చెత్త కొనేస్తున్నారు!

Sun,September 15, 2019 03:14 AM

-అవసరం లేకపోయినా విచ్చలవిడి కొనుగోళ్లు
-వ్యర్థాల కుప్పగా మారుతున్న ఇండ్లు
-ఒక్కరోజు వినియోగం.. ఏడాదంతా మూలకే
-ఇంట్లో ఎటుచూసినా షాపింగ్‌చేసిన వస్తువులే
-ఆన్‌లైన్ కొనుగోళ్లతో పెరుగుతున్న వ్యర్థాలు

మీ ఇల్లొక వ్యర్థాల కుప్ప! తరచిచూస్తే నిజమనిపించడం ఖాయం! ఓసారి ఇంట్లో నలుదిక్కులా చూడండి.. వంద వరకు వస్తువులు కనిపిస్తాయి! వారంలో, నెలలో వాటిని ఎన్నిసార్లు వినియోగిస్తున్నారని ప్రశ్నించుకొంటే.. ఒకట్రెండు సార్లేనని సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది! మధ్యతరగతికి ఎగువ వర్గాల్లో పెరిగిన కొనుగోలు శక్తి కావొచ్చు.. ఆఫర్ల హోరు ఆకర్షించవచ్చు.. హోదా కోసం మనకూ ఉండాలనే తాపత్రయం వెరసి ఇంటినిండా రకరకాల వస్తువులే! వీటిని శివరాత్రికి శుభ్రంచేసి మళ్లీ యథాస్థానం పూజయామి అనాల్సిందే. ఇప్పుడు మీరు అవసరం లేని వస్తువులను కొంటూపోతే.. కొన్నాళ్ల తర్వాత మీకు అవసరమైన వస్తువుల్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఇవి అపర కుబేరుడు వారెన్‌బఫెట్ అన్న వ్యాఖ్యలు. అనవసరపు వస్తువులను కొంటున్నారంటే ప్రతిఇంట్లో చెత్త పేరుకుపోతున్నట్టే కదా! ఎంతమేరకు అవసరమో ఆలోచించి కొనుగోలుచేయడమే మేలు.

(శిరందాస్ ప్రవీణ్‌కుమార్) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఏ ఇంట్లో చూసినా రెండు బీరువాల నిండా దుస్తులు.. అటకమీద దుమ్మూధూళితో నిండిన వస్తువులు కనిపించడం సహజం. బీరువాలో ఉన్న డ్రెస్సులు/చీరెల్లో ధరించకుండా మూలన ఉంచేవే ఎక్కువ. కిచెన్‌లోనూ అరకిలో నుంచి పదికిలోలు వండేందుకు సరిపడా గిన్నెలు దర్శనిమస్తాయి. వీటిలో ఏడాదికోసారి వండివార్చని గిన్నెలే ఎక్కువ. ఏ ఇంట్లో చూసినా సగానికిపైగా వస్తువులు అలంకారప్రాయమే.

-ఆన్‌లైన్‌లో అందమైన బ్రోచర్లు, ఫొటోలు, వీడియోల్లో వస్తువులు కనిపిస్తే డబ్బుల్లేకపోయినా ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ, రెండు కొంటే మూడోది ఉచితమనే ఆఫర్లు, డిస్కౌంట్లు ఊరించి బోల్తాకొట్టిస్తాయి. అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో అం దుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనంగా మారుతున్నది. ఊరికే చూద్దామని యా ప్ ఓపెన్‌చేసి చివరికి ఏదోఒకటి ఆర్డర్ చేయ డం అప్రయత్నంగానే జరిగిపోతున్నది. దీంతో సంపాదనకు మించి ఖర్చుచేస్తూ పొదుపు అదుపు తప్పుతున్నది. అనవసరపు వస్తువులు పేరుకుపోతున్నాయి. ఒకరికి డ్రెస్సులు/చీరలు అవసరమైతే నలుగురు షాపింగ్‌మాల్‌కు వెళ్తున్నారు. చివరికి నలుగురూ ఏదోఒకటి కొనుగోలుచేస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో పెండ్లి, శుభకార్యానికి వస్ర్తాలు కొనేవాళ్లు. ఇప్పుడు ఇంటికి పెండ్లిపిలుపు వస్తే, పెండ్లికి వెళ్లేందుకూ షాపింగ్ చేస్తున్న మ హిళల సంఖ్య ఎక్కువవుతున్నది. ఒక ఫంక్షన్‌కు కట్టినచీరె మరోసారి కట్టేందుకు ససేమిరా అనడంతో బీరువాలో స్థ లం సరిపోవడం లేదు.

అభివృద్ధి చెందిన దేశాలే ఆదర్శం

అభివృద్ధి చెందిన దేశాల్లో నెలకు లక్షలు, కోట్లలో సంపాదిస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. కానీ వాళ్లెవరూ అవసరానికి మించి షాపింగ్ చేయరు.. వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పశ్చిమదేశాల్లోని ఇండ్లలో గృహోపకరణాలేవీ పెద్దగా కనిపించవు. అవసరానికి తగ్గట్టే కొంటున్నారు. వంట చేసుకునేందుకు నాలుగు గిన్నెలు చాలు. కానీ నలభై గిన్నెలను అటకెక్కించడం వల్ల ప్రయోజనం ఏమిటో కొనుగోలు చేసేటప్పుడు ఆలోచించాలి. ఏడాదికోసారైనా వాడని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడంతో వచ్చే దర్జా ఏపాటిదో బేరీజువేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

online-shopping2

కొనుగోళ్లలో మనమే టాప్

-వెబ్‌లైన్ ఇండియా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్లకుపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. అందులో చైనా తర్వాత ఇండియాలోనే అధికం. అదేస్థాయిలో ఆన్‌లైన్ మార్కెటింగ్‌లోనూ ముందువరుసలో ఉన్నాం.
-దేశంలో 42 శాతం మొబైల్ వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి.
-80 శాతం మొబైల్ వినియోగదారులు ఉత్పత్తుల కోసం వెతుకడం అలవాటుగా మారింది.
-2020నాటికి మొబైళ్లలో కావాల్సిన వస్తువుల కోసం 286 శాతం ఎక్కువగా యాప్స్, వెబ్‌సైట్లు బ్రౌజ్ అవుతాయని అంచనా.

ChandraShekar

సరైన అవగాహనతో కొనాలి

సూపర్‌మార్కెట్లలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో అంటగట్టడం సాధారణం. రుణంపై వడ్డీ తక్కువేనంటూ ఎక్కువ ధర ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేలాచేస్తారు. బహుళజాతి కంపెనీల మోజులోపడి అవసరంలేని వస్తువులన్నీ కొని ఇంట్లో షోకేస్‌లో ఉంచుతున్నాం. వెనుకటికి రెండు గదుల ఇల్లు చాలనిపించేది. ఇప్పుడు నాలుగు గదులున్నా.. ఇంకో గది ఉంటే బాగుండనిపిస్తున్నది. ప్రాధాన్యతాక్రమాన్ని మర్చిపోతే ప్రమాదమే. సరైన అవగాహన లేకపోతే కొన్న వస్తువును వాడకుండానే పడేయాల్సిన దుస్థితి వస్తుంది.
- చంద్రశేఖర్, బాధ్యత ఫౌండేషన్ ప్రతినిధి

Surender

ఆదాయాన్ని మించి ఖర్చులు

ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అందరికీ సమాచారం ఎక్కువైంది. అవసరం లేని వస్తువుల కొనుగోళ్లు కూడా పెరిగాయి. డ్రెస్సులు, చీరలు, గృహోపకరణాలు, అలంకార వస్తువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆదాయాన్ని మించి ఖర్చుచేచేస్తున్నారు. పక్కింటోళ్లు ఏదైనా కొన్నారని తెలిస్తే అంతకుమించిన వస్తువులు ఉండాలనే దర్పం ఎక్కువైంది. ఇది కుటుంబంలో ఆర్థికమాంద్యానికి దారితీస్తున్నది.
- సురేందర్, సేవ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి

2096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles