ద్రోహాల బాబూ.. సాక్ష్యాలివిగో


Fri,November 9, 2018 02:26 AM

Harish Rao Open Letter to AP CM Chandrababu Naidu

-రాష్ట్ర విభజన మానని గాయమా..? అసెంబ్లీలో గవర్నర్‌తోనూ చెప్పిస్తారా?
-ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు 30 లేఖలు రాసింది నిజంకాదా?
-మాకివ్వాల్సిన కరంట్ లేదంటూనే తెలంగాణ బిడ్డింగ్‌లో ఎలా పాల్గొన్నారు?
-అనుమతుల్లేని పోతిరెడ్డిపాడుకోసం శ్రీశైలంలో మా వాటా వదులుకోమంటారా?
-తెలంగాణపై చంద్రబాబు కుట్రలను ఆధారాలతో బయటపెట్టిన మంత్రి హరీశ్‌రావు
-19 అంశాలపై ఏపీ సీఎంకు బహిరంగలేఖ
-వీటికి సమాధానం చెప్పి తెలంగాణలో ఓట్లు అడగాలని డిమాండ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి. ఇక్కడి ప్రజలపై నిలువెల్లా ద్వేషం పెంచుకున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు అందాల్సిన ప్రయోజనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకుండా 30 లేఖలు రాసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారు అని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే నైతికహక్కు లేదని, ఆ పార్టీ పోటీపై ఇక్కడి ప్రజలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలంగాణ పదమే ఉచ్చరించొద్దంటూ నిషేధించారని, మలివిడుత ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్ర చేశారని, రాష్ట్రం రాకుండా చివరిక్షణం వరకూ ప్రయత్నించారని తెలిపారు. గురువారం తెలంగాణభవన్‌లో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కొత్త్త ప్రభాకర్‌రెడ్డి, మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యదర్శి గట్టు రామచంద్రరావుతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణపై ఏ విధంగా విషం కక్కింది.. అభివృద్ధిని అడ్డుకొనేందుకు ఏ విధంగా కుట్రలు పన్నిందీ ఆధారాలతో సహా వివరించారు. తెలంగాణపై కుట్రలకు సంబంధించి 19 ప్రశ్నలకు (అంశాలకు) సమాధానం చెప్పాలంటూ బహిరంగలేఖను విడుదల చేశారు. మేకవన్నె పులుల బాగోతాన్ని, ద్రోహ చరిత్రను ప్రజల ముందు పెట్టడాన్ని ఉద్యమ కార్యకర్తగా, మంత్రిగా బాధ్యతగా భావించి ఈ లేఖ రాస్తున్నానని అన్నారు. ఈ అంశాలపై చంద్రబాబు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని చూశారని, విభజనాంశాలు అమలుకాకుండా అడ్డుపడ్డారని హరీశ్‌రావు చెప్పారు. చంద్రబాబుది తెలంగాణను నాశనం చేయాలన్న దుర్బుద్ధి అని, కృష్ణా, గోదావరి జలాలు సముద్రంలో కలిసినా ఫర్వాలేదు కానీ తెలంగాణకు మాత్రం దక్కొద్దన్న నీచమైన బుద్ధి అని అన్నారు. తెలంగాణ ప్రా జెక్టులను ఆపాలని కేంద్రానికి ఫిర్యాదులు చేసిన ఆయన ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లడుగుతారని నిలదీశారు. కూటమిని అడ్డం పెట్టుకొని పెత్తనం చేయాలనుకుంటున్నాడని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయత్నంగా చిత్రీకరించే పన్నాగం పన్నుతున్నాడని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం రాజకీయపార్టీల ఇష్టమని, అయితే ఎలాగైనా నాలుగైదు సీట్లు తెచ్చుకొని తెలంగాణను నాశనం చే యాలనే కుట్రతో ఉన్న చంద్రబాబుతో కాంగ్రెస్ కూట మి కట్టడం అనైతికమన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే దొంగే తాళంచెవి ఇవ్వమని అడిగినట్టు ఉన్నదని, తెలంగాణలో ఆయన పోటీచేయడం ఇక్కడి ప్రజలకు ఇష్టం లేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర సీఎం గా ఉన్నప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోని చంద్రబాబు.. అధికారం పోగానే ఈ ప్రాజెక్టును ఎందుకు కట్టడంలేదని అప్పటి సీఎం వైఎస్సార్‌ను నిలదీశారని, ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఇదే ప్రాజెక్టును అక్రమమంటూ కేంద్రానికి ఫిర్యాదులు చేశారని.. చంద్రబాబును చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నాయకులు ఏమని ఓట్లడుగుతారు?

ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఏమని ఓట్లడుగుతారు. మీ భూములకు సాగునీళ్లు ఇవ్వాలని కేసీఆర్ తుమ్మిళ్ల ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు కాబట్టి కూటమికి ఓట్లు వేయండంటూ ఆలంపూర్ వెళ్లి అడుగుతారా?.. భక్తరామదాస్ ప్రాజెక్టును రికార్డుస్థాయిలో నిర్మించి పా లేరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు నీరిచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు కాకుండా.. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ సీఎం ఫిర్యాదుచేశారు కాబట్టి కూటమికి ఓట్లు వేయాలని ఖమ్మం జిల్లాకు వెళ్లి అడుగుతారా? శ్రీశైలం నుంచి తెలంగాణ వాటాను నిలిపివేసి కల్వకుర్తి ప్రాజెక్టు లిఫ్ట్‌ను బంద్ పెట్టమని చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదుచేశాడు కాబట్టి కూటమి ఓట్లు వేయండంటూ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, అచ్చంపేట ప్రజల వద్దకు వెళ్లి అడుగుతారా? అని హరీశ్‌రావు నిలదీశారు. తుంగభద్ర నుంచి పెన్నా అహోబిళానికి 40 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు ఏపీ సీఎం కుట్ర చేస్తున్నారన్నారు. ఖాళీగా ఉన్న అసెం బ్లీ భవనాలు, సచివాలయంలో గదులు తెలంగాణకు ఇవ్వకుండా.. చంద్రబాబు నిజాం కాలంనాటి ఆస్తులు పంచాలనడం సిగ్గుచేటన్నారు.

హరీశ్‌రావు బహిరంగలేఖలో పేర్కొన్న అంశాలు

1. తెలంగాణకు చెందిన పాలమూరు-రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం, సీతారామ, భక్త రామదాసు, తుమ్మిళ్ల తదితర ప్రాజెక్టులు అక్రమమని, వాటి నిర్మాణాలను అడ్డుకోవాలంటూ చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్ర జలసంఘానికి లేఖలు పోతూనే ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు 1,330 టీఎంసీల వాటా ఉందంటూ ఉమ్మడి రాష్ర్టంలో నాటిప్రభుత్వమే శ్రీకృష్ణ కమిటీకి నివేదించిన ప్రకారమే ప్రాజెక్టులు చేపడుతుంటే అడ్డం పడుతున్నది వాస్తవం కాదా..?

2. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తామంటూ టీడీపీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీఇచ్చింది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టలేకపోయిదని, తాము కడతామంటూ మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎన్నికల సభలో చంద్రబాబు సమక్షంలోనే ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ హామీఇచ్చారు. కానీ, ఎన్నికలు ముగిసి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమమంటూ కొత్తవాదన మొదలుపెట్టారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు అక్రమమని, వీటి నిర్మాణాలను అడ్డుకోవాలని 2015 జూలై 9, 2016 ఫిబ్రవరి 8వ తేదీల్లో ఏపీ సాగునీటిశాఖ ముఖ్యకార్యదర్శి లేఖలు రాశారు. 2016 ఏప్రిల్ 24న కేంద్రమంత్రి ఉమాభారతికి చంద్రబాబు స్వయంగా లేఖరాశారు. 2015 జూన్ 11న అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజినీర్ ద్వారా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి, 2016 ఆగస్టు 11న ఏపీ సాగునీటిశాఖ ముఖ్యకార్యదర్శి కేంద్ర జలసంఘం చైర్మన్‌కు లేఖరాశారు.

3. తెలంగాణలోని 70 శాతం భూభాగానికి సాగునీరు, మంచినీరు అందించే బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అక్రమమంటూ ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి 2017 మార్చి 19న కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శికి, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి లేఖలు రాశారు.

4. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కరువు మండలాల్లో 60 వేల ఎకరాల్లో సాగునీరు అందించే భక్త రామదాసు ప్రాజెక్టు అక్రమమని చంద్రబాబు ఆరోపించారు. దీనిని నిలిపివేయాలంటూ 2017 జూలై 1న ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి లేఖ రాసింది.

5. రాజోలిబండ పథకం చివరి భూములకు నీరందించడానికి, తుంగభద్ర జలాల్లో తెలంగాణ వాటా 15.90 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతో కేసీ కెనాల్ ప్రయోజనాలు దెబ్బతింటాయని, ప్రాజక్టు పనులను ఆపాలంటూ ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి 2017 ఏప్రిల్ 7న కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శికి లేఖ రాశారు.

6. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి గతంలో కేటాయించిన 25 టీఎంసీలు సరిపోవని భావించిన తెలంగాణ ప్రభుత్వం 40 టీఎంసీలు కేటాయించింది. ఇది అక్రమమని 2017 నవంబర్ 7న ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి సీడబ్ల్యూసీ చైర్మన్, కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శులకు లేఖలు రాశారు.

7. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు లభించిన మరుక్షణం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువనున్న రాష్ట్రాలకు కృష్ణా నీళ్లు 80 టీఎంసీలు ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. దీని ప్రకారం తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలు రావాలి. కర్ణాటక, మహారాష్ట్రలు వారికి చేసిన కేటాయింపులను వాడుకుంటున్నాయి. కానీ, తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీలపై అభ్యంతరం చెపుతూ ఏపీ ప్రభుత్వం 2017 జనవరి 31, 2017 ఫిబ్రవరి 8న కేంద్రానికి లేఖలు రాసింది.

8. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటిలభ్యత తగ్గిపోతున్నదనే కారణంతో కల్వకుర్తి ద్వారా శ్రీశైలం నుంచి తెలంగాణ వాటా నీటిని వాడుకోవద్దని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నది. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీరందుతుందని, ఈ నేపథ్యంలో తెలంగాణ నీటిని వాడుకోకుండా చూడాలని కేఆర్‌ఎంబీకి గతనెల 9న ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఇది శ్రీశైలం రిజర్వాయర్‌లో తెలంగాణకు భాగస్వామ్యమే లేకుండా చేయాలన్న ఎత్తుగడ కాదా?

9. తెలంగాణ ప్రభుత్వం తనకున్న నీటివాటా ప్రకారమే నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని గగ్గోలు పెడుతున్న ఏపీ అక్కడ మాత్రం యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె పథకం, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, పులికనుమ ఎత్తిపోతల పథకం, సిద్దాపురం ఎత్తిపోతల పథకం, శివభాష్యం ఎత్తిపోతల పథకం, మున్నేరు పథకం, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ జలాశయానికి 40 టీఎంసీల తుంగభద్ర నీటిని తరలించే ఎత్తిపోతల పథకం, గోదావరి పెన్నా లింక్ పథకం నిర్మిస్తున్నారు. వీటన్నింటికి ఎవరి అనుమతులు పొంది చంద్రబాబు ప్రభుత్వం నిర్మిస్తున్నది? కృష్ణా, గోదావరి బోర్డులతోపాటు, తెలంగాణ ప్రభుత్వానికి వీటి డీపీఆర్ కూడా పంపలేదు.

10. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే అడ్డుకుంటుందనే దుర్బుద్ధితో నరేంద్రమోదీపై వత్తిడి తెచ్చి ప్రత్యేక ఆర్డినెన్స్ ఇప్పించి, భద్రాచలం డివిజన్‌లోని 7 మండలాలను లాక్కోవడం కుటిలత్వానికి నిదర్శనం కాదా? ఇది తెలంగాణకు తలపెట్టిన తొలిద్రోహం కాదా?

11. ఏడు మండలాలతోపాటు తెలంగాణ భూభాగంలోని 460 మెగావాట్ల లోయర్ సీలేరు హైడల్‌పవర్‌ప్లాంటును ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా గుంజుకున్నది. ఏడాదిపాటు 60 శాతం పీఎల్‌ఎఫ్‌తో విద్యుదుత్పత్తిచేసే సీలేరు ప్లాంటు తెలంగాణకు కాకుండాపోయింది. ఈ ప్లాంటు నుంచి రాష్ట్రవాటాగా రావాల్సిన కరంటును ఇవ్వడం లేదు. దీంతో తెలంగాణ ఏడాదికి రూ.500 కోట్లు నష్టపోవాల్సి వస్తున్నది. ఇది తెలంగాణకు మీరుచేసిన శాశ్వత నష్టం కాదా?

12. తెలంగాణలో చిమ్మచీకట్లు అలుముకోవాలని, ప్రజలు కరంటు కోతలతో అల్లాడాలని ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజు నుంచీ చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారు. విభజన బిల్లు చట్టం ప్రకారం తెలంగాణకు ఏపీలోని ప్లాంట్ల నుంచి రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారు. దీంతో రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది తీవ్ర కరెంటు కోతలు అనుభవించింది. పంటలు ఎండిపోయి రైతులు గుండెలవిసేలా విలపించారు. ఈ గుండెకోతకు మీ కసాయితనం కారణం కాదా?

13. రెండు రాష్ట్రాల్లో 2014 జూన్ నాటికున్న విద్యుత్ ప్లాంట్ల నుంచి, ఆ నాటికి నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే కరంటులో తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్తును పంపిణీ చేయాలని విభజన బిల్లులో స్పష్టంగా చెప్పారు. ఏపీ జెన్‌కో, కృష్ణపట్నం, హిందూజా, హైడల్ ప్లాంట్ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన 2,465 మెగావాట్ల విద్యుత్ ఇవ్వలేదు. తెలంగాణ డిస్కమ్‌లతో ఏపీలోని విద్యుత్ ప్లాంట్లకున్న పీపీఏలను ఏకపక్షంగా రద్దుచేశారు. తెలంగాణకు ఏపీ ప్లాంట్ల నుంచి కరంటు ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు.

14. తెలంగాణకు ఇవ్వాల్సిన కరంటు ఏపీ ఎగ్గొట్టడం ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పెట్టడమేకాకుండా రూ.4,557 కోట్ల మేర నష్టంచేసింది. ఏపీ నుంచి కరంటు రాకపోవడం వల్ల తెలంగాణ తన అవసరాల కోసం బహిరంగమార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వచ్చింది. చట్టప్రకారం తెలంగాణకు ఏపీ కరంటు ఇస్తే.. థర్మల్ పవర్‌కు యూనిట్‌కు రూ.4, హైడల్ పవర్‌కు రూ.1.03 చెల్లిస్తే సరిపోయేది. కానీ బహిరంగమార్కెట్‌లో యూనిట్ కు రూ.5.54 వరకు చెల్లించాల్సి వచ్చింది. కొత్త రాష్ట్రంగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న తెలంగాణ గుండెల్లో ఇది మీరు దింపిన గునపం కాదా?

15. విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటా ఇవ్వలేదు కానీ, తన అవసరాల కరంట్ కోసం తెలంగాణ టెండర్లు పిలిస్తే, అం దులో ఏపీ కూడా పాల్గొన్నది. తెలంగాణకు ఒక్కో యూనిట్ కు 5.35 చొప్పున చెల్లిస్తే, కరెంటు సరఫరా చేస్తామని టెండర్ కోట్ చేసింది. చట్టం ప్రకారం రూ.4 యూనిట్ ఇవ్వమంటే, మా దగ్గర కరం టు లేదన్న ఏపీ రూ.5.35 ఇస్తే మాత్రం ఇస్తామన్నది.

16. విభజన తర్వాత ఏ రాష్ర్టానికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ర్టానికి వెళ్లాలి. ఆంధ్ర లో పనిచేస్తున్న 350 మంది తన ఉద్యోగులను తెలంగాణ వెనుకకు పిలిపించుకున్నది. కానీ, తెలంగాణలోని 1,153 మంది ఆంధ్ర ఉద్యోగుల ను మాత్రం ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకోలేదు. స్వరాష్ట్రానికి పోవడానికి ఉద్యోగులు లిఖితపూర్వకంగా చెప్పినప్పటికీ తెలంగాణలోనే ఉండమన్నది. దీంతో ఏపీ ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ సం స్థలు నెలకు రూ.15 కోట్లకుపైగా జీతాలు చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటివరకు వెయ్యికోట్లు చెల్లిం చాయి. స్థానికులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయి. పదోన్నతుల్లోనూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నది.

17. ఏపీ ప్రభుత్వ నిర్వహణ కోసం పదేండ్ల వరకు హైదరాబాద్‌లోని భవనాలు వాడుకోవచ్చని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ, ఏపీ సర్కార్ తన పాలనాయంత్రంగాన్నంతా అమరావతికి తరలించడంతో హైదరాబాద్‌లో కేటాయించిన భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. వాటిని తిరిగి తెలంగాణకు అప్పగించడానికి ఏపీ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. అమరావతిలో అసెంబ్లీని నిర్వహిస్తున్నా.. హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవన ప్రాంతాన్నీ తిరిగి ఇవ్వ డం లేదు. భవనాలు ఖాళీగా అయినా ఉంచుతాం తప్ప ఒక్కగది కూడా ఇవ్వం అని చెప్పడం మీ మరుగుజ్జుతనానికి నిదర్శనం కాదా?

18. నిజాం నుంచి తెలంగాణలో ఉన్న ప్రభుత్వఆస్తుల్లో వాటాకోసం ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నది. కోర్టుల్లో కేసులు వేసింది. నాటి ఆస్తులకు తెలంగాణకే తప్ప, ఏపీకి వాటా ఉండదనే సత్యం తెలియదా? హైదరాబాద్‌ను నేనే నిర్మించానని పదే పదే చెప్పడం తెలంగాణ చరిత్రను పరిహసించడం కాదా?

19. తెలంగాణ ఏర్పాటు ఇక్కడి ప్రజలందరికీ ఆనందం కలిగిస్తే, మీరు బాధ పడలేదా? విభజన మాయని గాయమని అనలేదా? గవర్నర్ ప్రసంగంలోనూ ఇదే విషయం చెప్పించి మీ కసి తీర్చుకోలేదా? ఇది మీకున్న తెలంగాణ వ్యతిరేకతకు నిదర్శనం కాదా?

3119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles