మా బొజ్జ గణపయ్య.. మళ్లీ రావయ్యా!


Mon,September 24, 2018 02:22 AM

grandly celebrated ganesh immersion in hyderabad

-గంగమ్మ ఒడికి గణనాథులు
-హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం
-జనసందోహమైన హుస్సేస్‌సాగర్ పరిసరాలు
-మధ్యాహ్నం ఒంటిగంటకే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం
-బాలాపూర్, చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్ మీదుగా సాగిన శోభాయాత్ర

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్ మీదుగా సాగిన గణేశుడి శోభాయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బాలాపూర్ గణేశుడి లడ్డు వేలం పాటలో రికార్డు స్థాయిలో రూ. 16.60 లక్షలు పలికింది.

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం అశేష జనసందోహం మధ్య అంగరంగ వైభవంగా ముగిసింది. ఆదివారం ఉదయం బాలాపూర్ నుంచి చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు నిమజ్జన శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. భక్తి పాటలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, డప్పు చప్పుళ్లు, యువత కేరింతలు, నృత్యాలతో నిమజ్జన యాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో రికార్డుస్థాయిలో రూ.16.60 లక్షలు పలికింది. మధ్యాహ్నం ఒంటిగంటకే ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనం పూర్తవగా, నగరంలోని మిగతా విగ్రహాలు సోమవారం తెల్లవారుజామువరకు గంగమ్మ ఒడికి చేరాయి. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. డీజీపీ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిమజ్జన తీరును డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఆదివారం హుస్సేన్‌సాగర్‌తోపాటు 35 చెరువుల్లో 54,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు అధికారులు ప్రకటించారు.

ganesh4

బాలాపూర్ నుంచి మొదలైన యాత్ర

ఆదివారం ఉదయం బాలాపూర్‌లో లడ్డూవేలం పాట ముగియగానే శోభాయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి చంద్రాయణగుట్ట, శాలిబండ, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, గన్‌ఫౌండ్రీ, బషీర్‌బాగ్, అబిడ్స్ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకున్నది. ఆదివారం హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరంలోని 35 చెరువుల్లో 54,500 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు అధికారులు ప్రకటించారు.

charminar

ఒంటిగంటకే సప్తముఖ గణేశుడి నిమజ్జనం

ముందుగా అనుకున్న ప్రకారమే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకే పూర్తిచేశారు. ఆఖరి పూజల అనంతరం ఆదివారం తెల్లవారుజామున 3:40 గంటలకు 57 అడుగుల సప్తముఖ కాలసర్ప మహా గణనాథుడిని ట్రాలీపైకి చేర్చారు. వెల్డింగ్ పనుల తదనంతరం ఉదయం 7:05 గంటలకు ఖైరతాబాద్ గ్రంథాలయం నుంచి వినాయకుడి ఊరేగింపు ప్రారంభం కాగా, లక్డీకాపూల్, టెలిఫోన్‌భవన్, సెక్రటేరియట్ ైఫ్లెఓవర్, సచివాలయం మీదుగా ఉదయం 11: 30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నది. అక్కడ అర్చకులు మహాగణపతికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి విజయవాడ నుంచి తెప్పించిన జర్మన్ సాంకేతిక పరిజ్ఞానం గల 400 టన్నుల సామర్థ్యంగల భారీ క్రేన్ సాయంతో మధ్యాహ్నం 12:55 గంటలకు హుస్సేన్‌సాగర్ లో నిమజ్జనం చేశారు. ఇక నిమజ్జనం సమయంలో మొదటి సారిగా భక్తులకు తుది దర్శనమిచ్చేలా విగ్రహాన్ని క్రేన్ సాయంతో 360 డిగ్రీలు చుట్టూ తిప్పడం గమనార్హం. ఇది అక్కడికి వచ్చిన వారికి కనులవిందుచేసింది.

ganesh2

సాగర్ ఒడ్డున జన జాతర

ఆదివారం సెలవుదినం కావడంతో పలు ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున హుస్సేన్‌సాగర్ వద్దకు తరలిరావడంతో జాతరను తలపించింది. నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. ఎంజే మార్కె ట్, సచివాలయం, చార్మినార్ ప్రాంతాల్లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు స్వాగతవేదికలను ఏర్పాటు చేసి భక్తులకు స్వాగతం పలికారు. జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుని నిమజ్జనం సాఫీగా సాగేందుకు శ్రమించారు. పారిశుద్ధ్య కార్మికులు, స్వీపింగ్ యంత్రాలతో ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలిగించారు. జలమండలి అధికారులు 101 ప్రాంతాల్లో 30 లక్షల మంచినీటి ప్యాకెట్లను పంపిణీచేశారు. పలు సేవా సంస్థలు, దాతలు భక్తులకు దారిపొడవునా ప్రసాదాలు, మంచినీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేసి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు.

ganesh3

పోలీసుల భారీ బందోబస్తు

నిమజ్జనాన్ని పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 35 వేల మంది పోలీసు సిబ్బంది నిమజ్జన శోభాయాత్ర సాఫీగా సాగేందుకు సహకరించారు. నిమజ్జనం కోసం 4 వేల సీసీ కెమెరాలును ఏర్పాటు చేయగా, ఇప్పటికే నగరంలో ఉన్న 2.40 లక్షల సీసీ కెమెరాలు సైతం నిఘా పెట్టాయి.

వీడ్కోలు పలికిన ప్రముఖులు

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పలు ప్రాంతాల్లో పర్యటించి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి పూజల్లో పాల్గొన్న ఆయన సికింద్రాబాద్, నెక్లెస్‌రోడ్, మదీన, చార్మినార్, ఎంజేమార్కెట్ తదితర ప్రాంతాల్లో వినాయకులను దర్శించి, ఊరేగింపునకు స్వాగతం పలికారు. బాలాపూర్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి పాల్గొని నిమజ్జన యాత్రను ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పరిపూర్ణానంద చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహించి నిమజ్జన యాత్రలో పాల్గొన్నారు.

2265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS