తెలుగు భాషా భగీరథుడు కేసీఆర్


Wed,December 20, 2017 02:51 AM

Governor E S L Narasimhan Speech World Telugu Conference 2017

-ఐదు రోజుల తెలుగు పండుగ అద్భుతం
-పుట్టినరోజు నాడు పిల్లలకు మంచి తెలుగు పుస్తకం బహుమతినివ్వండి
-గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్

GovernorESLNarasimhan
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. పిల్లల పుట్టిన రోజునాడు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో తల్లిదండ్రులు వారికి మంచి తెలుగు పుస్తకం కొనివ్వాలని సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవంలో ఆయన తెలుగులో మాట్లాడారు. ఐదు రోజుల పండుగ, అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగుభాష భగీరథుడిగా వచ్చారంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు భాషాతల్లికి తెలంగాణ ప్రణమిల్లింది. భాషా తల్లి అందుకో నా అభినందనమాల. 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, 42 దేశాల నుంచి వచ్చిన తెలుగు బిడ్డలు, భాషాభిమానులతో బమ్మెర పోతన ప్రాంగణం పులకరించింది. గత ఐదు రోజుల నుంచి అవధానాలు, చర్చలు, గోష్ఠులు, కవి సమ్మేళనాలు, ఇతర సాహిత్య కార్యక్రమాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలతో మన అందరి హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఇంత గొప్ప భాష పండుగలో ఉత్సాహంగా పాలుపంచుకున్న మీ అందరికీ నా అభినందనలు. మహాసభలు ముగిశాయి. కానీ, మన బాధ్యత ఇప్పుడే మొదలైంది.

మాతృభాష రక్షణ, వికాసం కుటుంబం మీ నుంచే మొదలుకావాలి. అందుకు ప్రతి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని ఉద్బోధించారు. ఈ సందర్భంగా.. తెలుగు భాష గొప్పదనం.. తెలుగుజాతి తియ్యదనం.. తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం... న్న పాటను గుర్తుచేస్తూ.. ఈ గొప్ప సంపదను కాపాడటానికి మనమందరం చేయి చేయి కలుపాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఏ భాష, సంస్కృతి బాగా వృద్ధి చెందాలన్నా.. మీడియా ముఖ్యపాత్ర పోషించాలని చెప్పారు. బంగారు బతుకమ్మలతో సరదాల సంక్రాంతి కలిసి అక్షరాల దసరా ఆడినట్టుంది అని చెప్పారు. తెలంగాణ వంటకాలతో, మహాసభలు విజయవంతం చేసిన ప్రభుత్వ యంత్రాంగాన్ని, వివిధ కమిటీలను ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. చేయెత్తి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘన కీర్తి కలవాడా.. అంటూ ముగించారు.

3069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles