వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం


Tue,April 16, 2019 01:57 AM

Governor Narasimhan Couple Attends Sri Rama Pattabishekam at Bhadrachalam

-స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించిన గవర్నర్ దంపతులు
-వేలాదిగా హాజరైన భక్తులు

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం.. మిథిలా ప్రాంగణం కల్యాణ మండపంలో సోమవారం శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తొలుత రామాలయంలోని భద్రుని మండపంలో ఉదయం అర్చకులు స్వామివారి పాదుకలకు అభిషేకంచేశారు. అనంతరం రాజలాంఛనాలతో గౌతమీ నదీతీరం నుంచి పవిత్ర తీర్థాలు తీసుకొచ్చారు. ఉదయం 9.30 నిమిషాలకు స్వామివారి కల్యాణమూర్తులను రామాలయం నుంచి వేద పండితుల మంత్రోచ్చారణలు, బాజాభజంత్రీలు, కోలాట నృత్యాల సందడితో ఊరేగించి.. కల్యాణ మండపంపై వేంచేయింపజేశారు. అర్చకులు తొలుత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించి.. పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణకిరీటం, ఖడ్గం, రత్నాభరణాలు స్వామివారికి ధరింపజేశారు.

అర్చకులు ఈ ఆభరణాలను భక్తులకు చూపించడంతో భక్తులు నమస్కరించుకున్నారు. ఈ వేడుకలో దేవస్థ్ధానం స్థానాచార్యులు స్థలసాయి.. శ్రీరామ పట్టాభిషేక పారాయణంచేశారు. రుగ్వేదం, యజర్వేదం, సామవేదం, అదర్వణవేదం, శుక్లయజర్వేదం, రామాయణం, విష్ణుపురాణం, భాగవతశాస్త్ర పారాయణాలను వేదపండితులు చేశారు. తర్వాత పుష్కర నదీ జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ నిర్వహించి, 11శ్లోకాలతో మంగళీచరణచేస్తూ.. హారతి ఇచ్చారు. అర్చకులు భక్తులతో పలు స్తోత్రాలు పఠింపజేయడంతో మిథిలా ప్రాంగణమంతా రామనామస్మరణతో మారుమోగింది. పట్టాభిషేకం ముగిసిన అనంతరం అర్చకులు భక్తులపై పుణ్యనది జలాలను చల్లారు.

Bhadardi-temple2

పట్టువస్ర్తాలు సమర్పించిన గవర్నర్ దంపతులు

భద్రాద్రి శ్రీరామ పట్టాభిషేకానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అంతకుముందు గవర్నర్ దంపతులు సతీసమేతంగా భద్రాద్రి రామాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

Bhadardi-temple3

పులకించిన భక్తజనం

శ్రీరామపట్టాభిషేకానికి భక్తులు వేలసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్తజనం.. భద్రాద్రిలోనే సేదతీరి.. సోమవారం ఉదయం పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసి తరించారు. వేడుకలో గవర్నర్ సెక్రటరీ సురేంద్రమోహన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, జిల్లా ఎస్పీ సునీల్‌దత్, సబ్ కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ట్రైనీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్, రామాలయ ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు, భద్రాచలం ఏఎస్పీ రాజేశ్‌చంద్ర, అహోబిలం రామానుజ జీయర్‌స్వామి, దేవస్థానం ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు, రాఘవాచార్యులు, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలసాయి తదితరులు పాల్గొన్నారు.

905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles