హరితహారం లక్ష్యం 70 శాతం పూర్తి


Mon,September 10, 2018 01:38 AM

Haritha Haram turns a big success

-నాలుగో విడుత లక్ష్యం 40 కోట్లు
-ఇప్పటివరకు నాటిన మొక్కలు 27 కోట్లు
-నెలాఖరులోగా లక్ష్యం పూర్తి
-ఏడు జిల్లాల్లో వందశాతానికిపైగా పూర్తి
-నాటిన మొక్కలకు ఎప్పటికప్పుడు జియోట్యాగింగ్
-హరితహారంపై మూడురోజుల్లో థర్డ్‌పార్టీ సర్వే మొదలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణకు హరితహారం నాలుగో విడుత కార్యక్రమం యుద్ధప్రాతిపదికన పూర్తవుతున్నది. జూలైలో మొదలైన హరితహారంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70 శాతం మొక్కలు నాటారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో వందశాతం, మరో 15 జిల్లాల్లో 75 శాతం మొక్కలు నాటడం పూర్తయింది. మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, మెదక్ జిల్లాల్లో నిర్దేశించిన లక్ష్యానికి మించి (వందశాతానికి పైగా) మొక్కలు నాటారు. జీహెచ్‌ఎంసీ, కామారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, నిర్మల్, ఆదిలాబాద్‌ల్లో 75 శాతం వరకు ప్లాంటేషన్ పూర్తయింది. రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు సుమారు 27 కోట్ల మొక్కలను నాటారు. నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ పనులను అధికారులు వెంటవెంటనే పూర్తిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరులోగా హరితహారం కార్యక్రమాన్ని పూర్తిచేసి వచ్చే ఏడాదికి ప్రారంభమయ్యే వందకోట్ల మొక్కల లక్ష్యంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ నెలాఖరులోపు 40 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

మొక్కలపై థర్డ్‌పార్టీ లెక్కలు

నాటిన మొక్కలపై పక్కా లెక్కల కోసం ఉన్నతాధికారులు థర్డ్‌పార్టీ కన్సల్టెంట్లను రంగంలోకి దించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశం మేరకు థర్డ్ పార్టీకి సర్వే బాధ్యతలు అప్పగించారు. రికార్డుల్లో పేర్కొన్న దానికి క్షేత్రస్థాయిలో నాటిన మొక్కల లెక్కలు సరిగ్గా ఉన్నాయా? వాటిలో ఎన్నింటిని సంరక్షించగలుగుతున్నారు? హరితహారంపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. వంటి అంశాలను థర్డ్‌పార్టీ సేకరిస్తుందని అధికారులు తెలిపారు. మరో మూడురోజుల్లో థర్డ్ పార్టీ సర్వే మొదలవనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ర్యాండమ్ సర్వే జరుగుతుందని మరో మూడునెలల్లో నివేదిక అందుతుందని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా తెలిపారు.

589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS