అజాత శత్రువు.. తెలంగాణవాది

Thu,September 12, 2019 04:00 AM

-మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
-ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్
-చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టిన మంత్రులు, సభ్యులు
-దేశంలోనే ఉత్తమ చైర్మన్‌గా గుర్తింపు పొందాలి
-అభినందించిన మంత్రులు, అధికార, ప్రతిపక్ష సభ్యులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన, అజాతశత్రువుగా గుర్తింపు పొందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి.. శాసనమండలి చైర్మన్ స్థానానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తారని పలువురు మం త్రులు, మండలి సభ్యులు ఆకాంక్షించారు. మండలి చైర్మన్‌గా ఆయన దేశంలోనే గుర్తింపుపొందాలని అభిలషించారు. పంచాయతీవార్డు సభ్యుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి శాసనవ్యవస్థలో పెద్దలసభ చైర్మన్‌గా ఎన్నికవడం హర్షణీయమని పేర్కొన్నారు. పంచాయతీ, సహకార, మార్కెటింగ్, శాసనవ్యవస్థ.. ఇలా అన్ని విభాగాలతో అనుబంధం ఉన్నవ్యక్తి గుత్తా అని కొనియాడారు. మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ బుధవారం మండలిలో ప్రకటించారు. ఆయనను చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టాల్సిందిగా శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర సభ్యులకు సూచించారు. దీంతో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రతిపక్ష సభ్యులు జీవన్‌రెడ్డి, రాంచందర్‌రావు, జాఫ్రీ.. సుఖేందర్‌రెడ్డిని తోడ్కొని వెళ్లి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. ఆయనను అభినందించి మాట్లాడారు.

గుత్తాది అరుదైన వ్యక్తిత్వం: మంత్రి హరీశ్‌రావు

శాసనవ్యవస్థలో అత్యున్నతమైన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎంపికచేసిన సీఎం కేసీఆర్‌కు ఆర్థికమం త్రి టీ హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో గుత్తాది అరుదైన వ్యక్తిత్వమని అన్నారు. 38 ఏండ్ల సుదీర్ఘ రాజకీయజీవితంలో వార్డుమెంబర్ నుంచి అత్యున్నతమైన మండలి చైర్మన్ వరకు పదవులను అధిరోహించిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. పంచాయతీరాజ్, సహకార, మార్కెటింగ్ విభాగాలతోపాటు శాసనవ్యవస్థలోనూ సభ్యుడిగా కొనసాగారని కొనియాడారు. అనేక పదవులు విజయవంతంగా నిర్వహించిన ఆయన.. చైర్మన్ స్థానానికి వన్నె తీసుకొస్తారని అభిలషించారు.

బలమైన తెలంగాణవాది: మంత్రి కేటీఆర్

1971లో విద్యార్థి దశలోనే రాజకీయాల్లో పాల్గొన్నవ్యక్తి సుఖేందర్‌రెడ్డి అని, ఆ సమయానికి తనతోపాటు.. ఇక్కడున్నవారిలో కొంతమంది పుట్టనేలేదని ఐటీ, మున్సిపల్‌శాఖ మం త్రి కేటీఆర్ అన్నారు. డెయిరీ చైర్మన్‌గా సహకారరంగానికి గుత్తా చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. ఏ పార్టీల్లో ఉన్నా విజయం సాధించిన సుఖేందర్‌రెడ్డి బలమైన తెలంగాణవాది అని కేటీఆర్ అన్నారు. 1996లో నిర్మల్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలకు మంత్రిగా ఉన్న కేసీఆర్ ఇంచార్జిగా వ్యవహరించిన బృందంలో సుఖేందర్‌రెడ్డి కూడా ఒక సభ్యుడు అని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అనేకమార్లు తమతో చెప్పారని గుర్తుచేశారు. వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌గా.. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలికి చైర్మన్‌గా ఉండటం రైతులందరూ సంతోషపడే సందర్భమని తెలిపారు.

రైతు ప్రేమికులం: మంత్రి జగదీశ్‌రెడ్డి

గుత్తా సుఖేందర్‌రెడ్డి, తాను ఇద్దరం వ్యవసాయ, రైతు ప్రేమికులమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. జిల్లాకు చెందిన అనేక సమస్యలను చర్చించి పరిష్కరించామని, ఇకముందు కూడా ఆయనతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటానన్నారు. మండలి చైర్మన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ శాసనసభా వ్యవహరాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గుత్తా సుఖేందర్‌రెడ్డికి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదని.. చైర్మన్‌గా కూడా సమర్థంగా వ్యవహరిస్తారని చెప్పారు. నేటివరకు చేపట్టిన అన్ని పదవులకూ గుత్తా వన్నె తెచ్చారని హోంమంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. టీడీపీలో ఇద్దరం కలిసి పనిచేశామని మంత్రి తలసాని గుర్తు చేసుకొన్నారు. వార్డు మెంబర్ నుంచి అంచెలంచెలుగా చైర్మన్ స్థాయికి ఎదిగారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. టీడీపీ, ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో ఆయనతో కలిసి పనిచేశామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. దేశంలోనే మంచి చైర్మన్‌గా పేరు సంపాదిస్తారని ఆశిస్తున్నానని మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ చెప్పారు.

ఆయనను బలపర్చడం అదృష్టం: జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు

గుత్తా సుఖేందర్‌రెడ్డి లాంటివారిని మండలి చైర్మన్‌గా బలపర్చడం తమ అదృష్టంగా భావిస్తున్నామని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి అన్నారు. గుత్తాకు వివాదరహితుడిగా, అజాతశత్రువుగా పేరు ఉన్నదని తెలిపారు. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వాలని బీజేపీ సభ్యుడు రాం చందర్‌రావు కోరారు. అన్నిస్థాయిల్లో పదవుల అనుభవం ఉన్న సుఖేందర్‌రెడ్డి లాంటి వ్యక్తిని చైర్మన్‌గా ఎన్నుకోవడం శుభపరిణామమని ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఏఎమ్మార్పీ ప్రాజెక్టును పూర్తిచేయడం లో గుత్తా కృషి ఎంతోఉన్నదని టీఆర్‌ఎస్ స భ్యుడు కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇద్దరం ఒకే జిల్లావారమని, ప్రజాస్వామ్యంలో అందరికీ న్యాయంచేయాలని నాయిని నర్సింహారెడ్డి కోరారు. ఇద్దరం కలిసి 1999లో ఎంపీలుగా పనిచేశామని ప్రభుత్వ చీఫ్‌విప్ బీ వెంకటేశ్వ ర్లు గుర్తుచేసుకొన్నారు. ప్రభుత్వ విప్‌లు కర్నె ప్రభాకర్, భానుప్రసాద్‌రావు, సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఏ నర్సిరెడ్డి, కే జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి.. గుత్తాను అభినందించారు.

అత్యంత కీలకమైనది.. సంక్లిష్టమైనది: గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి చైర్మన్

మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు సీఎం కేసీఆర్, డిప్యూటీ చైర్మన్, అన్నిపక్షాల నాయకులు, సభ్యులకు గుత్తా సుఖేందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చట్టసభల అధ్యక్ష స్థానాలు అత్యంత కీలకమైనవే కాకుండా సంక్లిష్టమైనవన్నారు. ప్రజలకు అవసరమైన శాసననాలను రూపొందించేలా సభ్యులను కార్యోన్ముఖులను చేసి సభకు, సమాజానికి మధ్య సారథిగా వ్యవహరించాల్సిన గురుతర బాధ్యత తనపై ఉన్నదన్నారు. వినమ్రత, అంకితభావంతో ఈ బాధ్యతలు చేపడుతున్నానని గుత్తా చెప్పారు.

g-sukender-reddy2

గుత్తాకు అభినందనలు తెలిపిన స్పీకర్ పోచారం

శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. మండలి కార్యాలయానికి వచ్చిన పోచారం.. చైర్మన్ గుత్తాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉభయసభలు ప్రజాసమస్యలపై చర్చించి పరిష్కారం చూపడానికి కృషిచేద్దామని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ నేతలతోపాటు నల్లగొండ జిల్లా నుంచి నాయకులు తరలివచ్చి గుత్తాకు అభినందనలు తెలిపారు. చైర్మన్‌గా గుత్తా బాధ్యతల స్వీకరణను ఆయన కుటుంబసభ్యులు సభలో తిలకించారు.

1145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles