రైతుబంధు కోల్పోతున్నాం..


Tue,June 18, 2019 03:20 AM

Gouraram farmers Demands to change vro immediately

-చెప్పులు అరిగేలా తిరిగినా పని కావడంలేదు
-నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి తాసిల్ ఎదుట రైతుల ఆందోళన
-గౌరారం వీఆర్వోను వెంటనే మార్చాలని డిమాండ్

బిజినేపల్లి/కోడేరు: చెప్పులు అరిగేలా తాసిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పని కావడంలేదని నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గౌరారం రైతులు వాపోయారు. సోమవారం బిజినేపల్లిలోని తాసిల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి తాసిల్దార్ కృష్ణకు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వీఆర్వో శ్రీనును వెంటనే తొలిగించి కొత్త వీఆర్వోకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌చేశారు. భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాస్‌పుస్తకాలు అందక రైతుబంధు పథకానికి అనర్హులమయ్యామని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో మొత్తంలో 128 సర్వే నంబర్లు ఉన్నాయని, వాటిలో 75శాతం సమస్యలు ఉన్నాయని, కేవలం 25 శాతం మాత్రమే సక్రమంగా చేశారని వివరించారు. పాస్‌పుస్తకాలు ఎవరికీ రాలేదని, డిజిటల్, విరాసత్ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పారు.

సమగ్ర సర్వే తర్వాత గ్రామంలోని భూముల రికార్డులు గందరగోళంగా తయారయ్యాయని, ఈ భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని, కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఆర్డీవో, కలెక్టర్లకు ఫిర్యాదుచేశామని తెలిపారు. వీఆర్వో గ్రామానికి రావడం లేదని వాపోయారు. చాలా మంది బతుకుదెరువు కోసం వలస వెళ్తుంటారన్నారు. రైతుల భూములను వీఆర్వో తారుమారు చేశారని, డబ్బులు తీసుకొని కూడా పనులుచేయడం లేదని ఆరోపించారు. వీఆర్వో పనితీరు బాగాలేదని, అతడిని ఇక్కడి నుంచి బదిలీచేయాలని డిమాండ్‌చేశారు. ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం తాసిల్దార్ కృష్ణకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై స్పందించిన తాసిల్దార్.. ఈ నెల 20వ తేదీ తర్వాత గ్రామానికి డిప్యూటీ తాసిల్దార్, ఆర్‌ఐ, రెవెన్యూ సిబ్బందిని పంపించి భూముల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

కోడేరు తాసిల్ ఎదుట రైతుల ధర్నా

తమ భూములను కంప్యూటరీకరణ చేయాలంటూ సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు తాసిల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తాసిల్దార్ సుందర్‌రాజు కార్యాలయానికి చేరుకొని భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.


లక్ష్మమ్మ, గౌరారం

విరాసత్ చేస్తలేరు

భూమిని విరాసత్ చేస్తలేరు. విరాసత్ కోసం వీఆర్వోకు రూ.2 వేలు ఇచ్చా ను. నా భర్త పేరు మీద 2.30 ఎకరా ల భూమి ఉన్నది. ఏడాదిగా విరాసత్ కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకొంటలేరు. మాకు న్యాయంచేయండి.
- లక్ష్మమ్మ, గౌరారం


కుంటమ్మ, గౌరారం

1.20 ఎకరాలే వచ్చింది

5.20 ఎకరాలకు ఆన్‌లైన్‌లో 1.20 ఎకరాలే ఎక్కింది. సమగ్ర సర్వేకు ముందు 5.20 ఎకరాలు ఉండేది. కొత్త పాస్‌పుస్తకం 1.20 ఎకరాలకు మాత్రమే వచ్చింది. మిగతా నాలుగెకరాలను కూడా ఆన్‌లైన్‌లో ఎక్కించాలని తిరుగుతున్న.
- కుంటమ్మ, గౌరారం

535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles