కాంక్రీట్‌ జంగల్‌లో..నందనవనాలు

Wed,January 15, 2020 02:12 AM

-నాడు బీడు భూములు.. నేడు ఉద్యానవనాలు
-రాష్ట్రంలో రూ.500 కోట్లతో 94 అర్బన్‌పార్కులు
-హెచ్‌ఎండీఏలో 16 చోట్ల భాగ్యనగర నందనవనాలు
-మరో 90 లంగ్‌స్పేస్‌ల ఏర్పాటుకూ ప్రణాళిక

ప్రతి వనము.. ప్రతి నదము.. నిరంతరం ప్రజలనోట వినిపించే పదాలు కావాలన్నది పెద్దల మాట. ఈ మాటను దృష్టిలో పెట్టుకొనే కావచ్చు.. కులీకుతుబ్‌షా హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించేటప్పుడు అడుగడుగునా వనాలను.. తటాకాలను ఏర్పాటుచేశాడు. వాటిచుట్టూనే నగరాన్ని అభివృద్ధి అయ్యేలా చూశాడు. నిజాం నవాబులు వాటిని మరింత అభివృద్ధిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఆంధ్రరాష్ట్రంవారు తెలంగాణను బలవంతంగా తమలో కలుపుకొన్న తర్వాత.. ఈ వనాలు.. తటాకాలు.. ఒకదాని తర్వాత ఒకటిగా మాయమైపోయాయి. బాగ్‌ (తోట) అన్నది చిరునామాకోసం వాడే పదంగామారిపోయింది. తోటల స్థానంలో కాంక్రీట్‌ భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చక్కగా ఉన్న వాతావరణం కలుషితమైపోయింది. తెలంగాణ ఆవిర్భావం అనూహ్యమైన మార్పునకు నాంది పలికింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికతతో పట్టణాల్లో వనాలు మళ్లీ పురుడుపోసుకొన్నాయి. వాయుకాలుష్యం తగ్గిపోయింది. వారాంతంలో ఆహ్లాదానికి వేదికలు తయారయ్యాయి. వన్యప్రాణులు ఆనందంగా గెంతులువేస్తున్నాయి. నగరాలు నందనవనాలుగా మారాయి.
Tourism0
ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: హరిత తెలంగాణ సాకారమవుతున్నది. ఒకప్పుడు బాగ్‌లకు (ఉద్యానవనాలకు) నిలయమైన భాగ్యనగరం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటున్నది. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు హరితహారం.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అర్బన్‌పార్కుల సృష్టితో అద్భుత ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో చకచకా చేపట్టిన కార్యక్రమాలు పర్యావరణంలో అద్భుత మార్పులు తెచ్చాయి. ఫలితంగా హైదరాబాద్‌ శివార్లలో బీడు భూములు నందనవనాలుగా మారాయి.

పట్టణాల సమీపంలోని ఫారెస్ట్‌బ్లాక్‌లు బృందావనాలను తలపిస్తున్నాయి. నిత్యం రణగొణ ధ్వనులు, వాహనాల భీకర శబ్దాలతో విసిగివేసారుతున్న నగరవాసులకు చల్లనిగాలి ఉపశమనం కలిగిస్తున్నది. పచ్చని పార్కులు సేదదీరే అవకాశం కల్పిస్తున్నాయి. నగరజీవికి ఆనందం, ఆహ్లాదం పంచుతున్నాయి. నగరసిగలో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. నెమలి ఆటలు, పక్షుల కువకువలతో, జింకల పరుగులతో అర్బన్‌పార్కులు సంతోషాన్నిస్తున్నాయి. సైక్లింగ్‌ ట్రాక్‌లు, వాకింగ్‌పాత్‌లు, యోగా కేంద్రాలు ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. చెత్తకుప్పలతో బీళ్లుగా ఉన్న ఫారెస్ట్‌ బ్లాక్‌లు ఔషధ మొక్కల సమాహారంతో ఆరోగ్యవనాలుగా రూపుదిద్దుకున్నాయి. అరణ్యాలను తలపించే వాతావరణంతో ఆక్సిజన్‌పార్కులుగా మారాయి. పంచవటి, ప్రశాంతవనం, నందనవనం, కార్తీకవనం, సంజీవని వనం ఇలా హైదరాబాద్‌ చుట్టూ అందమైన అర్బన్‌పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తున్నాయి.
Tourism1

పక్కా ప్రణాళికతో బాగ్‌లు

ఒకప్పుడు బషీర్‌బాగ్‌, రాంబాగ్‌, సీతారాంబాగ్‌, కిషన్‌బాగ్‌, కుందన్‌బాగ్‌, బాగ్‌లింగంపల్లి, పూల్‌బాగ్‌.. ఇలా ఎటుచూసినా రాజధాని హైదరాబాద్‌ పచ్చని ఉద్యానవనాలతో అలరారేది. ప్రకృతి రమణీయతతో బెస్ట్‌ ైక్లెమెట్‌ సిటీగా పేరుగాంచింది. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల బాగ్‌లు కనుమరుగయ్యాయి. అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఎత్తయిన భవనాలు, మాల్స్‌ వెలిశాయి. పచ్చదనం కరువైంది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం అక్కడక్కడ మనుగడలో ఉన్న బాగ్‌లను రక్షించడంతోపాటు శివార్లలో ఉద్యానవనాలను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించింది. నగరవాసులకు మంచి వాతావరణం కల్పించి మెరుగైన జీవనాన్ని అందించాలనే సంకల్పంతో అర్బన్‌పార్కులు/ లంగ్‌స్పేస్‌లకు శ్రీకారం చుట్టింది. యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టింది. హైదరాబాద్‌ నగరం చుట్టూ పట్టణాల సమీపంలోని వ్యర్థంగా ఉన్న ఫారెస్ట్‌ బ్లాక్‌లలో అద్భుతవనాలను అభివృద్ధిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాలకు చేరువలో ఉద్యానవనాలను తలపించేలా పార్కులను ఏర్పాటుచేస్తున్నది.
Tourism2

మరో 90 లంగ్‌స్పేస్‌లకు ప్రణాళిక

రాష్ట్రవ్యాప్తంగా 94 అర్బన్‌పార్కులను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. కొత్తగా మరో 90 పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక వేస్తున్నది. దీనిపై మున్సిపల్‌, ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రత్యేక కసరత్తు జరుపుతున్నారు. అటవీశాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పరిశ్రమలశాఖ, పురపాలకశాఖ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంయుక్త సమన్వయ, సహకారంతో లంగ్‌స్పేస్‌లను అభివృద్ధి చేస్తున్నారు. పార్కుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ చుట్టూ అర్బన్‌పార్కులను సృజనాత్మకంగా, సుందరంగా అభివృద్ధిచేశారని అధికారులను కేటీఆర్‌ అభినందించారు. ఇక హైదరాబాద్‌ చుట్టూ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఫారెస్ట్‌ బ్లాక్‌లలో ప్రజలకు ఉపయోగపడేలా ఉద్యానవనాలను సృష్టించాలని ఆదేశించారు.

ఆదిలాబాద్‌లో హరితవనం

Tourism4
ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్‌ పట్టణ సమీపంలో రెండేం డ్ల కిందట అభివృద్ధిచేసిన హరితవనం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. అటవీశాఖ అధికారులు రూ.3 కోట్లతో వేయి ఎకరాలను ఆదిలాబాద్‌ హరితవనంగా అభివృద్ధిచేయడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి రెండు ప్రవేశద్వారాలను ఆకట్టుకునేలా నిర్మించా రు. సందర్శకులు సేదతీరేందుకు నాలుగుచోట్ల పగోడాలు, లాన్లు.. అటవీఅందాలు వీక్షించేలా వాచ్‌టవర్‌ ఏర్పాటుచేశారు. అడవిలో అంతర్గత రహదారులపాటు ఐదు కిలోమీటర్లు మేర వాకింగ్‌, సైకిల్‌ట్రాక్‌, యోగా షెడ్లను నిర్మించారు. చిన్నపిల్లల కోసం ఆట వస్తువులను సమకూర్చారు. అటవీప్రాంతానికి ఆనుకుని మావల చెరువు ఉండటంతో చిన్నారులకు బోటింగ్‌తోపాటు పెద్దవారికి స్టీమర్‌ బోటింగ్‌ వసతి కల్పించారు. అడవిపై విద్యార్థులతోపాటు పెద్దలకు అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. రాశివనం, నక్షత్ర వనాల్లో అటవీజాతి మొక్కలను నాటారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వర్మికాంపోస్ట్‌ పిట్లను నెలకొల్పారు. సఫారీలో జంతువులను చూసే అవకాశం ఉన్నది. స్కై సైక్లింగ్‌, జిప్పింగ్‌, రోప్‌కోర్సు వంటి సహాయక్రీడలు కూడా సైతం ఉండటంతో సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.
Tourism3

రూ.500 కోట్ల అంచనాతో 94 పార్కులు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 94 పార్కుల ఏర్పాటుకు రూ.500 కోట్ల అంచనా వ్యయంతో అద్భుత ప్రణాళిక రూపొందించారు. అందులో 31 పార్కులు పూర్తికాగా, 38 పార్కుల పనులు చురుకుగా సాగుతున్నాయి. మరో 25 పార్కులు ప్రారంభ దశ లో ఉన్నాయి. ఇందుకోసం హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు లక్షన్నర ఎకరాల అటవీభూమిని గుర్తించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోనే 60 అర్బన్‌పార్కులు ఏర్పాటుచేస్తున్నారు. అందులో ఇప్పటికే 30 పార్కులు పూర్తయ్యాయి. వాటిలో 18 పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికల కోడ్‌ పూర్తయిన వెంటనే మిగతా 12 పార్కుల కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

ఔటర్‌ చుట్టూ ఆక్సిజన్‌ పార్కులు

రోజురోజుకు పెరుగుతున్న కాలుష్య తీవ్రత, పనిఒత్తిడి, యాంత్రిక జీవనంతో విసిగివేసారుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ల ఏర్పాటుకు సంకల్పించింది. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చే చర్యల్లో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 16 చోట్ల భాగ్యనగర నందనవనం తరహాలో అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ల సృష్టికి చర్యలు చేపట్టింది. అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు ఇంటెన్వివ్‌ మెథడ్‌ పద్ధతిలో లక్షల మొక్కలను నాటుతున్నారు.

రంగారెడ్డి, యాదాద్రి, మెదక్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5,928.38 హెక్టార్లలో రూ.96.64 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు.
Tourism5
Tourism6

1654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles