పెన్షనర్లకు యాప్

Wed,October 23, 2019 02:18 AM

-రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త
-ఉన్నచోటుకే పింఛన్
-టీ యాప్ ఫోలియోలో ఫొటో పంపితే చాలు
-స్వయంగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదు
-పక్కాగా యాప్ రూపొందించిన టీఎస్‌టీఎస్
-దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రయోగం
-రాష్ట్రవ్యాప్తంగా వచ్చేనెల నుంచి అమలు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పదవీవిరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పింఛన్ పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన అవసరం లేదు! ప్రతిసారి యాన్యువల్ లైఫ్ సర్టిఫికెట్, వేలిముద్రలు ఇచ్చే బాధ ఇకపై తప్పనున్నది! ఉన్నచోటినుంచే మొబైల్‌యాప్ ద్వారా ఫొటో దిగి సంబంధితశాఖకు పంపితే, ఖాతాలో ఫించన్ జమ కానున్నది. దీనికోసం టీ-యాప్ ఫోలియోను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఫేస్ రికగ్నిషన్ ఫర్ లైఫ్ సర్టిఫికేషన్ టూల్ ద్వారా ఫొటో పంపించాలి. దేశంలోనే తొలిసారి తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్)పకడ్బందీగా ఈ యాప్‌ను రూపొందించింది. ఈ విధానాన్ని వచ్చేనెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నట్టు ట్రెజరీస్, అకౌంట్స్ డైరెక్టర్ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. యాప్‌ను రిటైర్డ్ ఉద్యోగులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం

వాస్తవానికి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ పొందాలంటే నిబంధనల ప్రకారం ఏటా బతికే ఉన్నట్టు నిరూపించుకోవడానికి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. పదవీ విరమణ ఎక్కడైతే చేశారో, ఆ ప్రాంతంలోని పెన్షన్ కార్యాలయానికి వెళ్లి బ్యాంక్ ఖాతా, వేలి ముద్రలు కూడా ఇవ్వాలి. వయస్సుమీరినవారిలో వేలిముద్రలు చెదిరిపోయి, గతం వేలిముద్రలతో సరిపోలక పెన్షన్ పొందడం కష్టమవుతున్నది. ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) ఫేస్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు)సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసింది. దీన్ని ఇప్పటికే రూ పొందించిన టీ యాప్ ఫోలియోకు జతచేశారు.

బయోమెట్రిక్ ఐడీ ఆథెంటికేషన్, ఫేషియల్, డెమోగ్రాఫిక్ ఆథెంటికేషన్, డీప్ లెర్నింగ్ ఫోటో మెషిన్ ద్వారా లోపాలకు ఆస్కారం లేకుండా ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. పెన్షనర్లు యాప్‌లో ఐడీ నంబర్‌ను నిక్షి ప్తం చేయడంతోపాటు ఫొటోను దిగి ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు పంపాలి. ఈ ఫొటో అసలై న వ్యక్తిదా? కాదా? అనేది తెలుసుకొనేందుకు గతంలో ఇచ్చిన ఫొటోతో పోల్చిచూస్తారు. మూడు దశల్లో జరిగే ఈ ప్రక్రియ వల్ల అనర్హులు పెన్షన్ పొందే ఆస్కారమే లేదని ఈ- గవర్నెన్స్, మీ-సేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్‌తో పెన్షనర్లు ఈ సులభమైన విధానాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

3083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles