కందుల దిగుమతి నిలిపివేయండి


Tue,June 19, 2018 02:36 AM

Harish Rao speech after inaugurating newly constructed market

-రాష్ట్రంలోని వివరాలు తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలి
-మార్కెటింగ్‌శాఖ అధికారుల సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వివిధ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన కందులను మార్కెట్‌లోకి పూర్తిగా విడుదల చేశాకే కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు కోరారు. ఇదే విషయంపై కేంద్రానికి లేఖ రాయాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లింపు, గోదాంల నిర్మాణం వంటి అంశాలపై బీఆర్కే భవన్‌లోని మార్కెటింగ్‌శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటలకు మద్దతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తున్నదన్నారు. రూ.5,618 కోట్ల విలువైన వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మొత్తం చెల్లింపులు చేసినట్టు చెప్పారు. కంది రైతులకు చెల్లించే రూ.1,427 కోట్ల మొత్తానికి బకాయిపడిన రూ.7.33 కోట్లు, శనగ రైతులకు బకాయి మొత్తం రూ.30 కోట్లు రెండ్రోజుల్లో చెల్లించాలని నాఫెడ్, మార్క్‌ఫెడ్ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అలాగే మొక్కజొన్న రూ.629 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.611 కోట్లు చెల్లింపులు చేశామని, మిగిలిన రూ.18 కోట్లు రెండు, మూడు రోజుల్లో చెల్లించాలన్నారు. కందులు, శనగలు, మినుములు, జొన్నలకు రావాల్సిన బకాయిలను త్వరగా విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావు మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కందులను కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదని, రాష్ట్రాల్లో కందులను మార్కెట్‌లోకి పూర్తిగా విడుదల చేశాకే ఇతర దేశాల నుంచి కందులు దిగుమతి చేసుకోవడం ఉత్తమమన్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

జూలై 15కల్లా ఎస్సారెస్పీ పనులు పూర్తిచేయాలి

ఇంజినీర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎస్సారెస్పీ స్టేజ్-1 పనులు జూలై రెండోవారంకల్లా పూర్తిచేయాలని, క్లిష్టమైన పనుల పూర్తికి 30 రోజుల ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజినీర్లను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఎస్సారెస్పీ స్టేజ్-1, 2, ఎస్సారెస్పీ పునర్జీవన పథకంపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితం అందుకునేది ఎస్సారెస్పీయేనన్నారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లిష్టమైన పనులు, స్ట్రక్చర్లపై దృష్టిపెట్టి.. వేగంగా చేయాలన్నారు. పూర్తి ఆయకట్టుకు, ఆయకట్టులోని చివరి పొలాలకు నీరు అందించేందుకు ఇంజినీర్లు కృషిచేయాలని చెప్పారు. కాకతీయకాల్వ పనుల నాణ్యతను ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎస్సారెస్పీలో అవసరమైన సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ ద్వారా తీసుకోవాలన్నారు. తొలిదశలో మూడు పంపుహౌస్‌లలో మూడేసి పంపులను పూర్తిస్థాయిలో సెప్టెంబర్ 30కల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. పంపునకు సంబంధించిన యంత్ర పరికరాలన్నీ చైనా నుంచి వస్తున్నాయని ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. వరదకాల్వల్లో నీరు వచ్చినా జూలై 15కల్లా క్రాస్ రెగ్యులేటరీ వర్స్ మొత్తం పూర్తిచేయాలన్నారు. రైతు సమన్వయసమితి, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమావేశాలు నిర్వహించుకుని, రైతులకు ప్రయోజనాలు వివరించాలని చెప్పారు. డీఈలవారీగా దీనిపై ప్రణాళిక పంపాలని సీఈ శంకర్‌ను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్సీ మురళీధర్‌రావు, ఈఎన్సీ (కరీంనగర్) అనిల్‌కుమార్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

3.50 లక్షల ఎకరాలకు నీళ్లు

ఎస్సారెస్సీ రెండోదశ కింద 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా పనులు పూర్తిచేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం నుంచి నీరు వచ్చినా.. నేరుగా గోదావరి నుంచి నీరు వచ్చినా 3.50 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా కాల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గత ఏడాదితో పొలిస్తే 1.10లక్షల ఎకరాలకు అదనంగా నీరు ఇస్తున్నామని వివరించారు. మరో 40 వేల ఎకరాలకు నీరిచ్చేలా మూడు, నాలుగు నెలల్లో కాల్వల నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్నారు. ఎస్సారెస్పీ రెండోదశ కింద 202 చెరువులు నింపి, వాటి కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పారు.

1659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles