సజ్జ అవిశ గింజల లడ్డు, వరిగ పల్లీ చెక్కలు, జొన్న కారప్పూస, రాగి జంతికలు, కొర్ర పాలక్ రిబ్బన్ పకోడీ, రాగి మిల్క్ షేక్, సజ్జ బాదం రోజ్ మిల్క్ షేక్, జొన్న చాట్, జొన్న ఎనర్జీ బార్, రాగి హల్వా, కొర్ర కుడుములు, రాగి క్యారెట్ కేక్, కొర్ర జీరా బిస్కట్లు, రాగి కోకోనట్ బిస్కట్లు వంటివి పిల్లలు ఇష్టపడుతారు.
schoolstudent3

ఎవరిని అడిగినా టైం లేదనే చెప్తున్నారు

పిల్లల బాక్సుల్లో ఏం పెడుతున్నారన్న అంశంపై నా దగ్గరికి వచ్చే తల్లిదండ్రులను ఆరాతీస్తే అందరూ చెప్పేది ఏది పెట్టినా ఖాళీగా రాదు. కాస్త మిగుల్చుకొని వస్తున్నారు. ఏదైనా చేసిపెట్టాలంటే టైం ఎక్కడిది? అనే సమాధానాలే! అందుకే పిల్లల్లో చురుకుదనం లోపిస్తున్నది. పరీక్షలంటే భయం కనిపిస్తున్నది. మలబద్ధకం తలెత్తుతున్నది. నిల్వ పదార్థాలకు స్వస్తి పలుకాలి. లేకుంటే పిల్లల్లో మానసిక పరిపక్వత రాదు. మా దగ్గరకొచ్చే తల్లిదండ్రులకు తృణధాన్యాలతో అనేకరకాలుగా పిల్లలకు ఇష్టమైన రూపంలో చేసిపెట్టాలని చెప్తున్నాం. ఉత్తరాది రాష్ర్టాల్లో గోధుమ రొట్టెలు బాగా తింటారు. ఇక్కడ మైదా తో చేసినవాటిని పెడతాం. ప్రొటీన్లుండే పదార్థాలను తినిపించటం లేదు. కానీ ప్రోటీన్ పౌడర్లను వాడుతున్నారు.
- డాక్టర్ రమేశ్‌సాగర్, వివేకానంద మెడికల్ సెంటర్, హయత్‌నగర్

ఇన్‌స్టంట్ ఫుడ్స్ మానేయాలి

నిల్వ ఉండే పదార్థాలు, ఇన్‌స్టంట్ ఫుడ్స్ మానేయాలి. వాటిలో రుచికోసం అనేకం వాడుతున్నారు. వాటితో ప్రమాదమే. మేం సంప్రదాయ పద్ధతిలో వండే పదార్థాలనే పిల్లలకు పెట్టాలని ప్రోత్సహిస్తున్నాం. పిల్లలు వీటిని తినరు అనేది అబద్ధం. వారికి ఇష్టమైన రీతిలోనే చేసిస్తే అంతే ఇష్టంగా తింటారు. తల్లిదండ్రులు వాట్సాప్.. సోషల్ మీడియా చూసే టైంలో 10% కేటాయిస్తే చాలు. వండేటప్పుడు కూరగాయలను పసుపు, ఉప్పు కలిపిన నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాతే వండాలి. కోర్ల పున్నమి రోజు కుడుములు చేసేవారు. ఇప్పటితరానికి ఎవరైనా రుచి చూపించారా? అందుకే మార్పు మనతోనే మొదలుకావాలి.
- చంద్రశేఖర్, బాధ్యత ఫౌండేషన్ ప్రతినిధి

ఇష్టపడేవాటిని పెట్టాలి

పిల్లలకు స్వీట్లు అంటే ఇష్టం. పైగా కొత్తదనాన్ని కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా అదే చేయాలి. బెల్లంతో ఎన్నోరకాల పదార్థాలు చేయొచ్చు. తృణధాన్యాలను బెల్లంతో కలిపి రకరకాలుగా చేసిపెట్టాలి. చాక్లెట్లు, బిస్కట్లు మానేయమంటే మానరు. కానీ వాటినే తృణధాన్యాలతో చేసి ఇవ్వొచ్చు. ఆకు కూరలను తినని పిల్లలకు అవే ఆకుకూరలను పేస్ట్ చేసి గ్రీన్‌రైస్ వండితే చక్కగా తింటారు. ఇలా పిల్లలకు అనుగుణంగా వంటకాల్లో మార్పులు చేసుకోవాలి. బయట దొరికేవాటికంటే కాస్త కష్టపడితే వాటిని ఇంట్లోనే చేయొచ్చు.
- ఎం సురేంద్రనాథ్‌బెనర్జీ, సేవ్ ఆర్గనైజేషన్

6059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles