రాష్ట్ర సాధనకు బాటలు వేసిన పాట


Mon,December 18, 2017 02:41 AM

Goreti Venkanna Praises Cm Kcr Prapancha Telugu Mahasabhalu

-తెలంగాణకు పూలబాటపర్చిన బతుకమ్మ పాట
-శాననమండలి చైర్మన్ స్వామిగౌడ్
-పోతన వేదికపై సాహిత్య సాంస్కృతిక సదస్సులు
-నుడికారాలు భాష ఆత్మసౌందర్య దీపాలు

GoretiVenkanna
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సాధన ఉద్యమానికి పాట బాటలు వేసిందని, బతుకమ్మ పాట తెలంగాణకు పూలబాట పర్చిందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా ఎల్బీ స్టేడి యం, సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై జరిగిన సాహిత్య సాంస్కృతిక సదస్సులో స్వామిగౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు ఎవరూ ఊహించనంత గొప్పగా జరుగుతున్నాయని, తెలంగాణ అంతటా పండుగ జరుగుతున్నట్టుగా ఉందన్నారు. పాటలను తూటాలుగా మలిచిన గోరటి వెంకన్న, అందెశ్రీ, దేశపతి శ్రీనివాస్, గద్దర్, జయరాజ్‌వంటి వారందరూ ప్రజల నాల్కలపై వాగ్గేయకారులుగా నిలిచిపోతారని చెప్పారు.

నుడికారాలు తెలంగాణ భాష ఆత్మ సౌందర్య దీపాలు

జానపద సాహిత్యం కూరాడు కుండ వంటిదని నలిమెల భాస్కర్ స్పష్టం చేశారు. మౌఖిక సాహిత్యంపైన చాలా పరిశోధనలు జరిగాయని, వేముల పెరుమాళ్లు వంటి జాతీయాలను, నుడికారాలను, సామెతలను సేకరించి గొప్ప భాషా సేవ చేశారని చెప్పారు. నుడికారాలు తెలంగాణ భాష ఆత్మసౌందర్యదీపాలని అభివర్ణించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్, డాక్టర్ వెలిచాల కొండల్‌రావు, కసిరెడ్డి వెంకటరెడ్డి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సత్యవ్రతశాస్త్రి మాట్లాడారు. ఆకాశవాణి డైరెక్టర్ రాసిన పటం కథలు, తెలంగాణ తేజోమూర్తులు పుస్తకాలు, రసమయి బాలకిషన్ రచించి, గానం చేసిన జానపద గీతాల సీడీని, తెలంగాణ తొలి నవల ఆశాదోషం నవల, గోరటి వెంకన్నపై రాసిన కవితా పరామర్శ అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఆటపాటతో అలరించిన తెలంగాణ సాంస్కృతిక సారథి

సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై జానపద కళారూపాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ శరణు గంగా భవానీ మాత... అని పాడుతూ జానపద ప్రదర్శనను ప్రారంభించారు. సాంస్కృతిక సారథి కళాకారుల బృందం ఆటపాటలతో తెలంగాణ పల్లె సంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పేలా ప్రదర్శనలు కొనసాగించారు.
GoretiVenkanna1

గల్లీ చిన్నదీ..!

ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మెచ్చుకున్న పాట.. గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది... వాళ్లున్న ఇల్లు కిల్లీ కొట్టుకన్న సిన్నగున్నదో..! అంటూ గోరటి వెంకన్న ఆట, పాటకు ఆద్యంతం ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలు కొట్టారు. 40 ఏండ్ల నుంచి పాటపాడుతున్న ఏ ముఖ్యమంత్రన్నా పొగిడిండా.. నన్ను గుర్తుంచుకొని నా పాటను ప్రజలకు గుర్తుచేసిన సీఎం కేసీఆర్‌కు నా కృతజ్ఞతలు అని గోరటి వెంకన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆయనను సత్కరించారు. నీ పాదంమీద పుట్టుమచ్చనై.. పాటపాడి వందేమాతరం శ్రీనివాస్ అలరించారు. అనంతరం మంగళ, రాఘవరాజ్ భట్.. గిరిజన సంప్రదాయ జానపద నృత్యంతో సాగిన పాట ఆకట్టుకుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీ లకా్ష్మరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

బిడ్డలు ఏడ్చినా ఇంగ్లిషులోనే ఏడ్వాలి..

పిట్టకథ చెప్పిన పద్మాదేవేందర్‌రెడ్డి
తల్లి తన బిడ్డను ఇం గ్లిష్ మీడియం బడిలో చేర్చించిందట. ఆమె ఒకరోజు మధ్యాహ్నం లంచ్ తినిపించడానికి బడికి వెళ్లిందట.. పాప చేయి కడుక్కోవడానికి నల్లా దగ్గరకు వెళ్లి కిందపడిపోయింది... ఆపాపలేచి అమ్మా అంటూ పెద్దగా ఏడ్చిందట.. అయితే ఆ తల్లి ఆమెను ఓదార్చకపోగా ఇంకా కొట్టిందట. టీచర్ ఎందుకమ్మా ఇంకా కొడుతున్నావ్ అనడిగితే.. ఆ తల్లి రూ.50 వేలు పోసి ఇంగ్లిషు మీడియంలో చేర్పిస్తే ఈ బిడ్డ ఇంగ్లిషులో ఏడ్వకుండా.. తెలుగులో ఏడుస్తుంది అని సమాధానం చెప్పిందట.. అంటూ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పిన పిట్టకథతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.
GoretiVenkanna2

5429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles