డిగ్రీకంటే ఉపాధికే మొగ్గు


Mon,August 19, 2019 02:06 AM

Growing interest in higher education

-ఉన్నతవిద్యపై యువకుల్లో తగ్గుతున్న మోజు
-ఇంటర్ పూర్తవగానే ఉద్యోగవేట
-స్వల్పకాలిక కోర్సులవైపు మొగ్గు
-విభిన్నంగా ముందుకు సాగుతున్న యువతులు
-ఉన్నతవిద్యపై పెరుగుతున్న ఆసక్తి
-మూడేండ్లుగా ఇదే ధోరణి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో చాలామంది యువకులు డిగ్రీ లాంటి ఉన్నత చదువులపై ఆసక్తి చూపడంలేదు. ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారిలో చాలామంది నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం వచ్చే ఉద్యోగాలు లేదా ఉపాధి చూసుకుంటున్నారు. డిగ్రీ చదివేందుకు ఆసక్తి చూపకుండా తక్షణ ఉపాధికి వీలుండే హోటల్ మేనేజ్‌మెంట్, హస్పిటాలిటీ లాంటి స్వల్పకాలిక కోర్సుల్లో చేరుతున్నారు. అయితే యువతులు మాత్రం ఉన్నత చదువులపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇంజినీరింగ్ లాంటి కోర్సులతోపాటు బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి సాధారణ డిగ్రీ కాలేజీల్లో కూడా భారీగానే చేరుతున్నారు.

దోస్త్ అధికారుల గత మూడేండ్ల అడ్మిషన్ నివేదికలు ఈ విషయాలను స్పష్టంచేస్తున్నాయి. 2017 విద్యాసంవత్సరంలో 90,696 మంది యువకులు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందితే.. యువతులు 1,10,109 మంది ప్రవేశాలు పొందారు. 2018లో యువకులు 94,483 మంది ప్రవేశాలు పొందితే.. యువతులు 1,07,384 మంది ప్రవేశాలు పొందారు. 2019లో ఇప్పటివరకు యువకులు 87,645 మంది ప్రవేశాలు పొందితే.. యువతులు 1,01,855 మంది ప్రవేశాలు పొందినట్లు దోస్త్ -2019 కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.

కామర్స్‌పై ఎక్కువ ఆసక్తి

సాధారణ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు ఎక్కువగా బీకాంలో, ఆ తర్వాత బీఎస్సీలో ప్రవేశాలు పొందుతున్నారు. ఈ కోర్సుల్లో కూడా యువకుల కంటే యువతులే ఎక్కువగా చేరుతున్నట్టు దోస్త్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2017లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీకాంలో 20,096 మంది విద్యార్థినులు, 19,245 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. 2018లో 20,345 విద్యార్థినులు, 19,347 మంది విద్యార్థులు బీకాంలో చేరగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 19,327 మంది విద్యార్థినులు, 17,711 మంది విద్యార్థులు బీకాంలో ప్రవేశాలు పొందారు. బీఎస్సీలో కూడా అదే సంప్రదాయం కొనసాగింది. 2017లో ఓయూ పరిధిలో 17,001 మంది విద్యార్థినులు, 10,478 మంది విద్యార్థులు బీఎస్సీలో ప్రవేశాలు పొందగా.. 2018లో 18,467 మంది విద్యార్థినులు, 11,941 మంది విద్యార్థులు చేరారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 16,319 మంది విద్యార్థినులు, 10,473 మంది విద్యార్థులు బీఎస్సీలో ప్రవేశాలు పొందారు. రాష్ట్రంలోని మిగిలిన వర్సిటీల డిగ్రీ కాలేజీల్లో కూడా దాదాపు ఇదే ధోరణి కొనసాగుతున్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. గతంతో పోల్చితే దేశవ్యాప్తంగా ఆడపిల్లల చదువుల శాతం క్రమేణా పెరుగుతున్నదని చెప్పారు. ఉన్నత విద్యలను అభ్యసించేలా యువతీ యువకులను ప్రోత్సహించి ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలవైపు వారి దృష్టిని మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యావేత్తలపై ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

2088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles